
జీవితంలో ఏదోటి సాధించాలని ప్రతి ఒక్కరు కల (Dream) కంటారు. కానీ కొంతమంది మాత్రమే స్వప్నాలను సాకారం చేసుకుంటారు. అహరహం శ్రమించే వారు.. కష్టాలు, నష్టాలను ఓర్చుకునే వారే మాత్రమే తాము అనుకున్నది సాధిస్తారు. పేదరికం బెదిరించినా, అవరోధాలు అడ్డుగా నిలిచినా అదరక బెదరక లక్ష్యసాధనకై ముందుకుసాగే వారు మాత్రమే విజేతలవుతారు. చరిత్రలో తమకంటూ ఓ పేజీని లిఖించుకుంటారు. మనం చెప్పుకోబోతున్న యువ క్రికెటర్ కూడా అలాంటి వాడే!
క్రికెటర్ కావాలన్న తన కలను నిజం చేసుకోవడానికి 10 ఏళ్ల లేత ప్రాయంలో స్వంత ఊరిని వదిలిపెట్టాడు. ఉత్తరప్రదేశ్‌లోని తన స్వస్థలం సూర్యవాన్‌ను విడిచిపెట్టి బరువైన బ్యాగ్‌తో పాటు అంతకంటే బరువైన కలను తనతో మోసుకుంటూ ముంబై మహా నగరానికి చేరుకున్నాడు. మొదట ఒక పాల దుకాణం పైకప్పుపై నివసించాడు. అక్కడి నుంచి ఒక్కో అడుగు వేస్తూ తానెంతో ప్రేమించే ఆటకు దగ్గరయ్యాడు. దీని కోసం ఏం చేయాల్సి వచ్చినా వెనుకాడలేదు, వెనుదిరగలేదు. ఆజాద్ మైదాన్ (Azad Maidan) సమీపంలో పానీ పూరీ అమ్మాడు. గ్రౌండ్స్‌మెన్‌తో పరిచయం పెంచుకుని వారితో కలిసి ఒకే టెంట్ పంచుకున్నాడు. అవకాశం దొరికినప్పుడల్లా క్రికెట్ ఆడేవాడు.
సంకల్ప శుద్ధి, శ్రమకు సరైన సమయంలో గైడెన్స్ దొరికితే సక్సెస్ దానంతట అదే వస్తుంది. యశ్వసి జైస్వాల్ (Yashasvi Jaiswal) విషయంలో అదే జరిగింది. అవును ఇప్పటివరకు మనం చెప్పుకున్నది ఈ యువ స్టార్ క్రికెటర్ గురించే. కోచ్ జ్వాలా సింగ్ రూపంలో అతడికి సరైన సమయంలో చేయూత దొరికింది. యశస్విలో భవిష్యత్ క్రికెటర్‌ను చూసిన ఆయన.. జైస్వాల్‌కు అన్నివిధాలా అండగా నిలిచాడు. శిక్షణ ఇవ్వడమే కాకుండా ఆశ్రయం, ఆహారంతో పాటు నమ్మకాన్ని కల్పించాడు. ఆయన మార్గదర్శకత్వంలో జైస్వాల్ ఆట పదును తేలింది. అక్కడి నుంచి అతడి ఆటే సందేశం అయింది.
బ్యాటింగ్ ఆపలేదు
యశస్వి జైస్వాల్‌ను ప్రత్యేకంగా నిలబెట్టింది అతడు ఆడే షాట్లు లేదా టైమింగ్ మాత్రమే కాదు.. అనుకున్నది సాధించే వరకు పట్టు వదలని సంకల్పం. వైఫల్యానికి జైస్వాల్ భయపడేవాడని కోచ్ జ్వాలా సింగ్ తరచూ చెబుతుండేవారు. ఫెయిల్యూర్‌కు భయపడి అతడు ఎప్పుడూ బ్యాటింగ్ ఆపలేదు. మ్యాచ్ తర్వాత మ్యాచ్ ఆడుతూ ప్రతి బంతిని ఎదుర్కొన్నాడు. స్కూల్ క్రికెట్, ముంబై అండర్-16, అండర్-19, తర్వాత ఇండియా అండర్-19 తరపున పరుగులు చేస్తూనే ఉన్నాడు. 2018లో అండర్-19 ఆసియా కప్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. 2020 నాటికి అండర్-19 ప్రపంచ కప్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా గుర్తింపు పొందాడు. ఒకప్పుడు పానీ పూరీ (pani puri) అమ్మిన అదే బాలుడు ఇప్పుడు ప్రతి స్కౌట్ సంతకం చేయాలనుకునే పేరుగా మారిపోయాడు.
అన్‌స్టాపబుల్ ప్లేయర్
దేశీయ క్రికెట్‌లో ముంబై తరఫున జైస్వాల్.. అన్‌స్టాపబుల్ ప్లేయర్‌గా మారిపోయాడు. సెంచరీలు సంఖ్య పెరగడంతో అతడి ఫస్ట్ క్లాస్ సగటు 60 దాటింది. రన్స్ సాధించడమే చేయడమే కాదు.. బ్యాటింగ్ చేసిన ప్రతిసారీ తన ప్రతిభను నిరూపించుకున్నాడు. దీంతో ఐపీఎల్ ఫ్రాంచైజీల దృష్టిలో పడ్డాడు. 2020 ఐపీఎల్ వేలంలో రాజస్థాన్ రాయల్స్ ఈ యంగ్ ప్లేయర్‌ను ₹2.4 కోట్లకు దక్కించుకుంది. నమంత్రపు సిరి అతడిని ఏమాత్రం మార్చలేదు. ఆకర్షణ కంటే ఆటకే ఎక్కువ విలువనిచ్చాడు. తన స్వప్నం పూర్తిగా సాకారం కాలేదన్న సత్యాన్ని గమనించి టీమిండియా పిలుపు కోసం ఎదురు చూశాడు.

