
టీమిండియా స్టార్ సాయి సుదర్శన్‌కు మరో దేశవాళీ టోర్నమెంట్‌కు దూరమయ్యాడు. దులిప్ ట్రోఫీ (Duleep Trophy)-2025 జట్టులో చోటు దక్కించుకోలేకపోయిన ఈ ఎడమచేతి వాటం బ్యాటర్‌కు బుచ్చిబాబు ఇన్విటేషనల్ టోర్నమెంట్లో ఆడే జట్టులోనూ స్థానం దక్కలేదు.
తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ (TNCA) తాజాగా ఈ దేశీ టోర్నమెంట్‌కు టీఎన్‌సీఏ ఎలెవన్, టీఎన్‌సీఏ ప్రెసిడెంట్స్ ఎలెవన్ పేరిట రెండు జట్లు ప్రకటించింది. అయితే, ఇందులో ఏ జట్టులోనూ సాయి సుదర్శన్ (Sai Sudharsan) పేరు లేదు.
అంతకు ముందు సౌత్‌జోన్ జట్టులోనూ సాయి సుదర్శన్‌కు చోటు దక్కలేదు. దులిప్ ట్రోఫీ ఆడే ఈ జట్టులో సాయితో పాటు.. టీమిండియా స్టార్లు వాషింగ్టన్ సుందర్, ప్రసిద్ కృష్ణ పేర్లు కూడా కనిపించలేదు.
ఐపీఎల్‌లో అదరగొట్టాడు
కాగా చెన్నైకి చెందిన సాయి సుదర్శన్ ఈ ఏడాది ఐపీఎల్‌లో అదరగొట్టాడు. టీమిండియా టెస్టు కెప్టెన్ శుబ్‌మన్ గిల్ సారథ్యంలోని గుజరాత్ టైటాన్స్ తరఫున ఓపెనర్‌గా బరిలోకి దిగి ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఆడిన పద్నాలుగు మ్యాచ్‌లలో కలిపి 54కు పైగా సగటుతో 759 పరుగులు సాధించాడు.
తద్వారా ఐపీఎల్-2025లో అత్యధిక పరుగుల వీరుడిగా నిలిచి.. ఆరెంజ్ క్యాప్ సొంతం చేసుకున్నాడు. అతడి ఖాతాలో ఓ సెంచరీతో పాటు ఆరు అర్ధ శతకాలు కూడా ఉన్నాయి. ఈ మేరకు అద్భుత ప్రదర్శనతో టీమిండియా సెలక్టర్లను ఆకట్టుకున్న సాయి సుదర్శన్.. ఇటీవల ఇంగ్లండ్‌తో జరిగిన సిరీస్ సందర్భంగా టెస్టుల్లో అరంగేట్రం చేశాడు.
లీడ్స్‌లో జరిగిన తొలి టెస్టులో ఆడిన సాయి ఆరంభంలోనే డకౌట్ అయి నిరాశపరిచాడు. ఆ తర్వాత ఈ వన్‌డౌన్ బ్యాటర్‌పై వేటు వేసిన యాజమాన్యం తిరిగి నాలుగు, ఐదో టెస్టుల్లో ఆడించింది. ఈ సిరీస్‌లో సాయి సాధించిన పరుగులు వరుసగా.. 0, 30, 61, 0, 38, 11.
ప్లాన్ అదేనా?
ఇంగ్లండ్ పర్యటనలో ఈ మేర ఒక్క హాఫ్ సెంచరీ మినహా 23 ఏళ్ల సాయి సుదర్శన్ పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. ఈ క్రమంలో దేశీ ఫస్ట్‌క్లాస్ టోర్నీలకు అతడు దూరం కావడం గమనార్హం. అయితే, ఈసారి టీ20 ఫార్మాట్లో జరిగే ఆసియా కప్-2025లో సాయి సుదర్శన్‌కు సెలక్టర్లు ఆడే అవకాశం ఇవ్వొచ్చని వార్తలు వినిపిస్తున్నాయి. అందుకే అతడికి కొన్నాళ్లు విశ్రాంతినిచ్చినట్లు తెలుస్తోంది.
మరోవైపు.. టీమిండియా కెప్టెన్ శుబ్‌మన్ గిల్ సహా అర్ష్‌దీప్ సింగ్, శ్రేయస్ అయ్యర్, శార్దూల్ ఠాకూర్, హర్షిత్ రాణా, తిలక్ వర్మ తదితరులు దులిప్ ట్రోఫీ-2025 ఆడేందుకు సిద్ధమయ్యారు.
బుచ్చిబాబు టోర్నమెంట్‌కు టీఎన్‌సీఏ ప్రెసిడెంట్స్ ఎలెవన్ జట్టు:
ఆర్.సాయి కిషోర్ (కెప్టెన్.), సి. ఆండ్రీ సిద్దార్థ్ సి (వైస్ కెప్టెన్.), బి. ఇంద్రజిత్, విజయ్ శంకర్, ఎం. షారుక్ ఖాన్, ఆర్. విమల్ కుమార్, ఎస్. రాధాకృష్ణన్, ఎస్. లోకేశ్వర్, జి. అజితేష్, జె. హేంచుదేశన్, ఎం. సిద్ధార్థ్, ఆర్.ఎస్. అంబరీష్, సి.వి. అచ్యుత్, హెచ్. త్రిలోక్ నాగ్, పి. శరవణ కుమార్, కె. అభినవ్.
బుచ్చిబాబు టోర్నమెంట్ టీఎన్‌సీఏ ఎలెవన్
ప్రదోష్ రంజన్ పాల్ (కెప్టెన్), బూపతి వైష్ణ కుమార్ (వైస్ కెప్టెన్), బి. సచిన్, తుషార్ రహేజా, కిరణ్ కార్తికేయన్, ఎస్. మహమ్మద్ అలీ, ఎస్. రితిక్ ఈశ్వరన్, ఎస్.ఆర్. అతీష్, ఎస్. లక్షయ్ జైన్, డీటీ చంద్రశేఖర్, పి. విద్యుత్, ఆర్. సోను యాదవ్, డి. దీపేష్, జె. ప్రేమ్ కుమార్, ఎ. ఎసక్కిముత్తు, టీడీ లోకేష్ రాజ్.