బిగ్‌బాష్ లీగ్ 2025-26 సీజన్‌లో పాకిస్తాన్ స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్ దారుణ ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఈ టోర్నీలో మెల్‌బోర్న్ రెనెగేడ్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న రిజ్వాన్ ఏ మాత్రం ప్రభావం చూపలేకపోతున్నాడు.
ఈ క్రమంలో సిడ్నీ థండర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రిజ్వాన్‌కు చేదు అనుభవం ఎదురైంది. ఈ మ్యాచ్‌లో జిడ్డు బ్యాటింగ్‌తో విసిగించిన రిజ్వాన్‌ను మెల్‌బోర్న్ రెనెగేడ్స్ మెనెజ్‌మెంట్ బలవంతంగా మైదానం నుంచి వెనక్కి పిలిచింది. దీంతో అతడు రిటైర్డ్ అవుట్‌గా వెనుదిరిగాడు.
నాలుగో స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చిన రిజ్వాన్ నెమ్మదిగా ఆడుతూ టెస్టు క్రికెట్‌ను తలపించాడు. ఆఖరికి డెత్ ఓవర్లలో కూడా అతడి ఆట తీరులో ఏ మాత్రం మార్పు రాలేదు. ఈ క్రమంలో చివరి రెండు ఓవర్ల ముందు అతడిని వెనక్కి రమ్మని బౌండరీ రోప్ వద్ద నుంచి కెప్టెన్ విల్ సదర్లాండ్ సైగలు చేశాడు.
దీంతో రిజ్వాన్ తీవ్ర నిరాశతో మైదానాన్ని వీడాడు. తద్వారా బిగ్ బాష్ లీగ్ చరిత్రలో రిటైర్డ్ అవుట్ అయిన తొలి ఓవర్సీస్ ప్లేయర్‌గా రిజ్వాన్ ఆప్రతిష్టతను మూటకట్టుకున్నాడు. రిటైర్డ్ అవుట్‌గా వెనదిరిగే ముందు రిజ్వాన్ స్ట్రైక్ రేట్ 113తో 23 బంతుల్లో కేవలం 26 పరుగులు చేశాడు. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ వికెట్ కీపర్ బ్యాటర్ కమ్రాన్ అక్మల్ కీలక వ్యాఖ్యలు చేశాడు. రిజ్వాన్ వంటి స్టార్ ప్లేయర్‌కు ఇది 'అవమానకరం' అని అక్మల్ అన్నాడు.
"లీగ్ క్రికెట్ ప్రస్తుతం చాలా మారిపోయింది. ఆధునిక టీ20 క్రికెట్ అవసరాలకు తగ్గట్టుగా రిజ్వాన్ తన స్ట్రైక్ రేట్‌ను మెరుగుపరుచుకోకపోతే చాలా కష్టం. రిజ్వాన్‌తో పాటు బాబర్ ఆజంను కూడా తమ స్ట్రైక్ రేట్‌ను పెంచుకోవాలని గత మూడేళ్లుగా పదే పదే చెబుతున్నాను.
పాకిస్తాన్ జట్టు కెప్టెన్‌గా పనిచేసిన ఆటగాడిగా ఇలాంటి పరిస్థితి రావడం నిజంగా ఘోర అవమానమే. కానీ రిజ్వాన్ తన స్వయంకృత అపరాధం వల్ల ఈ పరిస్థితి తెచ్చుకున్నాడుఐపీఎల్-2025 సీజన్‌లో తిలక్ వర్మ వంటి కీలక ఆటగాడిని సైతం ముంబై ఇండియన్స్ తిరిగి డగౌట్‌లోకి పిలిచారు. మ్యాచ్ పరిస్థితిని బట్టి జట్లు ఇలాంటి కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. ఇందులో ఎలాంటి వ్యక్తిగత ద్వేషం ఉండదని" ఆక్మల్ పేర్కొన్నాడు.
అయితే రిజ్వాన్ వంటి స్టార్ ప్లేయ్‌ర్‌ను అర్ధాంతరంగా వెనక్కి పిలవడాన్ని పాక్ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారని డిబేట్ హోస్ట్ తెలిపారు. రిజ్వాన్ వెంటనే బిగ్ బాష్ లీగ్ నుంచి తప్పుకొని తిరిగి స్వదేశానికి రావాలని చాలా మంది అభిప్రాయపడుతున్నట్లు పాక్ జాతీయ మీడియాలలో కథనాలు వెలువడుతున్నాయి. రిజ్వాన్ ప్రస్తుతం పాక్ వన్డే, టెస్టు జట్టులో మాత్రమే కొనసాగుతున్నాడు.
Muhammad Rizwan has been retired out by the Melbourne Renegades 👀 #BBL15 pic.twitter.com/AuTGoTIHqb
— KFC Big Bash League (@BBL) January 12, 2026


