ఫైనల్‌ మ్యాచ్‌లో హైడ్రామా.. లైవ్‌లోనే తన్నుకున్న ఆటగాళ్లు! | Tempers-Explode-Players-Fight-Thrilling-T20-mumbai-league-Final-Wankhede | Sakshi
Sakshi News home page

T20 Mumbai League: ఫైనల్‌ మ్యాచ్‌లో హైడ్రామా.. లైవ్‌లోనే తన్నుకున్న ఆటగాళ్లు!

Jun 14 2026 3:31 PM | Updated on Jun 14 2026 4:48 PM

Tempers-Explode-Players-Fight-Thrilling-T20-mumbai-league-Final-Wankhede

టీ20 ముంబై లీగ్ 2026 విజేత‌గా ఎమ్‌ఎస్‌సి మరాఠా రాయల్స్ నిలిచింది. శ‌నివారం వాంఖ‌డే స్టేడియం వేదిక‌గా జ‌రిగిన ఫైన‌ల్లో ఆర్క్స్ అంధేరిపై 8 ప‌రుగుల తేడాతో విజ‌యం సాధించిన మ‌రాఠా రాయ‌ల్స్ డిఫెండింగ్ చాంపియ‌న్ హోదాను నిలుపుకుంది. అయితే మ్యాచ్ ముగిశాకా ఇరుజట్ల ఆట‌గాళ్లు మైదానంలోనే గొడ‌వ‌కు దిగారు. ఒకానొక దశలో ఇద్దరు క్రికెటర్లు దాడి చేసుకునే వరకు వెళ్లారు. 

దీంతో అక్కడి వాతావరణం వేడెక్కింది. అంపైర్లు జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.విష‌యంలోకి వెళితే మరాఠా రాయల్స్ నిర్దేశించిన లక్ష్య ఛేదనలో ఆర్క్స్ అంధేరి ఇన్నింగ్స్ 19వ ఓవర్లో ఈ వివాదం మొదలైంది. ఆ ఓవర్ రెండో బంతికి అంధేరి బ్యాటర్ గౌరవ్ జతార్ సిక్స్ కొట్టాడు. 

అయితే ఆ తర్వాతి బంతికే ఇర్ఫాన్ ఉమైర్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా ఔటయ్యాడు. దీంతో రాయల్స్ ఆటగాళ్లు సంబరాలు చేసుకుంటుండగా, గౌరవ్ అసహనం వ్యక్తం చేశాడు. గౌరవ్ పెవిలియన్ వైపు వెళ్తుండగా.. డగౌట్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న మరాఠా రాయల్స్ ఆటగాడు రోహన్ రాజేతో అతనికి మాటల యుద్ధం నడిచింది. 

మొదట ఫోర్త్ అంపైర్ ఇద్దరినీ విడదీసినప్పటికీ.. వారు మళ్లీ ఒకరినొకరు నెట్టుకుంటూ తీవ్రమైన వాగ్వాదానికి దిగారు. దీంతో అంధేరి జట్టు సభ్యులతో పాటు మరాఠా రాయల్స్ ఆటగాళ్లు కూడా స్టేడియంలోకి పెరిగెత్తుకుంటూ వచ్చి రోహన్‌, గౌరవ్‌లకు సర్ది చెప్పడంతో వివాదం ముగిసింది.

ఫైన‌ల్ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన మ‌రాఠా జ‌ట్టు నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 5 వికెట్లు కోల్పోయి కేవ‌లం 154 ప‌రుగుల‌కే ప‌రిమిత‌మైంది. ఎమ్‌ఎస్‌సి బ్యాట‌ర్ల‌లో చిన్మయ్ రాజేష్ సుతార్(61) టాప్ స్కోర‌ర్‌గా నిల‌వ‌గా.. కెప్టెన్ సిద్దేశ్ లాడ్‌(33) కాస్త దూకుడుగా ఆడాడు.  వీరిద్ద‌రూ మిన‌హా మిగితా ప్లేయ‌ర్లంతా దారుణంగా విఫ‌ల‌మ‌య్యారు. 

అంధేరి బౌల‌ర్ల‌లో అర్జున్ టెండూల్క‌ర్ రెండు, శివ‌మ్ దూబే, ముషీర్ ఖాన్ త‌లా వికెట్ సాధించారు. అనంత‌రం ఏఆర్‌సీఎస్ అంధేరి 20 ఓవ‌ర్ల‌లో 8 వికెట్ల న‌ష్టానికి 146 ప‌రుగుల‌కే ప‌రిమిత‌మైంది. దివ్యాన్ష్ స‌క్సేనా (51) టాప్ స్కోర‌ర్‌గా నిలిచాడు. మ‌రాఠా బౌల‌ర్ల‌లో ఆదిత్య ధుమాల్‌, తుషార్ దేశ్‌పాండే, ఇర్ఫాన్ ఉమెర్ త‌లా రెండు వికెట్లు తీశారు. తుషార్ దేశ్‌పాండేను ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్ వ‌రించ‌గా, సువేద్ పార్క‌ర్ ప్లేయ‌ర్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచాడు.

చదవండి: 24 ఏళ్ల త‌ర్వాత బ‌రిలోకి.. ట‌ర్కీకి షాక్ ఇచ్చిన ఆసీస్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement