
ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌లో టీమిండియా స్టార్ రిషభ్ పంత్ (Rishabh Pant) అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఇప్పటికి మూడు టెస్టులు ఆడిన ఈ వికెట్ కీపర్ బ్యాటర్.. ఆరు ఇన్నింగ్స్‌లో కలిపి 70కి పైగా సగటుతో 425 పరుగులు సాధించాడు. ఇందులో రెండు శతకాలు కూడా ఉండటం విశేషం.
అయితే, పంత్ కొన్నిసార్లు అనవసరపు షాట్లకు పోయి వికెట్ పారేసుకోవడం వల్ల విమర్శలు మూటగట్టుకుంటున్నాడు. చివరగా ఆస్ట్రేలియాతో టెస్టుల్లోనూ నిర్లక్ష్యపు షాట్లతో మూల్యం చెల్లించిన ఈ ఎడమచేతి వాటం బ్యాటర్.. ఇంగ్లండ్‌లోనూ అదే పునరావృతం చేస్తున్నాడు. ముఖ్యంగా స్పిన్నర్ షోయబ్ బషీర్ (Shoaib Bashir) బౌలింగ్‌లో రెండుసార్లు భారీ షాట్లకు పోయి వికెట్ సమర్పించుకున్నాడు.
ఐపీఎల్ కోసం దాచి ఉంచు పంత్
ఈ నేపథ్యంలో పంత్ రిస్కీ షాట్ల గురించి భారత మాజీ వికెట్ కీపర్ బ్యాటర్ ఫారూఖ్ ఇంజనీర్ స్పందిస్తూ.. ‘‘కచ్చితంగా అతడు ఇలాంటి షాట్లు ఆడటం మానుకోవాలి. ఇలాంటివి ఐపీఎల్ కోసం దాచిపెట్టుకోవాలి. టెస్టు క్రికెట్‌లో ఎంతో క్రమశిక్షణతో బ్యాటింగ్ చేయాల్సి ఉంటుంది.
ముఖ్యంగా మూడు, నాలుగు స్థానాల్లో ఆడేవాళ్లు సరైన రీతిలో ఆడాలి. సహచర ఆటగాళ్లతో కలిసి భారీ భాగస్వామ్యాలు నెలకొల్పి.. తమ ఇన్నింగ్స్‌ను భారీ స్కోర్లుగా మలచుకోవాలి’’ అని సూచించాడు.
పళ్లు మొత్తం రాలిపోయి ఉండేవేమో!
అదే విధంగా.. ‘‘పంత్‌కు ఆత్మవిశ్వాసం ఎక్కువ. అయితే, కీలక సమయాల్లో మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సి ఉంటుంది. అతడు ప్రతిభావంతుడైన ఆటగాడే. కొత్త కొత్త షాట్లు కనిపెడతాడు. ఒక్కోసారి హెల్మెట్ ఉండబట్టి సరిపోయిందిలే అనిపిస్తుంది. మా రోజుల్లో అయితే, పళ్లు మొత్తం రాలిపోయి ఉండేవేమో’’ అంటూ ఫారూఖ్ ఇంజనీర్ సరదాగా వ్యాఖ్యానించాడు.
కాగా రిషభ్ పంత్ వేలికి గాయమై విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మాంచెస్టర్‌లో జరిగే నాలుగో టెస్టులో అతడు కేవలం బ్యాటర్‌గానే బరిలోకి దిగాలని.. అతడికి బదులు ధ్రువ్ జురెల్ వికెట్ కీపర్‌గా వ్యవహరించాలని ఫారూఖ్ ఇంజనీర్ సూచించాడు. ఇక ఐదు టెస్టుల సిరీస్‌లో ఇప్పటికి మూడు పూర్తి కాగా.. ఇంగ్లండ్ రెండు గెలవగా.. టీమిండియా ఒక మ్యాచ్‌లో విజయం సాధించింది.