
ఐసీసీ మహిళల వన్డే వరల్డ్‌కప్-2025 (ICC Women's ODI World Cup) టోర్నమెంట్లో ఆఖరి సెమీ ఫైనల్ బెర్తు కోసం భారత్- న్యూజిలాండ్ (IND vs NZ) ముఖాముఖి తలపడుతున్నాయి. నవీ ముంబై వేదికగా గురువారం నాటి మ్యాచ్‌లో గెలిస్తే హర్మన్ సేన ఎలాంటి సమీకరణలతో పని లేకుండా నేరుగా సెమీ ఫైనల్ చేరుతుంది.
టాస్ ఓడిన భారత్
మరోవైపు.. న్యూజిలాండ్‌కు ఇది చావోరేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌గా మారింది. ఇందులో గెలిస్తేనే వైట్‌ఫెర్న్స్ సెమీస్ బెర్తు దక్కించుకునే అవకాశం ఉంది. ఈ క్రమంలో డాక్టర్ డీవై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీ వేదికగా టాస్ గెలిచిన న్యూజిలాండ్ తొలుత బౌలింగ్ ఎంచుకుని.. భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది.
టాస్ సందర్భంగా న్యూజిలాండ్ కెప్టెన్ సోఫీ డివైన్ మాట్లాడుతూ.. ‘‘ఈరోజు ముందుగా మేము బౌలింగ్ చేస్తాం. వికెట్ పాతబడే కొద్దీ మొత్తంగా మారిపోయే సూచనలు కనిపించడం లేదు. ఈ మ్యాచ్ కోసం పూర్తి స్థాయిలో మేము సన్నద్ధమయ్యాము. రెండు అదనపు సెషన్లు ఏర్పాటు చేసుకుని ప్రాక్టీస్ చేశాం.
ఈ టోర్నీలో మాకు పూర్తి స్థాయిలో బ్యాటింగ్ చేసే అవకాశమే రాలేదు. అయితే, ఈరోజు ఎలాంటి ఆటంకం (వర్షం) ఉండదనే భావిస్తున్నాం. 100 ఓవర్ల పాటు మ్యాచ్ సాగాలి. ఇలాంటి తీవ్రమైన ఒత్తిడి ఉన్న పరిస్థితుల నేపథ్యంలోనే క్రికెటర్లు తమలోని అత్యుత్తమ ప్రతిభను వెలికితీయాలి.
ఇండియాలో ఇలాంటి పరిస్థితుల్లో గెలిచి సెమీస్ చేరితే అంతకంటే గొప్ప విషయం మాకు మరొకటి ఉండదు. భారత్‌తో మ్యాచ్ సవాలుతో కూడుకున్నదే. గత మ్యాచ్‌లో ఆడిన తుదిజట్టుతోనే ఇక్కడా బరిలోకి దిగుతున్నాం’’ అని పేర్కొంది.
మూడు మార్పులు
మరోవైపు.. తమ జట్టులో మూడు మార్పులు చేసినట్లు భారత జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ తెలిపింది. అదనంగా ముగ్గురు బ్యాటర్లను తుదిజట్టులోకి తీసుకున్నట్లు వెల్లడించింది. కాగా ఈ మ్యాచ్‌లో దురదృష్టవశాత్తూ భారత జట్టు ఓడినప్పటికీ బంగ్లాదేశ్‌తో మ్యాచ్ రూపంలో మరో అవకాశం ఉంటుంది.
ఒకవేళ బంగ్లాను ఓడిస్తే సులువుగానే సెమీస్ చేరుతుంది. అదే సమయంలో న్యూజిలాండ్ తమ తదుపరి మ్యాచ్‌లో ఇంగ్లండ్ చేతిలో ఓడాల్సి ఉంటుంది. ఒకవేళ ఫలితం వేరుగా ఉంటే మాత్రం అప్పుడు నెట్ రన్‌రేటు కూడా కీలకం అవుతుంది. కాగా ఇప్పటికే ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, ఇంగ్లండ్ మహిళా జట్లు సెమీ ఫైనల్ చేరుకున్న విషయం తెలిసిందే.
భారత్ వర్సెస్ న్యూజిలాండ్ తుదిజట్లు
భారత్
ప్రతీకా రావల్, స్మృతి మంధాన, హర్లీన్ డియోల్, హర్మన్‌ప్రీత్ కౌర్(కెప్టెన్), జెమిమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ, రిచా ఘోష్(వికెట్ కీపర్), స్నేహ రాణా, క్రాంతి గౌడ్, శ్రీ చరణి, రేణుకా సింగ్ ఠాకూర్.
న్యూజిలాండ్
సుజీ బేట్స్, జార్జియా ప్లిమ్మర్, అమేలియా కెర్, సోఫీ డివైన్(కెప్టెన్), బ్రూక్ హాలిడే, మాడీ గ్రీన్, ఇసాబెల్లా గాజ్(వికెట్ కీపర్), జెస్ కెర్, రోజ్మేరీ మెయిర్, లీ తహుహు, ఈడెన్ కార్సన్.