
పాకిస్తాన్ పురుషుల క్రికెట్ జట్టు ఆట తీరు ఏ మాత్రం మారడం లేదు. తాజాగా ట్రినిడాడ్ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన సిరిస్ డిసైడర్ మూడో వన్డేలో పాకిస్తాన్ ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. 295 పరుగుల భారీ లక్ష్యచేధనలో పాకిస్తాన్ కేవలం 92 పరుగులకే కుప్పకూలింది. విండీస్ పేసర్ జైడన్ సీల్స్ 6 వికెట్ల పడగొట్టి పాక్ పతనాన్ని శాసించాడు. దీంతో 34 ఏళ్ల తర్వాత విండీస్‌పై పాకిస్తాన్ వన్డే సిరీస్‌ను కోల్పోయింది. ఈ క్రమంలో మహ్మద్ రిజ్వాన్ సేనపై ఆ జట్టు మాజీ పేసర్ షోయబ్ అక్తర్ విమర్శలు గుప్పించాడు. ఇకనైనా పాకిస్తాన్ ఆటతీరు మారాలని అక్తర్ మండిపడ్డాడు.
"ఒకప్పుడు మా జట్టులో అద్బుతమైన టాలెంట్ ఉన్న ఆటగాళ్లు ఉండేవారు. మేము అప్పటిలో ఎవరో ఒకరిపై ఆధారపడే వాళ్లము కాదు. ప్రతీ ఒక్కరూ జట్టు విజయాల్లో తమ వంతు పాత్ర పోషించేవారు. ఎవరూ తప్పించుకునే మార్గాల కోసం వెతికేవారు కాదు. కానీ ఇప్పుడు పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది.
గత పది, పదేహేను ఏళ్ల నుంచి ప్రతీ ఒక్కరూ తమ వ్యక్తిగత రికార్డులు, సగటును పెంచుకునేందుకు ఆడుతున్నారు. కానీ ఎప్పుడైనా ఓ ఆటగాడిగా దేశం కోసం ఆడాలి. అదే మీ లక్ష్యంగా ఉండాలి. ప్రస్తుతం మీ ఉద్దేశ్యం, మనస్తత్వాన్ని మార్చుకోవాలి. మీరు ఆధునిక క్రికెట్ తగ్గట్టు ఆడాలి.
ఇది ఆర్ధం చేసుకోవడం మీకు పెద్ద విషయం కాకపోవచ్చు. ఇకనైనా మీలో మార్పు రావాలి" అంటూ గేమ్ ఆన్ హాయ్ షోలో అక్తర్ పేర్కొన్నాడు. అయితే విండీస్ వన్డే సిరీస్‌ను కోల్పోయిన పాక్ జట్టు టీ 20 సిరీస్‌ను మాత్రం 2-1 తేడాతో సొంతం చేసుకుంది.
చదవండి: PAK Vs WI: హోప్ విధ్వంసకర శతకం.. 34 ఏళ్ల తర్వాత పాక్‌పై సిరీస్ గెలిచిన విండీస్