తొలి మ్యాచ్‌లోనే భారీ సెంచరీ
2023, జూలై 12.. యశస్వి జైస్వాల్ జీవితంలో మరపురాని రోజు. ఈ రోజున వెస్టిండీస్‌తో ప్రారంభమైన మ్యాచ్‌తో టీమిండియా తరపున టెస్టుల్లో అరంగ్రేటం చేశాడు. తొట్ట తొలి మ్యాచ్‌లోనే భారీ సెంచరీ (171)తో క్రీడా ప్రపంచాన్ని ఆకర్షించాడు. అప్పటి నుంచి టెస్ట్ క్రికెట్‌లో తనదైన ముద్ర వేసి ముందుకు సాగుతున్నాడు. తన తొలినాళ్లలో సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar) లాగానే, జైస్వాల్ ఇప్పటికే దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌లలో ఆడాడు. దక్షిణాఫ్రికా మినహా, అతడు అన్ని చోట్లా అద్భుతమైన ప్రదర్శన ఇచ్చాడు.
జైసూ జైత్రయాత్ర
2024లో ఇంగ్లాండ్‌తో జరిగిన స్వదేశీ సిరీస్‌లో జైసూ జైత్రయాత్ర చేశాడు. 40 సంవత్సరాల రికార్డును తిరగరాశాడు. ఒకే టెస్ట్ సిరీస్‌లో 700 పరుగులు పైగా సాధించిన తొలి ఆసియా ఓపెనర్‌గా రికార్డుకెక్కాడు. భారత టెస్ట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ పేరిట ఉన్న రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. తాజాగా భారత్‌లో వెస్టిండీస్‌తో జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్‌లో 175 పరుగులు చేసి శభాష్ అనిపించుకున్నాడు. చిన్న వయసులో ఎక్కువ టెస్ట్ సెంచరీలు సాధించిన రెండో భారత బ్యాటర్‌గా నిలిచాడు.

గత రెండేళ్లుగా టెస్టుల్లో జైస్వాల్ హవా కొనసాగుతోంది. తన అరంగేట్రం తర్వాత జో రూట్ మినహా ఎవరూ అతడి కంటే ఎక్కువ టెస్ట్ పరుగులు చేయలేదు. జైసూ చేసిన ఏడు సెంచరీల్లో 4 ఆసియా వెలుపల వచ్చాయి. సచిన్ టెండూల్కర్ తర్వాత అతడే యంగెస్ట్ టెస్ట్ సూపర్‌స్టార్ అన్న కామెంట్లు విన్పిస్తున్నాయి. టీమిండియా ప్రస్తుత కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (Shubman Gill) కూడా ఫామ్‌లో ఉన్నప్పటికీ.. జైస్వాల్ కంటే వయసులో అతడు మూడేళ్లు పెద్డోడు. టెస్టుల్లో కంటే వన్డేల్లో గిల్ బ్యాటింగ్ యావరేజ్ మెరుగ్గా ఉంది.
చదవండి: తలబాదుకున్న జైస్వాల్.. తప్పు నీదే!
దిగ్గజాల సరసన చోటు!
23 ఏళ్ల ఎడంచేతి బ్యాటర్ లాంగ్ ఫార్మాట్‌లో నిలకడగా రాణిస్తున్నాడు. పాతిక టెస్టులకే దాదాపు 50 శాతం బ్యాటింగ్ సగటుతో 7 సెంచరీలు, 12 అర్ధసెంచరీలు బాదాడు. ఇదే స్థిరత్వం కొనసాగిస్తే టెస్ట్ క్రికెట్‌లో దిగ్గజాల సరసన అతడికి చోటు దక్కడం ఖాయం. టీమిండియా టాప్-5 టెస్ట్ బ్యాటర్ల పేర్ల జాబితాలో ఎడమచేతి వాటం ఆటగాళ్లు చాలా అరుదుగా కనిపిస్తారు. అయితే జైస్వాల్ తన కెరీర్‌ను ముగించే సమయానికి ఈ లిస్ట్ కచ్చితంగా మారుతుందని స్పోర్ట్స్ ఎనలిస్టులు అంచనా వేస్తున్నారు. ఆజాద్ మైదాన్ కుర్రాడు ఇప్పటికే చాలా దూరం వచ్చాడు. ఇంకెంత దూరం ప్రయాణిస్తాడో, ఎన్ని మైలురాళ్లు (Milestones) అందుకుంటాడో చూడాలి!
Another stellar performance ✨
Yashasvi Jaiswal with yet another superb Test innings 😎
Scorecard ▶ https://t.co/GYLslRzj4G#TeamIndia | #INDvWI | @IDFCFIRSTBank | @ybj_19 pic.twitter.com/oDGP8iq6Le— BCCI (@BCCI) October 11, 2025