
PC: BCCI X
ఐసీసీ మహిళల వన్డే వరల్డ్‌కప్-2025 (ICC Women's ODI WC 2025)లో భారత జట్టుకు వరుసగా రెండో పరాజయం ఎదురైంది. విశాఖపట్నం వేదికగా తొలుత సౌతాఫ్రికా వుమెన్ చేతిలో మూడు వికెట్ల తేడాతో ఓడిన హర్మన్‌సేన.. తాజాగా ఆదివారం నాటి మ్యాచ్‌లోనూ ఓటమిని చవిచూసింది.
ఓపెనర్లు సూపర్‌హిట్
విశాఖలో ఆస్ట్రేలియా మహిళా జట్టు (IND W vs AUS W)తో మ్యాచ్‌లో 330 పరుగుల భారీ స్కోరు చేసినప్పటికీ.. ఈ లక్ష్యాన్ని కాపాడుకోలేకపోయింది. ఫలితంగా మూడు వికెట్ల తేడాతో పరాభవం పాలైంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్‌కు ఓపెనర్లు ప్రతికా రావల్ (75), స్మృతి మంధాన (Smriti Mandhana- 80) గొప్ప ఆరంభం అందించారు.
మిగతావారిలో వన్‌డౌన్ బ్యాటర్ హర్లీన్ డియోల్ 38, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ 22, జెమీమా రోడ్రిగెస్ 33, రిచా ఘోష్ 32 పరుగులతో ఓ మోస్తరుగా రాణించారు. అయితే, ఆసీస్ బౌలర్ల ధాటికి లోయర్ ఆర్డర్ వేగంగా పతనమైంది. అమన్‌జోత్ కౌర్ 16 పరుగులతో ఫర్వాలేదనిపించగా.. దీప్తి శర్మ (1), స్నేహ్ రాణా (8), క్రాంతి గాడ్ (1), శ్రీ చరణి (0) ఇలా వచ్చి అలా వెళ్లారు. ఈ క్రమంలో 48.5 ఓవర్లలో 330 పరుగులు చేసి భారత్ ఆలౌట్ అయింది.
అనాబెల్ సదర్లాండ్‌కు ఐదు
ఆసీస్ బౌలర్లలో అనాబెల్ సదర్లాండ్ ఐదు వికెట్లతో చెలరేగగా.. సోఫీ మొలినక్స్ మూడు వికెట్లు పడగొట్టింది. మిగిలిన వారిలో మేగన్ షట్, ఆష్ల గార్డ్‌నర్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు. ఇక లక్ష్య ఛేదనలో ఆసీస్ ఓపెనర్, కెప్టెన్ అలిసా హేలీ ఆకాశమే హద్దుగా చెలరేగింది.
హేలీ విధ్వంసం
కేవలం 107 బంతుల్లోనే 21 ఫోర్లు, 3 సిక్సర్లు బాది విధ్వంసం సృష్టించింది. 142 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద శ్రీచరణి బౌలింగ్‌లో స్నేహ్ రాణాకు క్యాచ్ ఇవ్వడంతో హేలీ సునామీ ఇన్నింగ్స్‌కు తెరపడింది. ఆమెకు తోడుగా మరో ఓపెనర్ ఫోబే లిచ్‌ఫీల్డ్ 40, వన్‌డౌన్‌లో వచ్చిన ఎలిస్ పెర్రీ 47, ఆష్లే గార్డ్‌నర్ 45 పరుగులతో రాణించారు. ఆఖర్లో కిమ్ గార్త్ (14) సిక్సర్‌బాది ఆసీస్ విజయాన్ని ఖరారు చేసింది.
It took another moment of brilliance to stop Alyssa Healy! 🙌
Shree Charani ends her spell with 3 wickets, while Sneh Rana takes a stunner 🔥
Will this wicket be the turning point of the match? 👀
Catch the LIVE action ➡https://t.co/qAoZd44TEs#CWC25 👉 #INDvAUS | LIVE NOW… pic.twitter.com/NMKHPYlZ8q— Star Sports (@StarSportsIndia) October 12, 2025
వరుసగా రెండు ఓటములు..
కాగా వన్డే వరల్డ్‌కప్-2025లో భారత జట్టు ఇప్పటికే నాలుగు మ్యాచ్‌లు పూర్తి చేసుకుంది. తొలుత శ్రీలంకను 59 పరుగుల తేడాతో ఓడించిన హర్మన్‌సేన.. ఆ తర్వాత దాయాది పాకిస్తాన్‌ను 88 పరుగుల తేడాతో చిత్తు చేసింది.
అనంతరం సౌతాఫ్రికా, ఆసీస్ చేతుల్లో వరుస ఓటములు చవిచూసింది. ఈ నేపథ్యంలో భారత జట్టు సెమీ ఫైనల్ చేరాలంటే.. మిగిలిన మూడు మ్యాచ్‌లలో మెరుగైన ఫలితాలు రాబట్టాల్సి ఉంటుంది. ప్రస్తుతం రెండు విజయాలతో ఉన్న భారత్ ఖాతాలో నాలుగు పాయింట్లు ఉన్నాయి.
సెమీస్ చేరాలంటే..
ఆస్ట్రేలియా (7), ఇంగ్లండ్ (6) తర్వాత హర్మన్‌సేన పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది. ఇక భారత్ తదుపరి ఇంగ్లండ్ (అక్టోబరు 19), న్యూజిలాండ్ (23), బంగ్లాదేశ్ (అక్టోబరు 26) జట్లతో ఆడాల్సి ఉంది. ఈ మూడు మ్యాచ్‌లలో గెలిస్తే నెట్‌రన్‌రేటుతో పనిలేకుండా టాప్-4లో నిలిచి.. నేరుగా సెమీస్‌లో అడుగుపెడుతుంది హర్మన్‌సేన.
ఒకవేళ ఇంగ్లండ్ చేతిలో ఓడితే మాత్రం.. న్యూజిలాండ్, బంగ్లాదేశ్‌లపై భారత జట్టు కచ్చితంగా గెలవాల్సి ఉంటుంది. తద్వారా మరో నాలుగు పాయింట్లు సాధించి.. మొత్తంగా ఎనిమిది పాయింట్లతో సెమీస్‌కు దూసుకువెళ్లే అవకాశాలు ఉంటాయి. అయితే, న్యూజిలాండ్, బంగ్లాదేశ్ కంటే నెట్‌రన్‌రేటు పరంగా మెరుగ్గా ఉంటేనే ఇది సాధ్యమవుతుంది.
చదవండి: ఇది అవుట్ అని మీకూ తెలుసు.. కానీ: నవ్వుతూనే ఇచ్చిపడేసిన బుమ్రా