
ఆసియా కప్-2025 (Asia Cup) టోర్నమెంట్లో పాకిస్తాన్‌తో మ్యాచ్ నేపథ్యంలో టీమిండియా ఆటగాళ్లలో హెడ్‌కోచ్ గౌతం గంభీర్ (Gautam Gambhir) ఆత్మవిశ్వాసం నింపినట్లు తెలుస్తోంది. సాధారణ మ్యాచ్‌లాగానే దీనిని భావించాలని.. ఒత్తిడి దరిచేరనీయకుండా అనుకున్న ఫలితాన్ని రాబట్టాలని సూచించినట్లు సమాచారం. కాగా పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్- పాక్ ఆసియా కప్ వేదికగా తొలిసారి ముఖాముఖి తలపడనున్నాయి.
పాక్‌తో మ్యాచ్‌ను బహిష్కరించాలి
గ్రూప్-‘ఎ’లో ఉన్న దాయాది జట్ల మధ్య ఆదివారం రాత్రి మ్యాచ్ నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది. అయితే, పహల్గామ్ బాధితులకు మద్దతుగా.. టీమిండియా పాక్‌తో మ్యాచ్‌ను బహిష్కరించాలంటూ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ‘బాయ్‌కాట్’ ప్రచారం జరుగుతోంది. తమ మనోభావాలు వెల్లడిస్తూ భారతీయ నెటిజన్లు భావోద్వేగానికి లోనవుతున్నారు.
ఈ నేపథ్యంలో ఆటగాళ్లపై ప్రతికూల ప్రభావం పడకుండా, ఒత్తిడి పెరగకుండా ఉండేందుకు మేనేజ్‌మెంట్ జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సమాచారం. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, శుబ్‌మన్ గిల్ సహా ప్రధాన ఆటగాళ్లంతా ఈ విషయం గురించి గంభీర్‌తో చర్చించినట్లు వార్తలు వస్తున్నాయి.
కాగా సున్నితమైన ఈ పరిస్థితుల నేపథ్యంలో కెప్టెన్, కోచ్ పాక్‌తో మ్యాచ్‌కు మీడియా ముందుకు రానేలేదు. అయితే అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డష్కాటే మాత్రం విలేకరులతో సమావేశమయ్యాడు.
కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగానే
ఈ సందర్భంగా డష్కాటే మాట్లాడుతూ.. ‘‘ఇదొక సున్నితమైన అంశం. భారత ప్రజల భావోద్వేగాలను, మనోభావాలను ఆటగాళ్లు అర్థం చేసుకోగలరు. అయితే, కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగానే మేము ఇక్కడ ఉన్నాము.
దేశం కోసం ఆడేందుకు ఆటగాళ్లు ఎదురుచూస్తున్నారు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ప్రొఫెషనల్‌గా ఉండటం ఆటగాళ్ల లక్షణం. ప్రజల మనోభావాల పట్ల మాకు స్పష్టమైన అవగాహన ఉంది. గౌతీ కూడా ఆటగాళ్లకు ఇదే చెప్పాడు. ప్రొఫెషనల్‌గా ఉండాలని సూచించాడు.
ఆట మీద మాత్రమే దృష్టి
మన నియంత్రణలో లేని వాటి గురించి ఆలోచించవద్దని చెప్పాడు. ఒక్కొక్కరి మనస్తత్వం ఒక్కోలా ఉంటుంది. అయితే, జట్టుగా అంతా ఒకే తాటిపై ఉండాలి. ఏదేమైనా ఆట మీద మాత్రమే దృష్టి పెట్టడం అత్యంత ముఖ్యం’’ అని డష్కాటే శనివారం నాటి ప్రెస్‌మీట్‌లో పేర్కొన్నట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా వెల్లడించింది.
కాగా పహల్గామ్ ఉగ్రదాడికి బదులుగా భారత సైన్యం ‘ఆపరేషర్ సిందూర్’ పేరిట ఉగ్రమూకలకు బుద్ధి చెప్పిన విషయం తెలిసిందే. పాక్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్ర శిబిరాలను మన ఆర్మీ ధ్వంసం చేసింది.
ఆ తర్వాత దాయాదితో క్రీడల్లోనూ ఎటువంటి సంబంధాలు ఉండకూడదనే డిమాండ్లు వచ్చాయి. అయితే, బహుళ దేశాలు పాల్గొంటున్న టోర్నమెంట్లలో మాత్రం ఆడవచ్చంటూ ఇటీవలే కేంద్రం పాక్‌తో మ్యాచ్‌కు టీమిండియాకు అనుమతినిచ్చింది.
చదవండి: విరాట్ కోహ్లిపై తాలిబన్ అగ్రనేత ఆసక్తికర వ్యాఖ్యలు