
''కూతురు, కొడుకు అనే తేడా నాకు లేదు. ఇద్దరూ సమానమే. నా కుమారుడు ఇంజనీర్, అతనికి క్రికెట్ అంటే ఆసక్తి లేదు. కానీ నా కూతురు భారతదేశం తరపున క్రికెట్ ఆడుతోంది'' అంటున్నారు ప్రదీప్ రావల్. తన పిల్లలు ఎంచుకున్న కెరీర్ పట్ల ఆయన సంతృప్తిగా ఉన్నారు. ప్రస్తుతం జరుగుతున్న మహిళల వన్డే ప్రపంచకప్‌లో ఆడుతున్న భారత జట్టులో ఆయన కుమార్తె ప్రతీక రావల్ (Pratika Rawal) సభ్యురాలు.
టీమిండియా (Team India) మహిళల జట్టు ఓపెనర్ అయిన ప్రతీక రావల్ తన ప్రతిభతో టీమ్‌లో కీలకంగా మారింది. 25 ఏళ్ల కుడిచేతి వాటం ఓపెనింగ్ బ్యాట్స్‌మన్.. ఇప్పటికే పలు ఘనతలు సాధించింది. తాజాగా వరల్డ్‌కప్‌లోనూ అంచనాలకు తగినట్టుగా ఆడుతూ జట్టు విజయాల్లో తన వంతు పాత్ర పోషిస్తోంది. ఇదో జోరు కొనసాగిస్తే భవిష్యత్తులో ఆమె స్టార్ ప్లేయర్ల సరసన చేరడం ఖాయమని క్రీడా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ఇప్పటివరకు 22 అంతర్జాతీయ వన్డేలు ఆడిన ప్రతీక రావల్ 47 బ్యాటింగ్ సగటుతో 988 పరుగులు చేసింది. ఇందుల్లో సెంచరీతో పాటు 7 హాఫ్ సెంచరీలున్నాయి. అత్యధిక వ్యక్తిగత స్కోరు 154. అంతేకాదు అప్పడప్పుడు బౌలింగ్ కూడా చేస్తోంది. 185 బంతులు విసిరి 5 వికెట్లు పడగొట్టింది. అతి తక్కువ అంతర్జాతీయ కెరీర్‌లోనే పలు రికార్డులు సాధించి దూసుకుపోతోంది.
సరికొత్త చరిత్ర
మహిళల వన్డే క్రికెట్‌తో తొలి 15 మ్యాచ్‌ల్లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌గా ప్రతీక సరికొత్త చరిత్ర లిఖించింది. మొదటి 15 వన్డేల్లో 767 పరుగులు సాధించి ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మెగ్ లానింగ్ పేరిట ఉన్న రికార్డ్‌ను తిరగరాసింది. లానింగ్ తన వన్డే కెరీర్‌లో తొలి 15 మ్యాచ్‌లలో 707 రన్స్ చేసింది. ప్రపంచకప్‌కు ముందు ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లోనూ ప్రతీక సత్తా చాటింది. స్టార్ బ్యాటర్ స్మృతి మంధానతో (Smriti Mandhana) కలిసి మరో రికార్డ్ క్రియోట్ చేసింది. ఓ క్యాలెండర్ ఇయర్‌లో ఏ వికెట్‌కైనా అత్యధిక పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన జోడీగా రికార్డ్ నెలకొల్పారు.
తొలి జంటగా రికార్డ్
ఏడాదిగా టీమిండియా ఓపెనర్లుగా వస్తున్న స్మృతి మంధాన- ప్రతీక రావల్ విశేషంగా రాణిస్తున్నారు. మహిళల వన్డే క్రికెట్‌లో అత్యుత్తమంగా 84.66 సగటుతో వెయ్యి పరుగులు చేసిన తొలి జంటగా వీరు చరిత్రకెక్కారు. భారత మహిళా వన్డే క్రికెట్‌లో తక్కువ ఇన్నింగ్స్‌లోనే ఎక్కువసార్లు 100 ప్లస్ ఓపెనింగ్ గణాంకాలు నమోదు చేసిన జోడీగానూ ఘనత సాధించారు.
మూడేళ్ల వయసులోనే..
దేశ రాజధాని ఢిల్లీలో క్రికెట్‌ను ఇష్టపడే కుటుంబంలో జన్మించిన ప్రతీక మూడేళ్ల వయసులోనే బ్యాట్ చేతబట్టింది. యూనివర్సిటీ స్థాయి క్రికెటర్, బీసీసీఐ లెవల్ 2 అంపైర్ అయిన ఆమె తండ్రి ప్రదీప్.. తాను సాధించలేని కలను తన కుమార్తె నెరవేర్చాలని కోరుకున్నాడు. అందుకే తన కూతురికి చిన్నప్పటి నుంచే క్రికెట్ నేర్పించడం మొదలుపెట్టాడు. తనకు సరైన మార్గదర్శకత్వం లేనందున జాతీయస్థాయి క్రికెటర్ కాలేకపోయానని, తన కూతురు విషయంలో అలా జరగకూడదన్న ఉద్దేశంతో చిన్ననాటి నుంచి శిక్షణపై ఫోకస్ పెట్టానని వివరించారు. అదృష్టవశాత్తూ ప్రతీకకు కూడా క్రికెట్‌పై మక్కువ ఉండటంతో తన పని సులువువయిందన్నారు.
