
దిగ్గజ బ్యాటర్, టీమిండియా ప్లేయర్ విరాట్ కోహ్లి ఈ ఏడాది మే 12న టెస్ట్‌లకు రిటైర్మెంట్ ప్రకటించి యావత్ క్రికెట్ ప్రపంచానికి ఊహించని షాకిచ్చాడు. కోహ్లిలో మరో మూడు, నాలుగేళ్లు టెస్ట్‌ల్లో కొనసాగే సత్తా ఉన్నా ఎందుకో సుదీర్ఘ ఫార్మాట్ నుంచి తప్పుకున్నాడు.
కోహ్లి ఆకస్మిక టెస్ట్ రిటైర్మెంట్‌పై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నా అతను మాత్రం ఇప్పటివరకు స్పందించలేదు. అంతకుముందే (గతేడాది టీ20 వరల్డ్‌కప్ తర్వాత) పొట్టి ఫార్మాట్‌కు వీడ్కోలు పలికిన విరాట్.. ప్రస్తుతం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నాడు. త్వరలో ఆస్ట్రేలియాతో వారి దేశంలోనే జరుగబోయే మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో విరాట్ పాల్గొనే అవకాశం ఉంది.
ఇదిలా ఉంటే, తాజాగా విరాట్ టెస్ట్ రిటైర్మెంట్‌పై ఆఫ్ఘనిస్తాన్‌కు చెందిన తాలిబన్ అగ్రనేత అనాస్ హక్కానీ ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం సోషల్‌మీడియాలో వైరలవుతుంది. క్రికెట్‌ను రెగ్యులర్‌గా ఫాలో అయ్యే హకాన్నీ విరాట్ టెస్ట్ రిటైర్మెంట్‌పై ఆశ్చర్యం వ్యక్తం చేశాడు.
ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. విరాట్ కోహ్లి టెస్ట్ రిటైర్మెంట్ వెనుక కారణాలు నాకు తెలియదు. బహుశా భారత మీడియా వల్ల విసిగిపోయి అతనలా చేసి ఉండవచ్చు. విరాట్ లాంటి ఆటగాడు కనీసం 50 ఏళ్ల వరకైనా ఆడాలన్నది నా కోరిక. విరాట్‌కు ఇంకా చాలా సమయం మిగిలి ఉంది.
జో రూట్‌ను చూడండి, సచిన్ అత్యధిక టెస్ట్ పరుగుల రికార్డును ఛేదిస్తున్నాడు. విరాట్ కూడా ఆ రికార్డును టార్గెట్‌గా పెట్టుకుని ఉండాల్సిందని అభిప్రాయపడ్డాడు.
హక్కానీ లాంటి ఉగ్ర నేపథ్యమున్న నేత విరాట్ టెస్ట్ రిటైర్మెంట్‌పై స్పందించడం క్రికెట్ సర్కిల్స్‌లో చర్చనీయాంశంగా మారింది. ఆఫ్ఘనిస్తాన్‌లో ప్రస్తుతం తాలిబన్ల ప్రభుత్వం నడుస్తున్న విషయం తెలిసిందే. హక్కానీకి తాలిబన్ ఉద్యమ నేత. తాలిబన్లు తీసుకునే అంతర్గత నిర్ణయాల్లో హక్కానీ కీలకపాత్రధారుడు.
హక్కానీ క్రమం తప్పకుండా క్రికెట్‌ను ఫాలో అవుతుండటంతో పాటు సోషల్‌మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటాడు. హక్కానీ వారి దేశ క్రికెట్ జట్టుకు (ఆఫ్ఘనిస్తాన్) మంచి మద్దతుదారుడు. వారి తురుపుముక్క రషీద్ ఖాన్‌ను హక్కానీ అనునిత్యం ప్రోత్సహిస్తూ ఉంటాడు.
ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్ భారత్‌తో పాటు ఆసియా కప్‌లో పాల్గొంటుంది. ఈ ఖండాంతర టోర్నీలో ఇరు జట్లు వేరువేరు గ్రూప్‌ల్లో ఉండటంతో గ్రూప్ దశలో పోటీపడటం లేదు. ఇరు జట్లు తదుపరి దశకు అర్హత సాధిస్తే సూపర్ ఫోర్‌లో తలపడే అవకాశం ఉంటుంది.