
టీమిండియా పేస్ బౌలర్ మహ్మద్ షమీ (Mohammed Shami) టెస్టు మ్యాచ్ ఆడి రెండేళ్లు దాటిపోయింది. చివరగా ఐసీసీ వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ (WTC)-2023 ఫైనల్లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో ఈ బెంగాల్ పేసర్ బరిలోకి దిగాడు. నాటి ఈ మెగా పోరులో షమీ ఓవరాల్‌గా నాలుగు వికెట్లు తీయగలిగాడు.
అనంతరం స్వదేశంలో జరిగిన వన్డే వరల్డ్‌కప్-2023లో అద్భుత ప్రదర్శన కనబరిచిన షమీ.. ఈ ఐసీసీ ఈవెంట్ ముగిసిన తర్వాత చీలమండ గాయానికి శస్త్ర చికిత్స చేయించుకున్నాడు.
వరుస సిరీస్‌లకు దూరం
ఈ క్రమంలో సుదీర్ఘ విరామం అనంతరం పరిమిత ఓవర్ల క్రికెట్‌లో రీఎంట్రీ ఇచ్చిన ఈ రైటార్మ్ పేసర్.. ఆఖరిగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 (ICC Champions Trophy)ఫైనల్లో టీమిండియాకు ప్రాతినిథ్యం వహించాడు. అయితే, టెస్టుల్లో మాత్రం వరుస సిరీస్‌లకు అతడు దూరమయ్యాడు.
స్వదేశంలో బంగ్లాదేశ్, న్యూజిలాండ్- అనంతరం ఆస్ట్రేలియా పర్యటన, ఇంగ్లండ్ టూర్లకు ఎంపిక చేసిన జట్లలో షమీకి చోటు దక్కలేదు. అయితే, ఆసీస్ టూర్‌కు తాను సిద్ధంగా ఉన్నానని చెప్పినా సెలక్టర్లు పట్టించుకోలేదనే వార్తలు వచ్చాయి.
ఈ విషయం గురించి బీసీసీఐ సన్నిహిత వర్గాలు తాజాగా స్పందిస్తూ.. ‘‘ఫామ్‌లేమి కారణంగా అతడిని జట్టు నుంచి తప్పించలేదు. ఫిట్‌నెస్ సమస్యల కారణంగా తనకు తానే తప్పుకొన్నాడు. అందుకే ఇంగ్లండ్‌కు ప్రయాణం చేయలేకపోయాడు.
సెలక్టర్లు తప్పించలేదు.. తనే తప్పుకొన్నాడు
ఆస్ట్రేలియా టూర్ మిస్సైన తర్వాత.. ఇంగ్లండ్ పర్యటనకు ఎంపిక చేయాలని సెలక్టర్లు భావించారు. అతడి అవసరం జట్టుకు ఉందని భావించారు. జట్టును ఖరారు చేసే సమయంలో షమీతో మాట్లాడారు కూడా!
అయితే, తను మాత్రం ఆత్మవిశ్వాసంతో లేడు. ఫిట్‌నెస్ సమస్యలు లేవని కచ్చితంగా చెప్పలేకపోయాడు. షమీ ఫిట్‌నెస్ సాధిస్తే సంప్రదాయ ఫార్మాట్లోనూ త్వరలోనే రీఎంట్రీ ఇవ్వగలడు. రంజీ మ్యాచ్‌లలో మూడు- నాలుగు ఓవర్లు బౌల్ చేసి అతడు విశ్రాంతి తీసుకున్నాడు. అయితే, ఐదు రోజుల మ్యాచ్‌కు అతడి శరీరం పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉన్నపుడే రీఎంట్రీపై స్పష్టత వస్తుంది.
దులిప్ ట్రోఫీలో ఈస్ట్ జోన్ తరఫున అతడి ప్రదర్శన ఎలా ఉంటుందో చూడాలి’’ అని పేర్కొన్నాయి. అదే విధంగా.. 34 ఏళ్ల షమీకి వయస్సు పెద్ద సమస్య కాదని.. ఇంకో ఏడు- ఎనిమిదేళ్ల పాటు క్రికెట్ ఆడగల సత్తా అతడిలో ఉందంటూ సదరు వర్గాలు ప్రశంసలు కురిపించాయి.
చదవండి: క్రికెట్‌లో కలకాలం నిలిచిపోయే రికార్డులు.. ఎవ్వరూ బ్రేక్ చేయలేరు!