
స్మృతి మంధాన (PC: BCCI)
ఐసీసీ మహిళల వన్డే వరల్డ్‌కప్-2025 (ODI World Cup 2025)లో భారత జట్టు మరో పరాజయం చవిచూసింది. స్వీయ తప్పిదాల కారణంగా ఇంగ్లండ్ మహిళా జట్టు (IND W vs ENG W)తో గెలవాల్సిన మ్యాచ్‌లో.. నాలుగు పరుగుల స్వల్ప తేడాతో ఓడిపోయింది. తద్వారా సెమీ ఫైనల్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది.
ఈ నేపథ్యంలో ఇండోర్ వేదికగా ఇంగ్లండ్ చేతిలో ఓటమిపై భారత జట్టు వైస్ కెప్టెన్ స్మృతి మంధాన (Smriti Mandhana) స్పందించింది. తాను కాస్త తెలివిగా ఆడి ఉంటే మ్యాచ్ తప్పక గెలిచేవాళ్లమని పేర్కొంది. గెలవాల్సిన మ్యాచ్‌లో ఓడటానికి తాను ప్రధాన కారణమంటూ ఓటమికి బాధ్యత వహించింది.
88 పరుగులు చేసి..
నిజానికి ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో స్మృతి అదరగొట్టింది. ఈ ఓపెనింగ్ బ్యాటర్ 94 బంతులు ఎదుర్కొని 88 పరుగులు చేసి.. జట్టును విజయం దిశగా నడిపించింది. చేతిలో ఏడు వికెట్లు.. గెలుపునకు 53 బంతుల్లో 55 పరుగులు అవసరమైన వేళ అనూహ్య రీతిలో స్మృతి అవుటైంది.
లిన్సే స్మిత్ బౌలింగ్‌లో లాంగాఫ్ మీదుగా షాట్ బాది అలిస్ కాప్సేకి క్యాచ్ ఇచ్చిన స్మృతి మంధాన.. పెవిలియన్‌కు చేరింది. ఇక కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ కూడా అద్బుత అర్ధ శతకం (70)తో రాణించింది. మరోవైపు.. దీప్తి శర్మ 50 పరుగులతో అదరగొట్టింది. కానీ స్మృతి అవుటైన తర్వాత భారత బ్యాటింగ్ ఆర్డర్ వేగంగా పతనమైంది.
The skipper’s looking solid and locked on to the chase! 🤜🏻🤛🏻
Will Harmanpreet Kaur turn this start into a big one and guide #TeamIndia through in this do-or-die clash? 😮💨
Catch the LIVE action ➡https://t.co/WF0rXIHjl8#CWC25 👉 #INDvENG | LIVE NOW on Star Sports & JioHotstar pic.twitter.com/vTs7nP01Tb— Star Sports (@StarSportsIndia) October 19, 2025
ఇంగ్లండ్ విధించిన 289 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో.. నిర్ణీత 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి టీమిండియా 284 పరుగుల వద్ద నిలిచింది. దీంతో ఓటమి ఖరారైంది. ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం స్మృతి మంధాన తీవ్ర భావోద్వేగానికి లోనైంది.
నా వల్లే జట్టు ఓడింది.. నేను కాస్త తెలివిగా ఆడాల్సింది
‘‘అవును.. మా బ్యాటింగ్ ఆర్డర్ కుప్పకూలింది. ప్రతి ఒక్కరు ఇది చూసే ఉంటారు. మా షాట్ సెలక్షన్లు మరింత మెరుగ్గా ఉండాల్సింది. ముఖ్యంగా నేను.. ఇంకాస్త తెలివిగా ప్రవర్తించాల్సింది. మా బ్యాటింగ్ ఆర్డర్ పతనం నాతోనే మొదలైంది. ఇందుకు నేను నైతిక బాధ్యత వహిస్తాను.
నాదే బాధ్యత
మేము ఓవర్‌కు కేవలం ఆరు పరుగులు చేసి ఉంటే గెలిచేవాళ్లం. కానీ పరిస్థితి మరోలా మారిపోయింది. ఏదేమైనా ఈ మ్యాచ్‌లో మా బ్యాటింగ్ ఆర్డర్ పతనానికి నాదే బాధ్యత’’ అని స్మృతి మంధాన పేర్కొంది. కాగా తాజా వన్డే వరల్డ్‌కప్ టోర్నీలో భారత్‌కు ఇది హ్యాట్రిక్ ఓటమి.
ఇదిలా ఉంటే.. ఇప్పటికే ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా మహిళా జట్లు సెమీ ఫైనల్ చేరగా.. భారత్‌పై గెలుపుతో ఇంగ్లండ్ కూడా సెమీస్‌కు అర్హత సాధించింది. నాలుగో స్థానం కోసం న్యూజిలాండ్‌తో భారత్ పోటీ పడుతోంది.
చదవండి: నితీశ్ రెడ్డిని అందుకే తీసుకున్నారు.. కానీ ఇదేం పద్ధతి?: అశూ ఫైర్