
ప్రస్తుతం ఆస్ట్రేలియాలో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో (India vs Australia) టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి (Virat Kohli) వరుసగా రెండు మ్యాచ్‌ల్లో డకౌటయ్యాడు. తొలి వన్డేల్లో 8 బంతులు ఆడి ఖాతా తెరవలేకపోయిన కోహ్లి.. ఇవాళ (అక్టోబర్ 23) తనకు అచ్చొచ్చే మైదానమైన అడిలైడ్‌లో 4 బంతుల డకౌట్‌ను నమోదు చేశాడు.
కోహ్లి తన 17 ఏళ్ల కెరీర్‌లో వరుసగా రెండు వన్డేల్లో డకౌట్ కావడం ఇదే మొదటిసారి. ఈ డబుల్ డక్ కోహ్లి కెరీర్‌లో చెరగని మరకలా మిగిలిపోతుంది. కెరీర్ చరమాంకంలో రికార్డుల రారాజుకు ఇలాంటి అనుభవం ఎదురు కావడం దురదృష్టకరం.
టెస్ట్‌లకు, టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించి, ఏడు నెలల విరామం తర్వాత బరిలోకి దిగిన కోహ్లి మునుపటి జోరును ప్రదర్శించలేకపోతున్నాడు. రెండో వన్డేలో ఔటైన తర్వాత అతని ప్రవర్తన ఈ సిరీస్‌తో కెరీర్ ముగింపును సూచించింది. తమ ఆరాధ్య ఆటగాడు కెరీర్ చరమాంకంలో వరుస డకౌట్లు కావడాన్ని కోహ్లి అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.
డబుల్ డక్ తర్వాత కోహ్లి వన్డే సగటు కూడా పడిపోయింది. కోహ్లి ఫామ్‌లో ఉన్నప్పుడే రిటైరయ్యుంటే గౌరవంగా ఉండేదని అతని అభిమానులు అనుకుంటున్నారు. మరోపక్క కోహ్లిలాగే కెరీర్ చరమాంకంలో ఉన్న రోహిత్ శర్మ (Rohit Sharma) మాత్రం రెండో వన్డేలో హిట్ అయ్యాడు.
రోహిత్ కూడా తొలి వన్డేలో నిరాశపరిచినా రెండో వన్డేలో మాత్రం బాధ్యతాయుతమైన అర్ద సెంచరీతో (73) జట్టును ఆదుకున్నాడు. ఈ ప్రదర్శనతో రోహిత్ అభిమానులు సంబరపడిపోతున్నారు. హిట్‌మ్యాన్ ఈజ్ బ్యాక్ అంటూ సోషల్‌మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.
మ్యాచ్ విషయానికొస్తే.. రోహిత్‌తో పాటు శ్రేయస్ అయ్యర్ (61), అక్షర్ పటేల్ (44) బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్‌లు ఆడటంతో భారత్ గౌరవప్రదమైన స్కోర్ (264/9) చేసింది. ఆఖర్లో హర్షిత్ రాణా (24 నాటౌట్), అర్షదీప్ సింగ్ (13) అమూల్యమైన పరుగులు జోడించారు.
ఛేదనలో ఆస్ట్రేలియా తడబడుతుంది. 54 పరుగులకే ఓపెనర్లు మిచెల్ మార్ష్ (11), ట్రవిస్ హెడ్ (28) వికెట్లు కోల్పోయింది. మాథ్యూ షార్ట్ (32), మ్యాట్ రెన్‌షా (23) క్రీజ్‌లో ఉన్నారు. 19 ఓవర్ల తర్వాత ఆ జట్టు స్కోర్ 96/2గాఉంది. ఈ మ్యాచ్‌లో గెలవాలంటే ఆసీస్ మరో 169 పరుగులు చేయాలి. కాగా, ఈ సిరీస్‌లోని తొలి వన్డేలో ఆస్ట్రేలియా విజయం సాధించిన విషయం తెలిసిందే.
చదవండి: కొత్త బ్యాటర్.. ఆరంభంలోనే అదుర్స్!