న్యూజిలాండ్‌తో ఆఖరి రెండు వన్డేలకు భారత జట్టులో ఢిల్లీ బ్యాటర్ అయూశ్ బదోనికి చోటు దక్కిన సంగతి తెలిసిందే. స్టార్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ గాయం కారణంగా సిరీస్ మధ్యలోనే వైదొలగడంతో బదోనికి సెలక్టర్లు పిలుపునిచ్చారు.
అయితే సెలెక్టర్ల నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఫామ్‌లో ఉన్న రియాన్ పరాగ్, రింకూ సింగ్ వంటి ఆటగాళ్లని కాదని బదోనిని తీసుకోవడాన్ని చాలా మంది తప్పుబడుతున్నారు. గంభీర్ సపోర్ట్ వల్లే అతడిని అనుహ్యంగా జట్టులోకి తీసుకున్నారని మరికొంతమంది విమర్శిస్తున్నారు.
కాగా బదోని ఐపీఎల్‌లో లక్నో సూపర్ జెయింట్స్ తరపున ఆడతున్నాడు. గతంలో లక్నో మెంటార్‌గా గౌతీ పనిచేశాడు. అతడి గైడెన్స్‌లో బదోని మరింత రాటుదేలాడు. అంతేకాకుండా ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో బదోని ఢిల్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.
గంభీర్ కూడా ఢిల్లీ నుంచే జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన విషయం విధితమే. ఈ కారణాలతో అయూశ్ వైపు మొగ్గు చూపాడని నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు. ఇక తాజాగా ఇదే విషయంపై భారత బ్యాటింగ్ కోచ్ సితాంశు కోటక్ కీలక వ్యాఖ్యలు చేశాడు. కేవలం అతడిని టాలెంట్ ఆధారంగానే జట్టులోకి తీసుకున్నామని తెలిపాడు.
"అయూశ్ దేశవాళీ క్రికెట్‌లో నిలకడగా రాణిస్తున్నాడు. భారత్-ఎ జట్టు తరపున కూడా అతడు వన్డే మ్యాచ్‌లు ఆడాడు. బదోని బ్యాటింగ్‌తో పాటు ఆఫ్ బ్రేక్ బౌలింగ్ కూడా చేయగలడు. కేవలం ఐదుగురు బౌలర్లతో మాత్రమే ఆడడం సరైన నిర్ణయం కాదు.
ఒకవేళ ప్రధాన బౌలర్లలో ఎవరైనా మ్యాచ్ మధ్యలో గాయపడితే, ఆ ఓవర్లను భర్తీ చేయడానికి ఆరో బౌలింగ్ ఆప్షన్ ఖచ్చితంగా ఉండాలి. బదోని అవసరమైతే 3 నుండి 5 ఓవర్ల వరకు బౌలింగ్ చేయగలడు. అందుకే అతడిని జట్టులోకి తీసుకున్నాము" అని రెండో వన్డేకు ముందు విలేకరుల సమావేశంలో కోటక్ పేర్కొన్నాడు.
చదవండి: BBL: పాక్ ప్లేయర్‌కు ఘోర అవమానం.. బ్యాటింగ్ మధ్యలోనే పిలిచేశారు


