
ఆసియాకప్-2025లో అసలు సిసలైన పోరుకు సమయం అసన్నమైంది. ఈ ఖండాంతర టోర్నీలో భాగంగా మరికాసేపట్లో దుబాయ్ వేదికగా భారత్-పాకిస్తాన్ జట్లు తలపడనున్నాయి. అయితే ఈ చిరకాల ప్రత్యర్దుల పోరు తీవ్ర ఉద్రిక్తల నడుమ జరగనుంది.
పహల్గామ్ ఉగ్రవాద దాడి, ఆపరేషన్ సిందూర్ వంటి పరిణామాల నేపథ్యంలో పాక్‌తో మ్యాచ్‌ను బహిష్కరించాలని దేశ వ్యాప్తంగా డిమాండ్లు వినిపిస్తున్నాయి. బాయ్ కాట్ ఇండియా వర్సెస్ పాక్ హ్యాష్ ట్యాగ్ ప్రస్తుతం ఎక్స్‌లో ట్రెండ్ అవుతుంది. కానీ ఈ మ్యాచ్‌లో తలపడేందుకు ఇరు జట్లు సిద్దమయ్యాయి.
మరికాసేపట్లో ఇరు జట్ల ఆటగాళ్లు స్టేడియంకు చేరుకున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉడేందుకు దుబాయ్ పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. స్టేడియంలోకి జెండాలు, గొడుగులు, బ్యాన్సర్ లాంటివి పోలీసులు అనుమతించడం లేదు.
ఇక ఇది ఇలా ఉండగా.. ఈ హైవోల్టేజ్ మ్యాచ్‌కు ముందు పాకిస్తాన్ వెటరన్ షోయబ్ మాలిక్ తన జట్టుకు కీలక సూచనలు చేశాడు. ఈ మ్యాచ్‌లో భారత టాపార్డర్‌ను తొందరగా ఔట్ చేస్తే పాక్‌కు గెలిచే అవకాశముందని మాలిక్ అభిప్రాయపడ్డాడు.
"ఈ మ్యాచ్‌లో టాస్ కీలకంగా మారనుంది. కానీ టాస్ అనేది ఎవరి చేతుల్లోనూ లేదు. ఒకవేళ పాక్ టాస్ ఓడిపోయినా కూడా మ్యాచ్ గెలిచేందుకు గెలిచేందుకు కొన్ని అవకాశాలు ఉన్నాయి. భారత్ అగ్రశ్రేణి బ్యాటర్లలో ముగ్గురు, నలుగురుని త్వరగా అవుట్ చేసి వారిని తక్కువ స్కోర్‌కే పరిమితం చేస్తే వారిని ఓడించవచ్చు.
భారత్ స్కోర్ 150-160 మధ్య ఉంటే మనకు విజయం సాధించే అవకాశముంటుంది" అని ఓ లోకల్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాలిక్ పేర్కొన్నాడు.
ఆసియాకప్‌లో పాక్‌పై భారత్‌కు మంచి ట్రాక్ రికార్డు ఉంది. ఇప్పటివరకు ఇరు జట్లు 18 మ్యాచ్‌లలో తలపడ్డాయి. ఇందులో భారత్ 10 మ్యాచ్‌లలో గెలిస్తే, ఆరింట పాక్ విజయం సాధించింది. రెండు మ్యాచ్‌లలో ఫలితం రాలేదు. అయితే ఆసియాకప్ వన్డే ఫార్మాట్‌లో 15 మ్యాచ్‌లు జరగ్గా.. ఎనిమిదింట్లో భారత్.. ఐదింట్లో పాక్ గెలిచాయి.
మూడు టీ20 మ్యాచ్‌లలో రెండింట్లో భారత్, ఒకసారి పాక్ విజయం సాధించాయి. మరోసారి పాక్‌పై భారత్ ఆధిపత్యం చెలాయించే అవకాశముంది. దీంతో హిస్టరీ చూసి మాట్లాడు అని మాలిక్‌కు టీమిండియా ఫ్యాన్స్ కౌంటరిస్తున్నారు.
చదవండి: ప్రపంచ రికార్డు బద్దలు కొట్టిన భారత ఓపెనింగ్ జోడి