
2025 ఆసియా కప్.. ఈ ఖండాతర టోర్నీ చరిత్రలో అత్యంత వివాదాస్పద ఎడిషన్‌గా నిలిచింది. షేక్ హ్యాండ్ వివాదం మొదలు ఆసియా కప్ ట్రోఫీ వరకూ ఆధ్యంతం తీవ్ర ఉత్కంఠను రేపింది. పెహల్గమ్ ఉగ్రదాడికి నిరసనగా పాక్ ఆటగాళ్లతో భారత జట్టు అంటిముట్టనట్టే వ్యవహరించింది.
తొలుత షేక్ హ్యాండ్స్ ఇవ్వడానికి నిరాకరించిన భారత్.. ఆ తర్వాత ఏసీసీ చైర్మెన్, పీసీబీ చీఫ్ మోహ్సన్ నఖ్వీ(mohsin naqvi) చేతుల మీదగా విన్నింగ్ ట్రోఫీని తీసుకోవడానికి సముఖత చూపలేదు. నక్వీ తన చేతుల మీదుగానే ట్రోఫీ తీసుకోవాలని పట్టుబట్టినప్పటికి బీసీసీఐ ఆదేశాల మేరకు టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ అందుకు అంగీకరించలేదు.
దీంతో నఖ్వీ స్టేడియం నుంచి ట్రోఫీతో పాటు విజేతల పతకాలను కూడా తీసుకెళ్లడం పెద్ద వివాదానికి దారితీసింది. ఇప్పటికి ఇంకా ట్రోఫీని భారత్‌కు అతడు అందజేయలేదు. ట్రోఫీ ప్రస్తుతం దుబాయ్‌లోని ఏసీసీ ఆఫీస్‌లో ఉంది. తన అనుమతి లేకుండా ట్రోఫీని ఎవరికీ అప్పగించకూడదని ఏసీసీ అధికారులకు నఖ్వీ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాడు.
నఖ్వీ ట్రోఫీని తీసుకుని వెళ్లిపోవడం, ఇంకా అందజేయకపోవడంపై బీసీసీఐ గుర్రుగా ఉంది. వచ్చే నెలలో జరిగే ఐసీసీ సమావేశంలో ఈ విషయాన్ని బీసీసీఐ లేవనెత్తునుంది. అంతేకాకుండా ఐసీసీ డైరెక్టర్ పదవి నుండి అతడిని తొలిగించాలని భారత క్రికెట్ బోర్డు డిమాండ్ చేస్తోంది.
నఖ్వీ ఏసీసీ చైర్మెన్‌తో పాటు ఐసీసీ డైరెక్టర్ గానూ కొనసాగుతున్నాడు. కాగా ఐసీసీ చైర్మెన్‌గా జై షా ఉన్న సంగతి తెలిసిందే. దీంతో నఖ్వీ డైరక్టర్ పదవి ఊడిపోవడం ఖాయమని ప్రచారం సాగుతోంది.
"ఆసియాకప్ టోర్నీకి అధికారిక హోస్ట్‌గా ఉన్న బీసీసీఐకి ట్రోఫీని పంపడానికి నిరాకరించే హక్కు నఖ్వీకి లేదు. అతడు ట్రోఫీని భారత్‌కు ఇప్పటికే పంపించాల్సింది. కానీ అందుకు అతడు ఒప్పుకోవడం లేదు. కాబట్టి అందుకు నఖ్వీ భారీ మూల్యం చెల్లించుకోనున్నాడు" అని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి.
చదవండి: ఐపీఎల్‌లో అదరగొట్టాడు.. కట్ చేస్తే! ఇప్పుడు ఊహించని జాక్ పాట్