
"ఒకప్పుడు జట్టులోని ఆటగాళ్లంతా స్నేహితుల్లా ఉండేవాళ్లమని, ఇప్పుడు కేవలం కొలిగ్స్‌లాగా ఉంటున్నాము". ఇవి టీమిండియా డ్రెసింగ్ రూం వాతావరణం గురించి వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ చేసిన కామెంట్స్. తాజాగా అశ్విన్ వాఖ్యలపై భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ స్పందించాడు. సహచరుల మధ్య ప్రేమ, అభిమానం లోపించడం చాలా బాధకరమని, జట్టు రాణించకపోవడానికి ఇది కూడా ఒక కారణమని గవాస్కర్ అభిప్రాయపడ్డాడు.
"ఇది నిజంగా చాలా బాధాకరమైన విషయం. మ్యాచ్ ముగియగానే అందరూ ఒక చోట కూర్చోని మాట్లాడుకోవాలి. ఆ సమయంలో కేవలం క్రికెట్ కోసమే కాకుండా.. సినిమా, మ్యూజిక్ వంటి ఇతర విషయాల కోసం కూడా చర్చించుకోవాలి. అలా జరగలేదంటే కచ్చితంగా ఆలోచించాల్సిందే. గత కొంత కాలంగా జట్టులో ప్రతీ ఆటగాడికి ప్రత్యేక గదిని కేటాయిస్తున్నారు. ప్లేయర్స్ మధ్య దూరం పెరగడానికి ఇది కూడా ఒక కారణమని " ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సునీల్ గవాస్కర్ పేర్కొన్నాడు. ఇక ఐసీసీ ఈవెంట్‌లలో భారత జట్టు వైఫల్యం, రోహిత్ శర్మ కెప్టెన్సీపై కూడా గవాస్కర్ మాట్లాడాడు.
"నేను రోహిత్ శర్మ నుంచి చాలా ఎక్కువగా ఆశించాను. స్వదేశంలో గెలవడం అంత కష్టం కాదు. విదేశాలలో బాగా రాణిస్తే మన సత్తా ఎంటో ప్రపంచానికి తెలుస్తోంది. విదేశీ గడ్డలపై రోహిత్ కెప్టెన్సీ నన్ను నిరాశపరిచింది. టీ20 టోర్నీల్లో కూడా భారత జట్టు పరిస్ధితి అలానే ఉంది. ఎంతో మంది స్టార్ ఆటగాళ్లు ఉన్ననప్పటికి ఫైనల్స్‌కు చేరడంలో భారత జట్టు విఫలమవుతోందని" గవాస్కర్ చెప్పుకొచ్చాడు.
చదవండి: Ashes 2023: చరిత్ర సృష్టించిన బెన్ స్టోక్స్.. ధోని ప్రపంచ రికార్డు బద్దలు