సౌతాఫ్రికాతో టెస్టుల్లో వైట్‌వాష్ తర్వాత వన్డే సిరీస్‌కు సిద్ధమైంది టీమిండియా. సంప్రదాయ క్రికెట్‌లో విఫలమైనా.. పరిమిత ఓవర్ల సిరీస్‌లో సత్తా చాటాలని పట్టుదలగా ఉంది. నవంబరు 30- డిసెంబరు 6 మధ్య ప్రొటిస్ జట్టుతో భారత్ మూడు వన్డేలు ఆడేందుకు షెడ్యూల్ ఖరారైన విషయం తెలిసిందే.
ఇందులో భాగంగా రాంచి వేదికగా ఆదివారం జరిగే తొలి వన్డేకు టీమిండియా సిద్ధమైంది. దిగ్గజ బ్యాటర్లు విరాట్ కోహ్లి (Virat Kohli), రోహిత్ శర్మ (Rohit Sharma)తో పాటు జట్టు మొత్తం ఇప్పటికే మ్యాచ్ జరిగే వేదికకు చేరుకుంది. ఈ నేపథ్యంలో రో- కో భవితవ్యంపై మరోసారి చర్చ మొదలైంది. వన్డే వరల్డ్‌కప్-2027 (ICC World Cup 2027) వరకు ఈ లెజెండరీ బ్యాటర్లు కొనసాగుతారా? లేదా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
వాటి ఆధారంగానే నిర్ణయిస్తాం
ఈ నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) వర్గాలు ఆసక్తికర విషయాలు వెల్లడించాయి. రోహిత్- కోహ్లిల విషయంలో యాజమాన్యం ఆచితూచి నిర్ణయం తీసుకోనుందని తెలిపాయి. జట్టులో వారి పాత్ర, అంచనాలు, ఫామ్ ఆధారంగానే వీరిద్దరు ప్రపంచకప్ టోర్నీ ఆడతారా? లేదా? అన్న విషయంపై స్పష్టత వస్తుందని పేర్కొన్నాయి.
‘‘ఆస్ట్రేలియా పర్యటనలో వాళ్లిద్దరు మూడో వన్డేలో వింటేజ్ ఆటను గుర్తు చేశారు. అయితే, అప్పటికే సిరీస్ మన చేజారిపోయింది. తొలి రెండు మ్యాచ్‌లలో రో-కో పెద్దగా ఆకట్టుకోలేదు. కాబట్టి ఒక్క మ్యాచ్‌లో ఆడినంత మాత్రాన ప్రతిసారీ వారికి మినహాయింపు లభిస్తుందని అనుకోవద్దు’’ అని టైమ్స్ ఆఫ్ ఇండియతో సదరు వర్గాలు పేర్కొన్నాయి.
తిరుగులేని రో-కో
వన్డేల్లో ఆకాశమంత ఎత్తుకు ఎదిగారు కోహ్లి, రోహిత్. ముఖ్యంగా ఇప్పటికే వన్డే ఫార్మాట్లో 51 శతకాలతో అత్యధిక సెంచరీల వీరుడిగా కోహ్లి కొనసాగుతుండగా.. యాభై ఓవర్ల క్రికెట్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన ఘనుడు రోహిత్ (264 పరుగులు). వీరి ఘనతను చెప్పడానికి ఇవి చిన్న ఉదాహరణలు మాత్రమే.
ఇక కెప్టెన్‌గా రోహిత్ శర్మ ఇటీవలే ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 టైటిల్ కూడా గెలిచాడు. కానీ అనూహ్యంగా ఆస్ట్రేలియా పర్యటనకు ముందు అతడిని సారథిగా తప్పించి.. అతడి స్థాయంలో శుబ్‌మన్ గిల్‌కు పగ్గాలు అప్పగించింది మేనేజ్‌మెంట్. వన్డే వరల్డ్‌కప్-2027 టోర్నీకి జట్టును సన్నద్ధం చేసే క్రమంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.
చెప్పినట్లు వింటారా?
కాగా వన్డే వరల్డ్‌కప్ టోర్నీకి ఇంకా 22 నెలల వ్యవధి ఉంది. ఈలోపు టీమిండియా ఆడే వన్డే సిరీస్‌లలో ప్రదర్శన ఆధారంగానే రో- కో భవితవ్యం తేలనుందని బీసీసీఐ వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రపంచకప్ నాటికి రోహిత్ 40, కోహ్లి 38 ఏళ్ల వయసు దాటేస్తారు. కాబట్టి ఫిట్‌నెస్ పరంగా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.
అయితే, ఇప్పటికే ఫిట్‌నెస్‌కు మారుపేరుగా పేరొందిన కోహ్లి.. మరింత ఫిట్‌గా మారగా.. రోహిత్ ఆసీస్ టూర్‌కు ముందు ఏకంగా పది కిలోల బరువు తగ్గి స్లిమ్‌గా మారిపోయాడు. అయితే, ఇప్పటికే వీరిద్దరు అంతర్జాతీయ టీ20లతో పాటు.. టెస్టులకు కూడా రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. వీళ్లిద్దరు కేవలం ఐపీఎల్ మాత్రమే ఆడుతున్నారు.
ఇలాంటి తరుణంలో ఫిట్‌నెస్, మ్యాచ్ ప్రాక్టీస్, ఫామ్ కోసం రో- కో దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ ఆడాలని మాజీ క్రికెటర్లు సూచిస్తున్నారు. బోర్డు కూడా వీరి నుంచి ఇదే కోరుకుంటోంది. అయితే, ఇప్పటికే అంతర్జాతీయ స్థాయిలో తమను తాము నిరూపించుకున్న రో-కో ఇందుకు సిద్ధంగా లేనట్లు తెలుస్తోంది. ఇటీవల సౌతాఫ్రికా-‘ఎ’తో వన్డే సిరీస్‌లో వీరిద్దరు ఆడతారని ముందుగా వార్తలు వచ్చాయి.
గంభీర్, అగార్కర్‌తో చర్చల తర్వాతే..
కానీ ఈ అనధికారిక సిరీస్‌లో రో-కో ఆడలేదు. ఏదేమైనా సౌతాఫ్రికాతో జరిగే వన్డే సిరీస్‌తో రోహిత్- కోహ్లి భవిష్యత్తుపై ఒక అంచనాకు రావాలని యాజమాన్యం భావిస్తున్నట్లు తెలుస్తోంది. వచ్చే వారం జరిగే సమావేశంలో హెడ్‌కోచ్ గౌతం గంభీర్, చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ ఈ విషయం గురించి రో-కోతో సుదీర్ఘంగా చర్చించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఏదేమైనా వరల్డ్‌కప్ వంటి మెగా టోర్నీలో రోహిత్- కోహ్లి వంటి సీనియర్ల అనుభవం యువ జట్టుకు పనికివస్తుందనడంలో సందేహం లేదు. ప్రస్తుతం వీరిని మించి సత్తా చాటుతున్న యువ ఆటగాళ్లు కూడా ఎవరూ లేరు. అలాంటపుడు రో- కోను గనుక కావాలని తప్పిస్తే మాత్రం టీమిండియాకు కష్టాలు తప్పకపోవచ్చు!!


