
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో ముంబై ఇండియన్స్ తరఫున సత్తా చాటి టీమిండియాలోకి వచ్చాడు తిలక్ వర్మ (Tilak Varma). 2022లో ముంబై తరఫున అరంగేట్రం చేసిన తిలక్.. ఆ మరుసటి ఏడాది అంతర్జాతీయ క్రికెట్‌లో ఎంట్రీ ఇచ్చాడు.
ఆసియా కప్ హీరో
అనతికాలంలోనే భారత టీ20 జట్టులో కీలక ఆటగాడిగా ఎదిగిన ఈ హైదరాబాదీ బ్యాటర్.. ఇటీవల ఆసియా టీ20 కప్-2025 టోర్నీలోనూ అదరగొట్టాడు. పాకిస్తాన్‌తో ఫైనల్లో వీరోచిత ఇన్నింగ్స్ ఆడి భారత్ గెలుపులో కీలక పాత్ర పోషించాడు.
ఇక ఇప్పటి వరకు టీమిండియా తరఫున 32 టీ20 మ్యాచ్‌లు, నాలుగు వన్డేలు ఆడిన తిలక్ వర్మ.. ఆయా ఫార్మాట్లలో 962, 68 పరుగులు చేశాడు. ప్రస్తుతం రంజీ ట్రోఫీ సీజన్ 2025-26 సీజన్‌తో బిజీగా ఉన్న ఈ లెఫ్టాండర్ బ్యాటర్.. హైదరాబాద్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు.
ఈ నేపథ్యంలో కెరీర్‌లోని చేదు అనుభవాన్ని తాజాగా గుర్తు చేసుకున్నాడు తిలక్ వర్మ. గాయాన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల పరిస్థితి చేయిదాటిపోయిందని.. ఆ సమయంలో ముంబై ఫ్రాంఛైజీ సహ యజమాని ఆకాశ్ అంబానీ సాయం చేశారని తెలిపాడు. బ్రేక్‌ఫాస్ట్ విత్ చాంపియన్స్‌తో మాట్లాడుతూ..
బ్యాట్ ఎత్తేందుకు కూడా శక్తి సరిపోలేదు
‘‘2022లో బంగ్లాదేశ్‌లో మ్యాచ్ ఆడుతున్నాం. నేను భారత్-‘ఎ’ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నా. బ్యాటింగ్‌కు వచ్చిన కాసేపటి తర్వాత నా కళ్లు చెమ్మగా మారాయి. బ్యాట్ ఎత్తేందుకు కూడా శక్తి సరిపోవడం లేదు. నా నరాల్లో జీవం లేనట్లే అనిపించింది.
ఆకాశ్ అంబానీ హెల్ప్ చేశారు
వెంటనే రిటైర్డ్ హర్ట్‌గా వెనక్కి వచ్చేశాను. ఆ సమయంలో విషయం తెలుసుకుని ఆకాశ్ అంబానీ ఫోన్ చేశారు. బీసీసీఐ పెద్దలతో మాట్లాడి.. నా పరిస్థితి గురించి చెప్పారు. నాకు చాలా సాయం చేశారు.
బతికి బయటపడితే చాలు
ఆస్పత్రిలో వైద్యులు నన్ను హెచ్చరించారు. ఒకవేళ ఇంకాస్త ఆలస్యంగా వచ్చి ఉంటే పరిస్థితి ఇంకా దిగజారిపోయేదన్నారు. నా శరీరంలోకి సూది కూడా దిగడం లేదు. అలాంటి పరిస్థితుల్లో బతికి బయటపడితే చాలు అనుకున్నా’’ అని తిలక్ వర్మ చేదు జ్ఞాపకాన్ని పంచుకున్నాడు.
కాగా ఐపీఎల్-2022 సీజన్ తర్వాత తిలక్ వర్మ కండరాల నొప్పితో బాధపడ్డాడు. అయితే, కోలుకోవడంపై దృష్టి పెట్టకుండా వరుస మ్యాచ్‌లు ఆడాడు. ఈ క్రమంలోనే పరిస్థితి విషమించి.. ఆస్పత్రిలో చికిత్స తీసుకునేంత వరకు వచ్చింది. అయితే, అదృష్టవశాత్తూ త్వరగానే కోలుకున్న 22 ఏళ్ల తిలక్ వర్మ.. ప్రస్తుతం టీమిండియా తరఫున సత్తా చాటుతూ తనను తాను నిరూపించుకుంటున్నాడు.
చదవండి: చరిత్ర సృష్టించిన హిట్‌మ్యాన్.. ఆసియాలోనే తొలి క్రికెటర్‌గా రోహిత్ రికార్డు