ఈజిప్ట్‌ ఓన్‌ గోల్‌.. బెల్జియంను కాపాడిన లుకాకు | Romelu Lukaku changes the game for Belgium but Egypt refuse to crack in 1 1 draw | Sakshi
Sakshi News home page

ఈజిప్ట్‌ ఓన్‌ గోల్‌.. బెల్జియంను కాపాడిన లుకాకు

Jun 16 2026 4:30 AM | Updated on Jun 16 2026 4:30 AM

Romelu Lukaku changes the game for Belgium but Egypt refuse to crack in 1 1 draw

ఫిఫా ప్రపంచకప్‌-2026లో భాగంగా ఈజిప్ట్‌తో ఇవాళ (జూన్‌ 16) జరిగిన గ్రూప్‌-జి మ్యాచ్‌లో టైటిల్‌ ఫేవరెట్లలో ఒకటిగా భావిస్తున్న బెల్జియంకు తృటిలో పరాభవం తప్పింది. సియాటెల్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో ఈజిప్ట్‌ అద్భుత పోరాటాన్ని ప్రదర్శించి 1-1తో డ్రా చేసుకుంది. ఓటమి అంచుల వరకూ వెళ్లిన బెల్జియంను ఆ జట్టు స్టార్‌ స్ట్రైకర్‌ రొమేలు లుకాకు కాపాడాడు.

మ్యాచ్‌ ఆరంభం నుంచే ఈజిప్ట్‌ ఆధిపత్యం ప్రదర్శించింది. కోచ్‌ హొస్సమ్‌ హసన్‌ వ్యూహాలు ఫలించడంతో బెల్జియం స్టార్‌ ఆటగాళ్లు చాలా ఇబ్బంది పడ్డారు. ముఖ్యంగా మొహమ్మద్‌ సలాహ్‌ను మధ్యభాగంలో ఆడించాలన్న నిర్ణయం విజయవంతమైంది.

19వ నిమిషంలో సలాహ్‌ అందించిన అద్భుత పాస్‌ను అందుకున్న ఇమామ్‌ అషోర్‌ బాక్స్‌ వెలుపలి నుంచి శక్తివంతమైన షాట్‌తో గోల్‌ సాధించి ఈజిప్ట్‌కు 1-0 ఆధిక్యం అందించాడు. అంతర్జాతీయ కెరీర్‌లో అతనికి ఇదే తొలి గోల్‌ కావడం విశేషం.

మొదటి అర్ధభాగంలో బెల్జియం వద్ద బంతి ఎక్కువసేపు ఉన్నప్పటికీ ఒక్క షాట్‌ను కూడా లక్ష్యంపైకి పంపలేకపోయారు. స్టార్‌ ఆటగాడు కెవిన్‌ డి బ్రూనే పెద్దగా ప్రభవం చూపలేకపోయాడు.

రెండో అర్ధభాగంలో ఈజిప్ట్‌ మరింత ప్రమాదకరంగా కనిపించింది. ముస్తఫా జికో, సలాహ్‌ చేసిన ప్రయత్నాలను బెల్జియం గోల్‌కీపర్‌ థిబాత్‌ కర్టోయిస్‌  అద్భుతంగా తిప్పికొట్టడంతో స్కోరు మారలేదు.

అయితే 66వ నిమిషంలో లుకాకును బరిలోకి దింపిన వెంటనే మ్యాచ్‌ స్వరూపం ఒక్కసారిగా మారిపోయింది. కేవలం 28 సెకన్లలోనే అతని ఒత్తిడికి లోనైన ఈజిప్ట్‌ డిఫెండర్‌ మొహమ్మద్‌ హనీ పొరపాటున ఓన్‌ గోల్‌ చేయడంతో బెల్జియం స్కోర్‌ను సమం చేసుకుంది.

ఆ తర్వాత విజయం కోసం గట్టిగా ప్రయత్నించినా ఈజిప్ట్‌ రక్షణ గోడను ఛేదించలేకపోయింది. చివరకు మ్యాచ్‌ 1-1తో డ్రాగా ముగిసింది. జూన్‌ 21న జరిగే తమ తదుపరి మ్యాచ్‌ల్లో ఈజిప్ట్‌ న్యూజిలాండ్‌తో, బెల్జియం ఇరాన్‌తో తలపడనుంది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement