
మహిళల వన్డే ప్రపంచకప్‌లో (Women's CWC 2025) ఇవాళ (అక్టోబర్ 22) ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జట్లు (Australia vs England) తలపడుతున్నాయి. ఇండోర్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ స్వల్ప స్కోర్‌కే పరిమితమైంది.
ఆసీస్ బౌలర్లు రాణించడంతో నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 244 పరుగులు మాత్రమే చేయగలిగింది. అన్నాబెల్ సదర్‌ల్యాండ్ (10-1-60-3), సోఫీ మోలినెక్స్ (10-0-52-2), ఆష్లే గార్డ్‌నర్ (9-0-39-2), అలానా కింగ్ (10-1-20-1), కిమ్ గార్త్ (7-2-43-0) ఇంగ్లండ్ బ్యాటర్లను ఇబ్బంది పెట్టారు.
ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో ఓపెనర్ ట్యామీ బేమౌంట్ (78) మాత్రమే సత్తా చాటింది. అలైస్ క్యాప్సీ (38), ఛార్లోట్ డీన్ (26), సోఫీ డంక్లీ (22), హీథర్ నైట్ (20) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. యామీ జోన్స్ 18, కెప్టెన్ నాట్ సీవర్ బ్రంట్ 7, ఎమ్మా ల్యాంబ్ 7, లిన్సే స్మిత్ 3 పరుగులు చేసి ఔటయ్యారు. సోఫీ ఎక్లెస్టోన్ 10, లారెన్ బెల్ 2 పరుగులతో అజేయంగా నిలిచారు.
కాగా, ప్రస్తుత ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ ఇదివరకే సెమీస్‌కు అర్హత సాధించాయి. దీంతో ఈ మ్యాచ్ నామమాత్రంగా సాగనుంది. ఈ రెండు జట్లతో పాటు సౌతాఫ్రికాకు ఫైనల్ ఫోర్‌కు అర్హత సాధించింది. నాలుగో బెర్త్ కోసం భారత్, న్యూజిలాండ్ జట్లు పోటీపడుతున్నాయి. ప్రస్తుతం సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ పాయింట్ల పట్టికలో తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి. బంగ్లాదేశ్, పాకిస్తాన్ టోర్నీ నుంచి అధికారికంగా నిష్క్రమించాయి.