ట్రైనింగ్.. ఫిట్‌నెస్
ఆమెకు పదేళ్ల వయసు ఉన్నపుడు తన పాఠశాల తరపున కాలేజీ జట్టుతో ఆడిన ప్రతీక తన బ్యాటింగ్‌తో అందరినీ ఆశ్చర్యపరిచిందని ప్రదీప్ గుర్తు చేసుకున్నారు. ఇంత చిన్నపిల్ల 50 కంటే ఎక్కువ పరుగులు చేయడంతో అక్కడున్న వారందరూ చకితులయ్యారని వెల్లడించారు. అక్కడి నుంచి ఒక్కో అడుగు వేసింది. ఈ క్రమంలో టీమిండియా మాజీ క్రీడాకారిణి దీప్తి ధ్యాని (Deepti Dhyani) దృష్టిలో పడింది. ప్రతీక ఆటతీరును నిశితంగా గమనించి ఆమెకు కోచ్‌గా మారింది. ''ప్రతీక కొన్ని డ్రైవ్‌లు ఆడటం చూశాను. ఆమెకు మంచి టాలెంట్ ఉందని గ్రహించాను. చాలా మంది రాష్ట్ర స్థాయి ఆటగాళ్లకు ప్రతిభ ఉంటుంది, దాన్ని ప్రొఫెషనల్ క్రికెట్‌గా మార్చడమే సవాలు. అక్కడే కోచ్‌లుగా మేము అడుగుపెడతాము" అని దీప్తి చెప్పింది. ఆటతో పాటు ఫిట్‌నెస్‌పై ప్రతీక తీవ్రంగా కృషి చేసిందని వెల్లడించింది.
స్పెషల్ టాలెంట్
ప్రొఫెషనల్ క్రికెటర్‌గా మారినప్పటికీ చదువును నిర్లక్ష్యం చేయలేదు ప్రతీక. సైకాలజీలో గ్రాడ్యుయేషన్ చేసింది. మైదానంలో వ్యూహాలను, భావోద్వేగాలను అర్థం చేసుకోవడానికి చదువు ఆమెకు ఉపయోగపడింది. ఇదే ఆమెను మిగతా క్రికెటర్ల కంటే ప్రత్యేకంగా నిలుపుతుంది. మైదానం వెలుపల కూడా ప్రతీక స్పెషల్ టాలెంట్‌తో ప్రత్యేకత చాటుకుంటోంది. రూబిక్స్ క్యూబ్‌ను సులువుగా పరిష్కరించగలదు.
చదవండి: టీమిండియా యంగె(టె)స్ట్ సూపర్‌స్టార్!
టర్నింగ్ పాయింట్
ఢిల్లీ అండర్-19 టీమ్ తరపున ఆడిన ప్రతీక తర్వాత రైల్వేస్ జట్టుకు మారింది. దేశీయ క్రికెట్‌లో స్థిరంగా రాణించినప్పటికీ గతేడాది మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) వేలంలో తనను విస్మరించడంతో నిరాశకు గురైంది. అదీ కొద్ది వారాలు మాత్రమే. తర్వాత ఆమెకు తొలిసారిగా టీమిండియా కాల్ వచ్చింది. 2024, డిసెంబర్‌లో వెస్టిండీస్‌పై అరంగేట్రం చేసింది. అప్పటి నుంచి నిలకడగా ఆడుతూ జట్టులో కీలక సభ్యురాలిగా మారింది. తన 6వ మ్యాచ్‌లో ఐర్లాండ్‌పై 154 పరుగులు చేయడం ప్రతీక ఇంటర్నేషనల్ కెరీర్‌లో టర్నింగ్ పాయింట్‌గా చెప్పవచ్చు.
ఏ పాత్రకైనా సిద్ధం
ప్రస్తుతం జరుగుతున్న వన్డే ప్రపంచకప్‌లోనూ అంచనాల మేరకు ఆడుతూ జట్టు నమ్మకాన్ని చూరగొంటోంది. జట్టులో ఏ పాత్రకైనా తన కూతురు సిద్ధమని ప్రదీప్ రావల్ (Pradeep Rawal) అంటున్నారు. అంతేకాదు ఈసారి టీమిండియా వరల్డ్‌కప్ సాధిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రతీకపైనా కూడా చాలా అంచనాలు ఉన్నాయని ఆయన తెలిపారు.