
పాకిస్తాన్ అప్ కమింగ్ ఆల్‌రౌండర్ ఆమిర్ జమాల్ (Aamer Jamal) ఇంట తీవ్ర విషాదం నెలకొంది. జమాల్ అప్పుడే పుట్టిన తన బిడ్డను కోల్పోయాడు. ఈ విషయాన్ని సోషల్‌మీడియా వేదికగా పంచుకున్నాడు.
చనిపోక ముందు బిడ్డ తన చేతి వేళ్లను పట్టుకున్న దృష్యాన్ని షేర్ చేస్తూ.. "అల్లా దగ్గరి నుండి వచ్చి, తిరిగి అల్లానే చేరుకుంది. నిన్ను ఎక్కువ సేపు ఆపలేకపోయాను చిట్టి తల్లి. అమ్మా, నాన్న నిన్ను చాలా మిస్ అవుతారు. స్వర్గంలో ఉన్నత స్థానంలో ఉండాలని కోరుకుంటున్నానంటూ" బాధను వ్యక్తం చేశాడు.
ఈ పోస్ట్‌కు సోషల్‌మీడియాలో విపరీతమైన స్పందన వస్తుంది. బిడ్డను కోల్పోయిన బాధలో జమాల్ పెట్టిన సందేశం నెటిజన్లను కలిచి వేస్తుంది. జమాల్‌కు సానుభూతి సందేశాలు వెల్లువలా వస్తున్నాయి. ప్రాంతాలతో సంబంధం లేకుండా క్రికెట్ అభిమానులు జమాల్‌ను ఓదారుస్తున్నారు.
జమాల్ ఇటీవలే పీసీబీ కాంట్రాక్ట్‌ను కూడా కోల్పోయాడు. ప్రస్తుతం అతను పాకిస్తాన్ దేశవాలీ టోర్నీ Quaid-e-Azam Trophyలో ఆడుతున్నాడు. 28 ఏళ్ల జమాల్ పాక్ తరఫున 8 టెస్ట్‌లు, 3 వన్డేలు, 6 టీ20లు ఆడి మొత్తంగా 26 వికెట్లు తీశాడు. టెస్ట్‌ల్లో 2 హాఫ్ సెంచరీల సాయంతో 352 పరుగులు, వన్డేల్లో 5, టీ20ల్లో 88 పరుగులు చేశాడు.
కుడి చేతి వాటం ఫాస్ట్ బౌలర్ అయిన జమాల్ 2022లో టీ20ల ద్వారా అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. ఈ ఏడాది సిడ్నీలో ఆస్ట్రేలియాపై అతనాడిన 82 పరుగుల ఇన్నింగ్స్ హైలైటైంది. జమాల్ ఫస్ట్ క్లాస్ కెరీర్ కూడా అద్భుతంగా ఉంది. 40 మ్యాచ్‌ల్లో 99 వికెట్లు తీసి, 1103 పరుగులు చేశాడు.