61 బంతుల్లో 17 ఫోర్లు, 2 సిక్స్‌లతో 106 నాటౌట్
శ్రీలంక రెండో విజయం
9 వికెట్లతో ఓడిన ఐర్లాండ్
మహిళల టి20 ప్రపంచకప్
శ్రీలంక కెప్టెన్ చమరి ఆటపట్టు అజేయ సెంచరీతో విజృంభించింది. మహిళల టి20 వరల్డ్‌కప్‌లో భాగంగా గత మూడు మ్యాచ్‌ల్లో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన లంక సారథి ఐర్లాండ్‌పై విరుచుకుపడింది. సాధించాల్సిన లక్ష్యం 131 పరుగులే ఉన్నా... అందులోనే అజేయ సెంచరీతో అదరగొట్టింది. మొదట లంక బౌలర్ల క్రమశిక్షణకు ఐర్లాండ్ స్వల్ప స్కోరుకే పరిమితం కాగా... చమరి మెరుపులతో శ్రీలంక సునాయాసంగా గెలుపు తీరం దాటింది. లంకకు ఇది రెండో విజయం కాగా... ఐర్లాండ్ ఆడిన నాలుగో మ్యాచ్‌లోనూ పరాజయం మూటగట్టుకుంది.
బ్రిస్టల్: మహిళల టి20 ప్రపంచకప్‌లో శ్రీలంక రెండో విజయం నమోదు చేసుకుంది. గ్రూప్–2లో భాగంగా మంగళవారం జరిగిన పోరులో లంక 9 వికెట్ల తేడాతో ఐర్లాండ్‌ను చిత్తుచేసింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన ఐర్లాండ్ మహిళల జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 130 పరుగులు చేసింది. కెప్టెన్ గాబీ లూయిస్ (50 బంతుల్లో 59; 8 ఫోర్లు) అర్ధశతకంతో మెరవగా... లీ పాల్ (27 బంతుల్లో 20; 1 ఫోర్), అలీస్ టెక్టర్ (21 బంతుల్లో 28 నాటౌట్; 3 ఫోర్లు) తలా కొన్ని పరుగులు చేశారు.
లంక బౌలర్ల ధాటికి 19 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన ఐర్లాండ్ జట్టును కెప్టెన్ గాబీ ఆదుకుంది. అయితే ఆమె ఆశించినంత వేగంగా ఆడలేకపోవడంతో భారీ స్కోరు సాధ్యం కాలేదు. వరుస విరామాల్లో వికెట్లు పడగొట్టిన లంక బౌలర్లు ప్రత్యర్థి భారీ స్కోరు చేయకుండా కట్టడి చేశారు. మిథాలీ అయోధ్య, సుగంధిక, చమరి, నీలాక్షిక తలా ఒక వికెట్ పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో శ్రీలంక 15.3 ఓవర్లలో ఒక వికెట్ మాత్రమే కోల్పోయి 134 పరుగులు చేసి విజయం సాధించింది.
‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ చమరి ఆటపట్టు (61 బంతుల్లో 106 నాటౌట్; 17 ఫోర్లు, 2 సిక్స్‌లు) అజేయ సెంచరీతో ఆకట్టుకుంది. మరో ఓపెనర్ ఇమేషా దులానీ (27 బంతుల్లో 20; 3 ఫోర్లు) కెప్టెన్‌కు సహకారం అందించింది. వీరిద్దరూ తొలి వికెట్‌కు 12 ఓవర్లలో 98 పరుగులు జోడించడంతోనే లంక గెలుపు ఖాయమైంది.
బౌండరీల వరద..
గత మ్యాచ్ అనంతరం సారథిగా విఫలమయ్యానని చెప్పిన చమరి... ఇన్నింగ్స్ తొలి బంతికే ఫోర్ కొట్టి తన ఉద్దేశాన్ని చాటింది. అక్కడి నుంచి మొదలుకొని మ్యాచ్ ముగిసే వరకు బౌండరీల వరద పారించింది. మూడో, నాలుగో ఓవర్‌లలో రెండేసి ఫోర్లు కొట్టిన చమరి... ఐదో ఓవర్‌లో మూడు ఫోర్లు అరుసుకుంది. ఏడో ఓవర్‌లో మరో ఫోర్‌తో 30 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసుకుంది. గత మూడు మ్యాచ్‌ల్లో వరుసగా 2, 27, 4 పరుగులు చేసిన చమరి... ఈసారి పూర్తి సాధికారికతతో బ్యాటింగ్ చేసింది.
బౌలర్‌తో సంబంధం లేకుండా తన ధాటిని కొనసాగించింది. హాఫ్‌సెంచరీ అనంతరం మరింత వేగంగా ఆడిన చమరి చూస్తుండగానే లక్ష్యాన్ని కరిగించింది. 13వ ఓవర్‌లో 4, 6, 4 కొట్టిన చమరి... అదే జోరులో 58 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకుంది. చమరికి ఇది నాలుగో అంతర్జాతీయ టి20 శతకం కావడం విశేషం. ఆమె దూకుడుతో లంక జట్టు మరో 27 బంతులుండగానే లక్ష్యాన్ని ఛేదించి రన్‌రేట్‌ను కాస్త మెరుగు పరుచుకుంది.
గ్రూప్–2లో ఇంగ్లండ్, వెస్టిండీస్ ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ విజయాలతో చెరో 6 పాయింట్లు సాధించి తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. న్యూజిలాండ్ (0.122 రన్‌రేట్) 2 విజయాలు, 2 పరాజయాలతో 4 పాయింట్లు సాధించి మూడో స్థానంలో కొనసాగుతుండగా... ఇప్పుడు రెండో విజయంతో లంక జట్టు కూడా 4 పాయింట్లు సాధించింది. అయితే నెట్ రన్‌రేట్ (–0.973)లో వెనుకబడి పట్టిక నాలుగో ‘ప్లేస్’లో నిలిచింది. తమ తదుపరి మ్యాచ్‌లో శుక్రవారం స్కాట్లాండ్‌తో లంక తలపడనుంది.


