
కొలంబో: భారత్‌లో మహిళల క్రికెట్ ఎదుగుదలలో కీలక పాత్ర పోషించిన పలువురి కోసం తాము వన్డే ప్రపంచ కప్ (ICC Womens ODI World Cup)ను గెలవాలని కోరుకుంటున్నట్లు భారత బ్యాటర్ జెమీమా రోడ్రిగ్స్ (Jemimah Rodrigues)వ్యాఖ్యానించింది.
ఈ క్రమంలో బయట జరిగే చర్చ గురించి తాము పట్టించుకోమని, తమ దృష్టి మొత్తం విజయంపైనే ఉందని ఆమె వెల్లడించింది. ఆదివారం పాకిస్తాన్‌ను ఓడించిన తర్వాత జెమీమా తమ ప్రదర్శనపై మాట్లాడింది.
సవాళ్ల గురించే చర్చ
‘మేం ఒకసారి ఒక మ్యాచ్‌పైనే దృష్టి పెడుతూ ముందుకు వెళుతున్నాం. ప్రపంచ కప్ గురించి బయట ఎంతో చర్చ జరుగుతుందని మాకు తెలుసు. దాని ప్రభావం మాపై పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. మా బృందం సమావేశాల్లో కూడా ఆటలో ఎదురయ్యే సవాళ్ల గురించే మాట్లాడుకుంటున్నాం.
అప్పుడు మిథాలీ, జులన్.. ఇప్పుడు..
ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ ముందుకు సాగుతున్నాం. నేను జట్టులోకి వచ్చినప్పుడు మిథాలీ, జులన్‌లాంటి సీనియర్లు నడిపించారు. ఇప్పుడు హర్మన్, స్మృతి కలిసి జట్టును ముందుకు తీసుకెళుతున్నారు. అందరూ తమ అత్యుత్తమ ప్రదర్శన చూపించే విధంగా వారు తీర్చిదిద్దారు.
భారత మహిళల క్రికెట్ స్థాయిని పెంచిన మిథాలీ, జులన్, నీతూ డేవిడ్‌వంటి ప్లేయర్ల కోసం వరల్డ్ కప్ గెలవాలని పట్టుదలగా ఉన్నాం’ అని జెమీమా పేర్కొంది. గువహటి, కొలంబో పిచ్‌లను బ్యాటర్లకు సవాల్‌గా నిలిచాయని, పరిస్థితులకు తగినట్లుగా తమ ఆటను మలచుకున్నామని ఆమె వివరించింది.
చదవండి: ‘మీ నాన్నతో కలిసి ఆటో తోలుకో’;.. ధోని ఆరోజు చెప్పిన మాటతో ఇలా..: సిరాజ్