టీమిండియాను వదలని గాయాల బెడద.. అతడు కూడా అవుట్‌? | Sakshi
Sakshi News home page

Ind vs Eng: మహ్మద్‌ షమీ మరికొన్నాళ్లు.. ఇప్పట్లో కష్టమే!

Published Mon, Jan 8 2024 2:38 PM

Team India Suffers Mohammed Shami Blow Rules Out Till: Report - Sakshi

Ind vs Eng Test Series- 2024: టీమిండియా వెటరన్‌ బౌలర్‌ మహ్మద్‌ షమీ ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌కు దూరమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. గాయం నుంచి పూర్తిగా కోలుకోని కారణంగా అతడు ఇప్పట్లో మైదానంలో దిగడం కష్టమనే వార్తలు వినిపిస్తున్నాయి. వన్డే వరల్డ్‌కప్‌-2023లో ఆలస్యంగా ఎంట్రీ ఇచ్చినప్పటికీ షమీ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న విషయం తెలిసిందే.

సొంతగడ్డపై జరిగిన ఐసీసీ టోర్నీలో మూడుసార్లు ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేసిన ఈ స్టార్‌ పేసర్‌.. 24 వికెట్లు పడగొట్టాడు. తద్వారా తాజా ఎడిషన్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా అవార్డు అందుకున్నాడున. చీలమండ నొప్పితో బాధపడుతున్నప్పటికీ ఇంజక్షన్లు తీసుకుంటూ ఈ ఈవెంట్‌ను పూర్తి చేశాడు షమీ.

ప్రపంచకప్‌ ముగిసిన తర్వాత విశ్రాంతి తీసుకున్న షమీ.. గాయం నుంచి కోలుకొని కారణంగా సౌతాఫ్రికా పర్యటనకు వెళ్లలేకపోయాడు. అయితే, స్వదేశంలో ఇంగ్లండ్‌తో సిరీస్‌ నాటికి అతడు అందుబాటులోకి వస్తాడనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కానీ.. తాజా సమాచారం ప్రకారం అతడు ఇంగ్లండ్‌తో తొలి రెండు టెస్టులకు దూరం కానున్నట్లు తెలుస్తోంది.

ఈ విషయం గురించి బీసీసీఐ వర్గాలు ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌తో మాట్లాడుతూ.. ‘‘షమీ ఇప్పటికీ బౌలింగ్‌ ప్రాక్టీస్‌ మొదలుపెట్టలేదు. జాతీయ క్రికెట్‌ అకాడమీకి వెళ్లి అతడు ఫిట్‌నెస్‌ నిరూపించుకోవాల్సి ఉంది. కాబట్టి ఇంగ్లండ్‌తో తొలి రెండు మ్యాచ్‌లకు అతడు అందుబాటులో ఉండకపోవచ్చు’’ అని పేర్కొన్నాయి. 

కాగా సౌతాఫ్రికా పర్యటనలో టీమిండియా ప్రధాన పేసర్లు జస్ప్రీత్‌ బుమ్రా, మహ్మద్‌ సిరాజ్‌ అదరగొట్టారు. వీరిద్దరి విజృంభణ కారణంగా కేప్‌టౌన్‌లో జరిగిన రెండో టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించింది. తద్వారా సిరీస్‌ను 1-1తో డ్రా చేసుకోగలిగింది. 

అయితే, అఫ్గనిస్తాన్‌తో టీ20 సిరీస్ సందర్భంగా వీరిద్దరికి మేనేజ్‌మెంట్‌ విశ్రాంతినిచ్చింది. ఇంగ్లండ్‌తో టెస్టులకు వీరిలో ఒక్కరు అందుబాటులోకి వచ్చినా షమీ లేనిలోటు తెలియదు. అలాకాక ఇద్దరికీ రెస్ట్‌ పొడిగిస్తే.. యువ ఫాస్ట్‌బౌలర్లకు అవకాశం దక్కొచ్చు.

అయితే, ఉపఖండ పిచ్‌లపై స్పిన్నర్లే ఎక్కువ ప్రభావం చూపగలరు కాబట్టి.. పేస్‌ దళం గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కాగా టీమిండియా ప్రస్తుతం గాయాల బెడదతో సతమతమవుతోంది. ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా, టీ20 స్టార్‌ సూర్యకుమార్‌ యాదవ్‌, రుతురాజ్‌ గైక్వాడ్‌ ఇప్పటికే ఆటకు దూరమయ్యారు. ఇదిలా ఉంటే.. జనవరి 11- 17 మధ్య అఫ్గనన్‌తో టీ20 సిరీస్‌ ఆడనున్న టీమిండియా.. తదుపరి జనవరి 25 నుంచి ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌ మొదలుపెట్టనుంది.

చదవండి: ‘మనం వద్దని మాల్దీవులు ఓటేసింది.. ఇకపై అక్కడికి వెళ్తారా? లేదా..’  

Advertisement
 
Advertisement