
స్మృతి- ప్రతీకా (PC: BCCI X)
ఆస్ట్రేలియాతో వన్డేలో భారత మహిళా క్రికెట్ జట్టు ఓపెనర్లు స్మృతి మంధాన (Smriti Mandhana)- ప్రతీకా రావల్ (Pratika Rawal) అద్భుత ప్రదర్శన కనబరిచారు. ఇద్దరూ అర్ధ శతకాలతో చెలరేగి వందకు పైగా పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. ఈ క్రమంలోనే పాతికేళ్లుగా బెలిండా క్లార్క్- లిసా కైట్లీ పేరిట ఉన్న వన్డే ప్రపంచ రికార్డును స్మృతి- ప్రతీకా బద్దలు కొట్టారు.
టాపార్డర్ హాఫ్ సెంచరీలు
కాగా మహిళల వన్డే ప్రపంచకప్-2025 (ICC ODI WC 2025) సన్నాహకాల్లో భాగంగా భారత్- ఆస్ట్రేలియా మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో తలపడుతున్నాయి. ఇందులో భాగంగా చండీగఢ్‌లోని ముల్లన్‌పూర్‌లో ఆదివారం నాటి తొలి వన్డేలో టాస్ గెలిచిన భారత్ తొలుత బ్యాటింగ్ చేసింది.
ఓపెనర్లు ప్రతీకా రావల్ (96 బంతుల్లో 64), స్మృతి మంధాన (63 బంతుల్లో 58) అర్ధ శతకాలతో అదరగొట్టగా.. వన్‌డౌన్ బ్యాటర్ హర్లీన్ డియోల్ (57 బంతుల్లో 54) కూడా హాఫ్ సెంచరీతో ఆకట్టుకుంది. అయితే, మిగతా వారంతా తేలిపోయారు.
A half-century filled with stylish stroke play!
4th ODI Fifty for Harleen Deol 👏👏#TeamIndia inching closer to the 200-run mark
Updates ▶️ https://t.co/LS3igwDIqz#INDvAUS | @IDFCFirstBank | @imharleenDeol pic.twitter.com/49Wxr8LF6f— BCCI Women (@BCCIWomen) September 14, 2025
281 పరుగులు
కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ 11, జెమీమా రోడ్రిగ్స్ 18 పరుగులు మాత్రమే చేయగా.. రిచా ఘోష్ 25, దీప్తి శర్మ 20 (నాటౌట్) ఫర్వాలేదనిపించారు. రాధా యాదవ్ 19 పరుగులు చేసింది. ఈ క్రమంలో నిర్ణీత 50 ఓవర్లలో భారత జట్టు ఏడు వికెట్ల నష్టానికి 281 పరుగులు చేసింది.
ఆసీస్ బౌలర్లలో మేగన్ షట్ రెండు వికెట్లు పడగొట్టగా.. కిమ్ గార్త్, అన్నాబెల్ సదర్‌లాండ్, అలనా కింగ్, తాహిలా మెగ్రాత్ ఒక్కో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.
ప్రపంచ రికార్డు బద్దలు కొట్టిన భారత ఓపెనింగ్ జోడి
గతేడాది నుంచి భారత జట్టు ఓపెనర్లుగా వస్తున్న స్మృతి మంధాన- ప్రతీకా రావల్ ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నారు. ఇప్పటికే మహిళల వన్డే క్రికెట్‌లో అత్యుత్తమంగా 84.66 సగటుతో వెయ్యి పరుగులు చేసిన తొలి జంటగా వీరు చరిత్రకెక్కారు.
తాజాగా మరో వరల్డ్ రికార్డును స్మృతి- ప్రతీకా తమ పేరిట లిఖించుకున్నారు. ఓ క్యాలెండర్ ఇయర్‌లో ఏ వికెట్‌కైనా అత్యధిక పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన జోడీగా నిలిచారు. ఆసీస్‌తో తొలి వన్డే సందర్భంగా స్మృతి- ప్రతీకా ఈ రికార్డు నమోదు చేశారు.
కాగా 2025లో ఇప్పటి వరకు స్మృతి- ప్రతీకా కలిసి 958 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అంతకుముందు.. 2000 సంవత్సరంలో బెలిండా క్లార్క్- లీసా కేట్లీ (ఆసీస్) 905 పరుగుల పార్ట్‌నర్‌షిప్ సాధించగా.. స్మృతి- ప్రతీకా తాజాగా వారిని అధిగమించారు.
అంతేకాకుండా.. భారత మహిళా వన్డే క్రికెట్‌లో తక్కువ ఇన్నింగ్స్‌లోనే ఎక్కువసార్లు 100 ప్లస్ ఓపెనింగ్ గణాంకాలు నమోదు చేసిన క్రికెటర్లుగా స్మృతి- ప్రతీకా చరిత్రకెక్కారు. జయా శర్మ- కరుణా జైన్ 25 ఇన్నింగ్స్‌లో ఐదుసార్లు వందకు పైగా భాగస్వామ్యం సాధించగా.. స్మృతి- ప్రతీకా 15 ఇన్నింగ్స్‌లోనే ఈ ఫీట్ అందుకున్నారు.
చదవండి: PKL 12: తమిళ్ తలైవాస్ సంచలన నిర్ణయం!.. జన్మలో కబడ్డీ ఆడనంటూ..