నెట్స్‌లో శ్రమించిన భారత్, దక్షిణాఫ్రికా ఆటగాళ్లు
శుక్రవారం నుంచి ఈడెన్ గార్డెన్స్‌లో తొలి టెస్టు
కోల్‌కతా: భారత్, దక్షిణాఫ్రికా మధ్య తొలి టెస్టుకు మూడు రోజుల ముందు ఇరు జట్ల సన్నాహకం మొదలైంది. ఈడెన్ గార్డెన్స్ మైదానంలో ఆటగాళ్లు సుదీర్ఘ సమయం పాటు నెట్స్‌లో శ్రమించారు. వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) పాయింట్లు కీలకం కావడంతో సిరీస్ ప్రతిష్టాత్మకంగా మారింది.
సొంతగడ్డపై సత్తా చాటేందుకు భారత్ సన్నద్ధమవుతుండగా, డబ్ల్యూటీసీ డిఫెండింగ్ చాంపియన్‌గా సఫారీ బృందం తమ స్థాయిని ప్రదర్శించాలని భావిస్తోంది. ప్రధానంగా పిచ్‌కు సంబంధించి కూడా చర్చ జరుగుతోంది. ప్రత్యర్థి టీమ్‌లోనూ మంచి స్పిన్నర్లు ఉండటంతో భారత మేనేజ్‌మెంట్ కూడా పూర్తిగా స్పిన్ పిచ్ గురించి ఆలోచన చేయడం లేదు.
ఇటీవల పాకిస్తాన్ గడ్డపై కూడా దక్షిణాఫ్రికా ఆకట్టుకుంది. పిచ్ రూపకల్పన విషయంలో తమకు ఎలాంటి సూచనలు రాలేదని బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ (క్యాబ్) అధ్యక్షుడు, మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఇప్పటికే స్పష్టం చేశాడు.
టాప్–3పై దృష్టి...
టెస్టు జట్టు కెప్టెన్ శుబ్‌మన్ గిల్ ఇటీవల ఆస్ట్రేలియాతో వన్డే, టి20ల్లో పెద్దగా రాణించలేదు. మంగళవారం నెట్స్‌లో గిల్ సుదీర్ఘ సమయం పాటు బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాడు. ఎర్ర బంతితో మళ్లీ లయ అందుకోవాలని అతను పట్టుదలగా ఉన్నాడు. హెడ్ కోచ్ గంభీర్, అసిస్టెంట్ కోచ్ సితాన్షు కొటక్‌లతో కొద్ది సేపు చర్చించిన తర్వాత గిల్ నెట్స్‌లోకి వెళ్లాడు. ముందుగా జడేజా, సుందర్ స్పిన్‌ను ఎదుర్కొన్న అతను, ఆ తర్వాత ఆంధ్ర ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి పేస్ బౌలింగ్‌లో సాధన చేశాడు.
అనంతరం అదనపు బౌన్స్‌ను ఎదుర్కొనేందుకు అర గంట పాటు ‘త్రో డౌన్స్’తో ప్రాక్టీస్ చేశాడు. మరోవైపు యశస్వి జైస్వాల్ కూడా కెప్టెన్‌తో సమాంతరంగా పక్కనే ఉన్న మరో నెట్‌లో సాధన కొనసాగించాడు. అతను ఎలాంటి తడబాటు లేకుండా బౌలర్లను స్వేచ్ఛగా ఎదుర్కొన్నాడు. యువ బ్యాటర్ సాయి సుదర్శన్ ప్రాక్టీస్‌ను కూడా కోచ్ గంభీర్ పర్యవేక్షించాడు. పేసర్లలో బుమ్రా ఒక్కడే ప్రాక్టీస్‌కు వచ్చాడు.
బ్యాటర్ లేకుండా కేవలం రెండు స్టంప్‌లు పెట్టి ఆఫ్ స్టంప్‌పై బంతులు విసరడంపైనే అతను దృష్టి పెట్టాడు. ఏడుగురు భారత ఆటగాళ్లు ప్రాక్టీస్‌కు రాగా... పంత్, జురేల్, రాహుల్, సిరాజ్, కుల్దీప్, ఆకాశ్‌దీప్, దేవదత్ పడిక్కల్, అక్షర్ పటేల్ మంగళవారం సాధనకు దూరంగా ఉన్నారు. అనంతరం గంభీర్ సహా టీమ్ మేనేజ్‌మెంట్ టెస్టు మ్యాచ్‌కు ఉపయోగించనున్న పిచ్‌ను పరిశీలించారు.
అటాకింగ్ ఆటతో...
దక్షిణాఫ్రికా జట్టు కూడా సుదీర్ఘ సమయం పాటు ప్రాక్టీస్ చేసింది. భారత్‌లో ఎదురయ్యే స్పిన్ పిచ్‌ను దృష్టిలో ఉంచుకుంటూ ఆటగాళ్లు సాధన చేశారు. స్పిన్ బౌలర్లనే ప్రత్యేకంగా ఎదుర్కొంటూ అటాకింగ్ ఆటను ప్రదర్శించారు. నెట్స్‌లో సఫారీలను చూస్తే స్పిన్‌ను తడబడకుండా ఎదురుదాడి చేయడమే వ్యూహంగా కనిపిస్తోంది.
ఇటీవల పాకిస్తాన్‌లో స్పిన్‌కు అనుకూల పిచ్‌పై టెస్టు గెలవడం వారి ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. గాయం నుంచి కోలుకొని వచ్చిన కెప్టెన్ తెంబా బవుమా ఎక్కువ సేపు నెట్స్‌లో తన బ్యాటింగ్‌కు పదును పెట్టాడు. తక్కువ దూరం నుంచి త్రో డౌన్స్ తీసుకుంటూ తన ఫిట్‌నెస్ చురుకుదనానికి అతను స్వయంగా పరీక్ష పెట్టుకున్నాడు.
ఓపెనర్లు మార్క్‌రమ్, రికెల్టన్ కూడా స్పిన్నర్లతోనే చాలా సేపు సాధన చేశారు. భారత్ ‘ఎ’పై రెండో అనధికారిక టెస్టులో గెలిచిన దక్షిణాఫ్రికా ‘ఎ’ జట్టులోని సభ్యులు చాలా మంది సీనియర్ టీమ్‌లోనూ ఉన్నారు. వారంతా ఇక్కడి పిచ్‌కు అలవాటు పడినట్లుగా కనిపించింది.


