
నేడు న్యూజిలాండ్‌తో భారత్ పోరు
గెలిస్తే సెమీస్‌లో చోటు ఖాయం
కివీస్‌కూ చావో రేవో
మధ్యాహ్నం 3 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్‌లో ప్రత్యక్ష ప్రసారం
సొంతగడ్డపై మహిళల వరల్డ్ కప్ టైటిల్ ఫేవరెట్స్‌లో ఒక జట్టుగా బరిలోకి దిగిన భారత్ ఐదు మ్యాచ్‌ల తర్వాత కూడా ఇంకా సెమీస్ స్థానాన్ని ఖాయం చేసుకోలేకపోయింది. వరుసగా మూడు ఓటములతో దెబ్బతిన్న టీమిండియా ముంగిట ఇప్పుడు మరో అవకాశం నిలిచింది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే హర్మన్‌ప్రీత్ బృందానికి అధికారికంగా సెమీఫైనల్లో చోటు ఖాయమవుతుంది. మరోవైపు బలహీన జట్లతో గెలిచే అవకాశం ఉన్న రెండు వరుస మ్యాచ్‌లు వానబారిన పడటంతో వెనుకబడిన న్యూజిలాండ్ కచ్చితంగా గెలవాల్సిన స్థితిలో నిలిచింది.
నవీ ముంబై: వన్డే వరల్డ్ కప్‌లో కీలక పోరుకు భారత మహిళల బృందం సిద్ధమైంది. లీగ్ దశలో భాగంగా నేడు జరిగే మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో టీమిండియా తలపడుతుంది. తొలి రెండు మ్యాచ్‌లలో గెలిచి ఉత్సాహంతో కనిపించిన భారత్ ఆ తర్వాత అనూహ్యంగా మూడు ఓటములను ఎదుర్కొంది. మూడు సందర్భాల్లోనూ మెరుగ్గానే ఆడి మ్యాచ్‌ను నియంత్రణలోనే ఉంచుకున్నా... చివరికొచ్చేసరికి చేతులెత్తేసింది. అయితే పరిస్థితి ఇంకా భారత్ చేయిదాటిపోలేదు.
కివీస్‌పై గెలిస్తే ఎలాంటి సమీకరణాలతో సంబంధం లేకుండా భారత్ సెమీస్ చేరుతుంది. అయితే పటిష్ట ప్రత్యర్థి, మాజీ చాంపియన్‌తో పోరు అంత సులువు కాదు. ఓడితే సెమీస్ అవకాశాలు కోల్పోనున్న కివీస్ పట్టుదలగా పోరాడుతుందనడంలో సందేహం లేదు. 2022 నుంచి కివీస్‌తో 9 వన్డేలు ఆడిన భారత్ 6 మ్యాచ్‌లలో ఓడింది.
మార్పు చేస్తారా!
వరుసగా నాలుగు మ్యాచ్‌ల తర్వాత గత పోరులో భారత్ ఒక కీలక మార్పు చేసింది. ఆరో బౌలర్‌తో బౌలింగ్‌ను పటిష్ట పర్చుకోవడంలో భాగంగా రేణుకా సింగ్‌ను తుది జట్టులోకి తీసుకుంది. ఈ క్రమంలో బ్యాటర్ జెమీమా రోడ్రిగ్స్‌పై వేటు పడింది. అయితే ఇంగ్లండ్‌పై అది పెద్దగా ఫలితాన్ని ఇవ్వలేదు. రేణుక ఒక్క వికెట్ కూడా తీయకపోగా, విజయానికి చేరువగా వచి్చన జట్టు చివర్లో బ్యాటింగ్ తడబాటుతో చేజేతులా ఓడింది. స్మృతి కూడా ఈ విషయాన్ని అంగీకరించింది.
ఈ నేపథ్యంలో మళ్లీ జెమీమాకు అవకాశం కల్పిస్తారా చూడాలి. గత పోరులో ప్రధాన బ్యాటర్లు స్మృతి, కెప్టెన్ హర్మన్‌లతో పాటు మరో సీనియర్ దీప్తి శర్మ కూడా అర్ధసెంచరీలు చేసినా జట్టును గెలిపించలేకపోయారు. ఇలాంటి తడబాటును అధిగమించి టాప్ ప్లేయర్లు మరింత బాధ్యతగా ఆడాల్సి ఉంది. ఇతర బ్యాటర్లలో ప్రతీక, హర్లీన్ మినహా మరో చెప్పుకోదగ్గ ప్రత్యామ్నాయం కూడా జట్టు వద్ద లేదు. రిచా ఘోష్ తనదైన శైలిలో దూకుడుగా ఆడితే జట్టుకు అదనపు ప్రయోజనం కలుగుతుంది. టోర్నీ ఆరంభంలో ఆకట్టుకున్న పేసర్ క్రాంతి గౌడ్ పదును మ్యాచ్ మ్యాచ్‌కూ తగ్గుతూ వచ్చింది.
