
అతనో అసాధారణ బౌలర్
భారత పేసర్‌పై సచిన్ ప్రశంసలు
ముంబై: ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌లో భారత స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా ముందుగా అనుకున్నట్లుగా మూడు మ్యాచ్‌లే ఆడాడు. అయితే అతను బరిలోకి దిగని బర్మింగ్‌హామ్, ఓవల్ టెస్టులలోనే టీమిండియా గెలిచింది. దాంతో బుమ్రా లేకపోయినా పెద్దగా తేడా రాదని, అతను లేకపోయినా మ్యాచ్‌లు గెలవగలమని కొన్ని విశ్లేషణలు ప్రచారంలోకి వచ్చాయి. దీనిపై భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ స్పందించాడు. అసాధారణ బౌలర్ అయిన బుమ్రా గురించి తప్పుగా మాట్లాడవద్దంటూ అండగా నిలిచాడు.
‘బుమ్రా సిరీస్‌ను చాలా బాగా మొదలు పెట్టాడు. ఆడింది మూడు మ్యాచ్‌లే అయినా... తొలి టెస్టులో ఒకసారి, మూడో టెస్టులో ఒకసారి ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు. అయితే ప్రజలు వేరే అంశాలు ముందుకు తెచ్చి అతను లేని టెస్టుల్లో భారత్ గెలిచిందంటూ ప్రచారం చేస్తున్నారు. కానీ నా అభిప్రాయ ప్రకారం అది యాదృచ్ఛికం మాత్రమే. బుమ్రా ఒక అసాధారణ బౌలర్. ఇప్పటికే ఎన్నో అద్భుతాలు చేశాడు. చాలా కాలంగా నిలకడగా రాణించాడు.
నా దృష్టిలో నిస్సందేహంగా అందరికంటే అతను అగ్ర స్థానంలో ఉంటాడు’ అని సచిన్ కితాబిచ్చాడు. మాంచెస్టర్ టెస్టులో స్టోక్స్ ‘షేక్ హ్యాండ్’కు నిరాకరించి జడేజా, సుందర్ ఆటను కొనసాగించడంలో ఎలాంటి తప్పూ లేదని టెండూల్కర్ అభిప్రాయపడ్డాడు. ‘డ్రా’కు అంగీకరించాలని ఇంగ్లండ్ కోరడంలో అర్థం లేదన్న సచిన్... భారత బ్యాటర్లు స్పందించిన తీరుతో తాను వంద శాతం ఏకీభవిస్తున్నానని అన్నాడు.