PKL 12: తమిళ్‌ తలైవాస్‌ సంచలన నిర్ణయం!.. జన్మలో కబడ్డీ ఆడనంటూ.. | Not Play Kabaddi Ever Again: Pawan Sehrawat On His Removal From Thalaivas | Sakshi
Sakshi News home page

PKL 12: తమిళ్‌ తలైవాస్‌ సంచలన నిర్ణయం!.. జన్మలో కబడ్డీ ఆడనంటూ..

Sep 14 2025 4:50 PM | Updated on Sep 14 2025 5:32 PM

Not Play Kabaddi Ever Again: Pawan Sehrawat On His Removal From Thalaivas

ప్రొ కబడ్డి లీగ్‌ ఫ్రాంఛైజీ తమిళ్‌ తలైవాస్‌ (Tamil Thalaivas) సంచలన నిర్ణయం తీసుకుంది. తమ కెప్టెన్‌, భారత కబడ్డీ జట్టు సారథి పవన్‌ సెహ్రావత్‌ (Pawan Sehrawat)ను టీమ్‌ నుంచి తొలగించింది. ఇందుకు సంబంధించి శనివారం అధికారిక ప్రకటన కూడా విడుదల చేసింది.

అందుకే ఈ నిర్ణయం
‘‘క్రమశిక్షణా రాహిత్యం కారణంగా పవన్‌ సెహ్రావత్‌ను ఇంటికి పంపించివేశాము. ఈ సీజన్‌లో అతడు ఇక మా జట్టులో భాగంగా ఉండడు. జట్టుకు సంబంధించిన ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నాము’’ అని తమిళ్‌ తలైవాస్‌ స్పష్టం చేసింది.

ఒక వ్యక్తి కారణంగానే ఇలా..
ఈ ఆరోపణలపై పవన్‌ సెహ్రావత్‌ తాజాగా స్పందించాడు. ‘‘ఫ్రాంఛైజీ పెట్టిన పోస్టు చూసి నాకు చాలా మంది ఫోన్లు, మెసేజ్‌లు చేశారు. వారందరికీ ధన్యవాదాలు. తొమ్మిదో సీజన్‌లో కూడా నేను ఈ జట్టులోనే ఉన్నాను. గాయపడిన సమయంలో వారు నాకు అండగా నిలిచారు.

మా తమ్ముడు అర్జున్‌తో కలిసి జట్టును ముందుకు తీసుకువెళ్లేందుకు నేను ఎన్నో ప్రణాళికలు రచించాను.  అయితే ఒక వ్యక్తి కారణంగా మేము ఆ పని పూర్తిచేయలేకపోయాము’’ అని పవన్‌ సెహ్రావత్‌ తెలిపాడు.

దోషినని తేలితే.. ఇక జన్మలో కబడ్డీ ఆడను
అదే విధంగా.. ‘‘ఈ ఫ్రాంఛైజీ నా మీద క్రమశిక్షణా రాహిత్యానికి పాల్పడ్డాననే ఆరోపణలు చేస్తోంది. నేను భారత జట్టులో ఉన్నాను. క్రమశిక్షణ అంటే ఏమిటో నాకు తెలుసు. నిజంగా వారు ఆరోపించినట్లు నేను దోషినని తేలితే.. ఇక జన్మలో కబడ్డీ ఆడను’’ అంటూ పవన్‌ సెహ్రావత్‌ సవాలు విసిరాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

రూ. 59.5 లక్షల భారీ ధర
కాగా గతేడాది వరకు పవన్‌ సెహ్రావత్‌ తెలుగు టైటాన్స్‌కు ఆడాడు. అయితే, ఈసారి వేలంలో రూ. 59.5 లక్షల భారీ ధరకు తమిళ్‌ తలైవాస్‌ పవన్‌ను కొనుగోలు చేసి.. కెప్టెన్‌గా నియమించింది. ఇక ఈ సీజన్‌లో తలైవాస్‌ ఆడిన తొలి మూడు మ్యాచ్‌లలో పవన్‌ భాగమయ్యాడు.

అయితే, జైపూర్‌ లెగ్‌లో భాగంగా బెంగాల్‌ వారియర్స్‌తో ఆడాల్సిన మ్యాచ్‌కు పవన్‌ హాజరు కాలేదు. జట్టుతో కలిసి అతడు జైపూర్‌కు ప్రయాణం చేయలేదు. ఇక ఈ మ్యాచ్‌లో అర్జున్‌ దేశ్‌వాల్‌ తమిళ్‌ తలైవాస్‌ సారథిగా వ్యవహరించి జట్టుకు విజయం అందించాడు.

రెండు గెలిచి..
ఇదిలా ఉంటే.. ప్రొ కబడ్డి లీగ్‌ పన్నెండో సీజన్‌లో తమిళ్‌ తలైవాస్‌ మిశ్రమ ఫలితాలు చవిచూస్తోంది. ఇప్పటికి ఆడిన నాలుగు మ్యాచ్‌లలో రెండు గెలిచింది. నాలుగు పాయింట్లతో ప్రస్తుతం పట్టికలో ఏడో స్థానంలో ఉంది. అయితే, కెప్టెన్‌ పవన్‌ సెహ్రావత్‌ వంటి ఆల్‌రౌండర్‌ను వదులుకుని పెద్ద సాహసమే చేసింది. ఇక ఈ సీజన్‌లో పవన్‌ 22 రెయిడింగ్‌ పాయింట్లు సాధించగలిగాడు.

చదవండి: పాక్‌తో మ్యాచ్‌ బహిష్కరించాలంటూ విజ్ఞప్తులు!.. ఆటగాళ్లకు గంభీర్‌ మెసేజ్‌ ఇదే..
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement