
ఆసియాకప్-2025కు ఆదివారం(సెప్టెంబర్ 28) ఎండ్ కార్డ్ పడింది. దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా జరిగిన ఫైనల్లో 5 వికెట్ల తేడాతో పాకిస్తాన్‌ను ఓడించిన భారత జట్టు.. రికార్డు స్ధాయిలో తొమ్మిదోసారి ఆసియాకప్ విజేతగా నిలిచింది. అయితే ఈ మ్యాచ్ అనంతరం దుబాయ్ అంతర్జాతీయ మైదానంలో అనుహ్యపరిణామాలు చోటు చేసుకున్నాయి.
ఈ టోర్నీ ఆరంభం నుంచే పాక్‌తో అంటి ముట్టకుండా ఉంటున్న భారత జట్టు.. ఫైనల్ మ్యాచ్‌లోనూ అదే తీరును కొనసాగించింది. అయితే ఈసారి ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ACC) చైర్మెన్, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చీఫ్ మొహ్సిన్ నఖ్వీకి టీమిండియా ఝులక్ ఇచ్చింది.
అతడి చేతుల మీదగా విన్నింగ్ ట్రోఫీని తీసుకోవడానికి భారత ఆటగాళ్లు నిరాకరించారు. మొహ్సిన్ నఖ్వీ ప్రస్తుతం పీసీబీ చైర్మెన్‌తో పాటు పాకిస్తాన్ మంత్రిగా కొనసాగుతున్నాడు. ఈ కారణంతోనే అతడి చేతుల మీదగా ట్రోఫీని తీసుకోవడానికి టీమిండియా సముఖత చూపలేదు. దీంతో గ్రౌండ్‌కు తీసుకొచ్చిన ట్రోఫీని వెనక్కి తీసుకెళ్లారు. భారత ఆటగాళ్లు ట్రోఫీ లేకుండానే సంబరాలు చేసుకున్నారు.
ఇదే విషయంపై పోస్ట్ మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్పందించాడు. తన కెరీర్‌లో ఫైనల్ మ్యాచ్ గెలిచిన తర్వాత ట్రోఫీ తీసుకోపోవడం ఇదే తొలిసారి సూర్య చెప్పుకొచ్చాడు.
"నా క్రికెట్‌లో కెరీర్‌లో ఇలాంటి సంఘటనను ఇప్పటివరకు చూడలేదు. ఓ జట్టు ఛాంపియన్స్‌గా తర్వాత ట్రోఫీని అందుకోకపోవడం ఇదే మొదటి సారి. మేము కష్టపడి ఛాంపియన్‌గా నిలిచినప్పటికి, ట్రోఫీని తిరస్కరించాలని నిర్ణయించుకున్నాము. మేము ఈ నెల 4వ తేదీ నుంచి ఇక్కడే(దుబాయ్) ఉన్నాము.
ప్రతీ మ్యాచ్‌లోనూ వంద శాతం ఎఫక్ట్ పెట్టి విజయం సాధించాము. ఒక్క రోజు వ్యవధిలో వరుసగా రెండు మ్యాచ్‌లు ఆడి టైటిల్‌ను సొంతం చేసుకున్నాము. ఇందుకు మేము అన్ని రకాలగా అర్హులు. ఇంతకుమించి నేను చెప్పలేను. ట్రోఫీల గురించి మాట్లాడితే.. 14 మంది సహచరులు, సహాయక సిబ్బంది రూపంలో నా డ్రెసింగ్ రూమ్‌లో ఉన్నాయి.
నా దృష్టిలో వారే నిజమైన ట్రోఫీలు. ఈ ఆసియా కప్ ప్రయాణంలో సపోర్ట్ స్టాప్ మాకు అన్ని విధాలగా అండగా నిలిచారు. మా కుర్రాళ్లు కూడా టోర్నీ అంతటా అద్బుతంగా రాణించారు. ఫైనల్ మ్యాచ్‌లో గెలవాలనకున్నాము. మేము అనుకున్నట్లు గెలిచాం.
మ్యాచ్ ముగిసిన తర్వాత బిగ్ స్క్రీన్‌పై భారత్ గెలిచినట్లు, ఆసియా కప్ 2025 ఛాంపియన్స్ అని రాసి ఉంది. అంతకంటే మాకు ఇంకేమి కావాలి. చాలా సంతోషంగా ఉంది అని" సూర్య పేర్కొన్నాడు. అయితే హ్యాండ్ షేక్ వివాదం, ట్రోఫీ తీసుకోకపోవడానికి కారణాలపై పాక్ జర్నలిస్టు అడిగిన సమాధానాలను సూర్య దాటవేశాడు.
చదవండి: అదే మా కొంపముంచింది.. లేదంటే కథ మరోలా ఉండేది: పాక్ కెప్టెన్