
విశాఖపట్నం వేదికగా సౌతాఫ్రికాతో గెలవాల్సిన మ్యాచ్‌ను అనూహ్య రీతిలో భారత మహిళా క్రికెట్ జట్టు చేజార్చుకుంది. ఆఖరి వరకు పోరాడినా అనుకున్న ఫలితం రాబట్టలేకపోయింది. సౌతాఫ్రికా బ్యాటర్ నదినె డి క్లెర్క్ (Nadine de Klerk) అద్భుత ఆట తీరుతో టీమిండియా నుంచి మ్యాచ్‌ను లాగేసుకుని.. మరో ఏడు బంతులు మిగిలి ఉండగానే తమ జట్టును విజయతీరాలకు చేర్చింది.
ఈ నేపథ్యంలో అనూహ్య ఓటమిపై భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (Harmanpreet Kaur) స్పందించింది. టాపార్డర్ వైఫల్యమే తమ ఓటమికి ప్రధాన కారణం అని పేర్కొంది. ఇకపై తమ వ్యూహాలు మార్చుకోవాల్సి ఉందని.. భారీ స్కోర్లు సాధించడంపై దృష్టి పెడతామని పేర్కొంది.
251 పరుగులకు ఆలౌట్
ఐసీసీ మహిళల వన్డే వరల్డ్‌కప్-2025 (ICC Women's ODI World Cup) టోర్నీలో భాగంగా భారత్ విశాఖ వేదికగా గురువారం సౌతాఫ్రికాతో తలపడింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 49.5 ఓవర్లలో 251 పరుగులకు ఆలౌట్ అయింది.
స్మృతి ఫెయిల్
ఓపెనర్లలో ప్రతికా రావల్ (37) ఫర్వాలేదనిపించగా.. స్మృతి మంధాన (23) మరోసారి నిరాశపరిచింది. ఇక వన్‌డౌన్ బ్యాటర్ హర్లీన్ డియెల్ (13)తో పాటు నాలుగో స్థానంలో వచ్చిన కెప్టెన్ హర్మన్ (9) కూడా విఫలమైంది.
రిచా ఘోష్ విధ్వంసకర ఇన్నింగ్స్
జెమీమా రోడ్రిగెస్ డకౌట్ కాగా.. ఆల్‌రౌండర్ దీప్తి శర్మ 13 పరుగులకే వెనుదిరిగింది. ఇలాంటి క్లిష్ట దశలో వికెట్ కీపర్ రిచా ఘోష్ విధ్వంసకర ఇన్నింగ్స్ (77 బంతుల్లో 94)తో జట్టును ఆదుకోగా.. స్నేహ్ రాణా (24 బంతుల్లో 33) ఆమెకు సహకరించింది.
A game-changing fifty by Richa Ghosh, her 7th in ODIs & first in CWC! 🔥
Will she & Sneh Rana steer Team India over the 250-run mark?
Catch the LIVE action ➡ https://t.co/qUAtuPmsC2#CWC25 👉 #INDvSA | LIVE NOW on Star Sports & JioHotstar! pic.twitter.com/r1SyLR4ieB— Star Sports (@StarSportsIndia) October 9, 2025
84 పరుగులతో అజేయంగా
ఈ క్రమంలో లక్ష్య ఛేదనకు దిగిన సౌతాఫ్రికాకు ఆదిలోనే చుక్కెదురైంది. తజ్మిన్ బ్రిట్స్ డకౌట్ కాగా.. సునే లూస్ 5 పరుగులకే అవుటైంది. మరో ఓపెనర్, కెప్టెన్ వొల్వార్ట్ 70 పరుగులతో ఇన్నింగ్స్ చక్కదిద్దగా.. ఎనిమిదో నంబర్ బ్యాటర్ నదినే డి క్లెర్క్ 54 బంతుల్లోనే 84 పరుగులతో అజేయంగా నిలిచి.. హర్మన్‌సేన హార్ట్ బ్రేక్ చేసింది.
టాపార్డర్‌లో మేము బాధ్యత తీసుకోలేకపోయాం
ఈ నేపథ్యంలో హర్మన్‌ప్రీత్ కౌర్ మాట్లాడుతూ.. ‘‘టాపార్డర్‌లో మేము బాధ్యత తీసుకోలేకపోయాం. వ్యూహాలు మార్చుకోవాలి. మెరుగైన భాగస్వామ్యాలు నెలకొల్పాలి. ఇదొక సుదీర్ఘ టోర్నమెంట్.
ఏదేమైనా ఈ మ్యాచ్ మాకు కఠినంగా తోచింది. ఎన్నో పాఠాలు నేర్పింది. సానుకూల దృక్పథంతో ముందుకు సాగుతాం. ఈ మ్యాచ్‌లో ఇరుజట్లు గొప్పగా ఆడాయి. మా టాపార్డర్ కుప్పకూలినా 250కి పైగా స్కోరు చేయడం శుభపరిణామమే.
అయితే, ఆఖర్లో క్లెర్క్ అద్భుత బ్యాటింగ్‌తో మ్యాచ్‌ను తమ జట్టు వైపు తిప్పేసింది. విశాఖ పిచ్ బాగుంది. సౌతాఫ్రికా విజయానికి అర్హమైన జట్టే’’ అని హర్మన్‌ప్రీత్ కౌర్ పేర్కొంది. ఇక రిచా ఇన్నింగ్స్ గురించి ప్రస్తావిస్తూ.. ‘‘అత్యద్భుతంగా ఆడింది. రిచా హిట్టింగ్ ఈ మ్యాచ్‌లో మాకు అతిపెద్ద సానుకూలాంశం. తనిలాగే ముందుకు సాగుతుందని ఆశిస్తున్నాం’’ అని హర్మన్ పేర్కొంది.
చదవండి: టీమిండియాపై అనూహ్య విజయం.. దక్షిణాఫ్రికా ప్రపంచ రికార్డు