అమన్‌జోత్ మీడియం పేస్ కూడా అంతగా ప్రభావం చూపడం లేదు. గత మ్యాచ్‌లో ముగ్గురు స్పిన్నర్లూ విఫలమయ్యారు. ఈ మ్యాచ్‌లో మన స్పిన్నర్లు ప్రత్యర్థిని ఎలా కట్టడి చేస్తారో చూడాలి.
సోఫీ డివైన్ మినహా...
మహిళల క్రికెట్‌లో పటిష్టమైన జట్లలో ఒకటైన న్యూజిలాండ్ ఈసారి ప్రభావవంతంగా కనిపించడం లేదు. ఆ్రస్టేలియా, దక్షిణాఫ్రికాల చేతిలో ఓడిన కివీస్ ఒక్క బంగ్లాదేశ్‌పై మాత్రమే గెలిచింది. పాక్, శ్రీలంకలతో మ్యాచ్‌లు వర్షం కారణంగా రద్దు కావడంతో పాయింట్లు పంచుకోవాల్సి వచ్చింది. టోరీ్నలో ఒక సెంచరీ, 2 అర్ధ సెంచరీలు సాధించిన కెపె్టన్ సోఫీ డివైన్‌పైనే జట్టు బ్యాటింగ్ ఆధారపడుతోంది. ఓపెనర్లు సుజీ బేట్స్, ప్లిమ్మర్ పూర్తిగా విఫలమయ్యారు. ఆల్‌రౌండర్ అమెలియా కెర్‌తోపాటు స్పిన్నర్ కార్సన్ కూడా ఎలాంటి ప్రభావం చూపించడం లేదు. గత మ్యాచ్ ఆడని ప్రధాన పేసర్ తహుహు ఈ మ్యాచ్‌లో మళ్లీ బరిలోకి దిగుతోంది. మిడిలార్డర్‌లో హ్యాలిడే, గ్రీన్, ఇసాబెల్లా బ్యాటింగ్‌లో రాణిస్తేనే కివీస్ చెప్పుకోదగ్గ స్కోరు చేసేందుకు అవకాశం ఉంటుంది.
పిచ్, వాతావరణం
నవీ ముంబైలోని డీవై పాటిల్ మైదానం పిచ్ ప్రధానంగా బ్యాటింగ్‌కు అనుకూలం. భారీ స్కోరుకు అవకాశం ఉంది. భారత జట్టు సభ్యులందరికీ ఇక్కడ ఎక్కువగా ఆడిన అనుభవం ఉండటం సానుకూలాంశం. మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించవచ్చు.
సెమీస్ సమీకరణం ఇదీ...
→ న్యూజిలాండ్‌పై గెలిస్తే భారత్ 6 పాయింట్లతో నేరుగా సెమీస్ చేరుతుంది.
→ ఒకవేళ భారత్ ఓడితే తర్వాతి మ్యాచ్‌లో ఇంగ్లండ్ చేతిలో న్యూజిలాండ్ ఓడాల్సి ఉంటుంది. అప్పుడు బంగ్లాదేశ్‌పై నెగ్గితే మనకు సెమీస్ స్థానం ఖాయమవుతుంది.
→ ఇంగ్లండ్‌పై కివీస్ నెగ్గి 6 పాయింట్లతో సమమైనా... అది కివీస్‌కు 2వ విజయం అవుతుంది. ఎక్కువ మ్యాచ్‌లు గెలిచినందుకు భారత్ (3) ముందంజ వేస్తుంది.
→ కివీస్‌తో మ్యాచ్ రద్దయితే బంగ్లాదేశ్‌ను భారత్ ఓడిస్తే చాలు. ఒకవేళ మనం బంగ్లాదేశ్ చేతిలో పరాజయం పాలైనా...న్యూజిలాండ్, శ్రీలంక తమ తర్వాతి మ్యాచ్‌లు ఓడిపోవాల్సి ఉంటుంది.
→ భారత్ ఆడాల్సిన రెండు మ్యాచ్‌లూ రద్దయినా... కివీస్‌ను ఇంగ్లండ్ ఓడిస్తే సరిపోతుంది.