Photo Credit: BCCI Twitter
ఇంగ్లండ్, ఐర్లాండ్ చేతిలో టీ20 సిరీస్‌లు కోల్పోయిన టీమిండియా నెంబర్‌వన్ ర్యాంకును కూడా కోల్పోయింది. తాజాగా జింబాబ్వేతో జరుగుతున్న టీ20 సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే కైవసం చేసుకుంది. పనిలో పనిగా మరోసారి పొట్టి ఫార్మాట్‌లో అగ్రపీఠాన్ని అందుకుంది.
60 మ్యాచ్‌లాడిన టీమిండియా 268 పాయింట్లతో తొలి స్థానంలో ఉండగా, రెండో స్థానంలో ఇంగ్లండ్ (268 పాయింట్లు) ఉండగా, 260 పాయింట్లతో ఆస్ట్రేలియా మూడో స్థానంలో నిలిచింది. ఇంగ్లండ్, భారత్ మధ్య పాయింట్ల మధ్య వ్యత్యాసం లేకున్నప్పటికీ భారత్ ఎక్కువ మ్యాచ్‌లు ఆడడంతో నంబర్‌వన్ స్థానాన్నితిరిగి హస్తగతం చేసుకుంది. మూడో టీ20లోనూ గెలిచి సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేస్తే మాత్రం టీమిండియా నంబర్‌వన్ ర్యాంకు మరింత పటిష్టం కానుంది.
శనివారం జరిగిన రెండో మ్యాచ్‌లో శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని టీమిండియా 90 పరుగుల తేడాతో ఆతిథ్య జింబాబ్వేను చిత్తు చేసింది. తద్వారా మరో మ్యాచ్ మిగిలుండగానే 2–0తో సిరీస్ పట్టేసింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత్ నిర్ణిత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ఇషాన్ కిషన్ (44 బంతుల్లో 81; 9 ఫోర్లు, 2 సిక్స్‌లు), హైదరాబాదీ తిలక్ వర్మ (29 బంతుల్లో 60 నాటౌట్; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధశతకాలతో మెరిశారు.
అనంతరం భారీ లక్ష్యఛేదనలో జింబాబ్వే 17.5 ఓవర్లలో 129 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ బ్రియాన్ బెన్నెట్ (19 బంతుల్లో 32; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) టాప్ స్కోరర్ కాగా... తక్కినవాళ్లంతా విఫలమయ్యారు. భారత బౌలర్లలో అభిషేక్ శర్మ 3 వికెట్లు పడగొట్టగా... అరంగేట్ర పేసర్ యశ్ ఠాకూర్, ప్రిన్స్ యాదవ్ చెరో రెండు వికెట్లు తీశారు. ఇరు జట్ల మధ్య నామమాత్రమైన మూడో టి20 నేడు ఇక్కడే జరగనుంది.
చదవండి: ఫైనల్‌కు దూసుకెళ్లిన అనాహత్.. 21 ఏళ్ల రికార్డు బద్దలు


