
టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా దాదాపు పది నెలల తర్వాత తిరిగి ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో ఆడేందుకు సిద్దమయ్యాడు. రంజీ ట్రోఫీ 2025-26 సీజన్‌లో భాగంగా మధ్యప్రదేశ్‌తో మ్యాచ్‌కు ప్రకటించిన సౌరాష్ట్ర జట్టులో జడేజాకు చోటు దక్కింది. ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌కు జడేజా ఎంపిక కాకపోవడంతో ప్రస్తుతం ఖాళీగానే ఉన్నాడు.
ఈ క్రమంలో ఎంపీతో మ్యాచ్‌కు అందుబాటులో ఉంటాని జడేజా తనంతట తానే సౌరాష్ట్ర సెలక్టర్లకు తెలియజేసినట్లు తెలుస్తోంది. జడేజా జట్టులోకి వచ్చినప్పటికి సౌరాష్ట్ర కెప్టెన్‌గా జయదేవ్ ఉనద్కట్ కొనసాగనున్నాడు. అక్టోబర్ 25 నుంచి రాజ్‌కోట్ వేదికగా సౌరాష్ట్ర-మధ్యప్రదేశ్ మ్యాచ్ ప్రారంభం కానుంది.
సూపర్ ఫామ్‌లో జడ్డూ..
కాగా జడేజా ప్రస్తుతం అద్బుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఇటీవల వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌లో ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టిన జడ్డూ.. ప్లేయర్ ఆఫ్‌ది సిరీస్ అవార్డు గెలుచుకున్నాడు. అయితే ఆసీస్‌తో వన్డేలకు జడేజాను ఎంపిక చేస్తారని అంతా భావించారు. కానీ సెలక్టర్లు మాత్రం ఎడమ చేతి వాటం స్పిన్నర్‌గా జడేజాకు బదులుగా అక్షర్ పటేల్‌ను తీసుకున్నారు.
వాషింగ్టన్ సుందర్, పటేల్‌ను స్పిన్ ఆల్‌రౌండర్లగా ఎంపిక చేసిన సెలక్టర్లు.. జడేజాకు ఛాన్స్ ఇవ్వలేదు. అయితే జడ్డూతో చర్చించాకే సెలక్షన్ కమిటీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సౌరాష్ట్ర క్రికెట్ తిరిగి వచ్చే నెలలో భారత జెర్సీలో కన్పించనున్నాడు. సౌతాఫ్రికాతో రెండు టెస్టుల సిరీస్‌లో జడ్డూ భాగంగా కానున్నాడు. ఈ సిరీస్ సన్నాహకంగా రంజీ ట్రోఫీ మ్యాచ్‌ను ఉపయోగించుకోవాలని జడేజా భావిస్తున్నాడు.
సౌరాష్ట్ర జట్టు: హార్విక్ దేశాయ్ (వికెట్ కీపర్), తరంగ్ గోహెల్, రవీంద్ర జడేజా, యువరాజ్‌సిన్హ్ దోడియా, సమ్మర్ గజ్జర్, అర్పిత్ వాసవాడ, చిరాగ్ జానీ, ప్రేరక్ మన్కడ్, జయదేవ్ ఉనద్కత్ (కెప్టెన్), ధర్మేంద్రసింగ్ జడేజా, చేతన్ సకారియా, అన్ష్ గోసాయి, జే గోహిల్, పార్త్ భుట్, కెవిన్ జీవరాజని, హెత్విక్ కోటక్ మరియు అంకుర్ పన్వర్.