రోహిత్‌ శర్మకు గుడ్‌బై? | Rohit Sharma ODI Career Ends As Gambhir Agarkar Take Tough Call: Report | Sakshi
Sakshi News home page

రోహిత్‌ శర్మకు గుడ్‌బై?.. అగార్కర్‌, గంభీర్‌ కఠిన నిర్ణయం?!

Jun 25 2026 4:20 PM | Updated on Jun 25 2026 5:15 PM

Rohit Sharma ODI Career Ends As Gambhir Agarkar Take Tough Call: Report

టీమిండియా దిగ్గజ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ కెరీర్‌ చరమాంకానికి చేరుకుందా?... వన్డే వరల్డ్‌కప్‌-2027 టోర్నీకి ముందే అతడిని తప్పించాలని యాజమాన్యం భావిస్తోందా? అంటే జాతీయ మీడియా వర్గాల నుంచి అవుననే సమాధానమే వినిపిస్తోంది.

కాగా 2007లో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన రోహిత్‌ శర్మ.. ధోని సారథ్యంలో ఓపెనర్‌గా ప్రమోట్‌ అయ్యి జట్టులో పాతుకుపోయాడు. అంచెలంచెలుగా ఎదిగి కెప్టెన్‌గా పగ్గాలు చేపట్టిన రోహిత్‌ 2024లో భారత్‌కు టీ20 ప్రపంచకప్‌ అందించాడు.

ఆ వెంటనే అంతర్జాతీయ టీ20 ఫార్మాట్‌కు వీడ్కోలు పలికిన రోహిత్‌ శర్మ.. గతేడాది టెస్టులకూ రిటైర్మెంట్‌ ఇచ్చాడు. ప్రస్తుతం కేవలం వన్డేల్లోనే కొనసాగుతున్నాడు. ఇక 2025లో కెప్టెన్‌ హోదాలో ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీ గెలిచినప్పటికీ.. భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (BCCI) అతడిని సారథ్య బాధ్యతల నుంచి తప్పించింది.

ఇంగ్లండ్‌తో సిరీస్‌ ఆఖరిది?
కాగా వన్డే వరల్డ్‌కప్‌-2027లో ఆడాలనే కలతో రోహిత్‌ శర్మ ముందుకు సాగుతుండగా.. సెలక్టర్లు మాత్రం అతడిని కొనసాగించేందుకు సిద్ధంగా లేనట్లు సమాచారం. స్పోర్ట్స్‌ టాక్‌ చర్చలో భాగంగా రోహిత్‌ అంశం తెరమీదకు రాగా.. ఇంగ్లండ్‌తో సిరీస్‌ హిట్‌మ్యాన్‌ కెరీర్‌లో ఆఖరిదంటూ అక్కడున్న వారు బాంబు పేల్చారు.

ఇటీవల స్వదేశంలో అఫ్గానిస్తాన్‌తో వన్డే సిరీస్‌కు ముందు రోహిత్‌ గాయపడ్డ సంగతి తెలిసిందే. అయినప్పటికీ కష్టపడి ఫిట్‌నెస్‌ సాధించి మూడు మ్యాచ్‌లలోనూ భాగమయ్యాడు. అయితే, తొలి వన్డేలో 16 పరుగులకే నిష్క్రమించిన రోహిత్‌.. రెండో వన్డేలో 48 పరుగులతో ఫర్వాలేదనిపించాడు. మూడో వన్డేలో 78 పరుగులతో సత్తా చాటాడు.

అఫ్గానిస్తాన్‌తో సిరీస్‌కు ముందే
నిజానికి అఫ్గానిస్తాన్‌తో సిరీస్‌కు ముందే సెలక్టర్లు రోహిత్‌ శర్మ  వన్డే కెరీర్‌ గురించి అతడికి స్పష్టతనిచ్చినట్లు సమాచారం. ఇదే ఆఖరి సిరీస్‌ అని రోహిత్‌కు చెప్పినట్లు తెలుస్తోంది. అంతేకాదు.. తుదిజట్టు నుంచి అతడిని పక్కనపెట్టాలనే యోచన చేసినట్లు తెలుస్తోంది.

అయితే, ఆ ఆలోచన మార్చుకున్న యాజమాన్యం.. ఇంగ్లండ్‌ సిరీస్‌ రూపంలో హిట్‌మ్యాన్‌కు మరో అవకాశం ఇవ్వాలని భావించినట్లు తెలుస్తోంది. ఒకవేళ ఇంగ్లండ్‌ గడ్డ మీద విఫలమైతే.. అదే అతడి కెరీర్‌లో ఆఖరి సిరీస్‌ అవుతుందని సెలక్టర్లు స్పష్టం చేసినట్లు సమాచారం.

కాగా అఫ్గాన్‌తో వన్డే సిరీస్‌కు విరాట్‌ కోహ్లి దూరం కాగా.. అతడి స్థానంలో యశస్వి జైస్వాల్‌కు అవకాశం వచ్చింది. రోహిత్‌ శర్మతో కలిసి రెండు, మూడో వన్డేలో ఓపెనింగ్‌ చేసిన జైసూ 4, 110 పరుగులు సాధించాడు. ఈ నేపథ్యంలో వన్డేల్లో రోహిత్‌ శర్మ వారసుడిగా జైసూను పూర్తిస్థాయి ఓపెనర్‌గా బరిలోకి దించాలని యాజమాన్యం యోచిస్తున్నట్లు తెలుస్తోంది.

నిజమేనా?
కానీ ఇంగ్లండ్‌తో సిరీస్‌కు రోహిత్‌ శర్మనే ఎంపిక చేయడం చూస్తుంటే మాత్రం ఈ ఊహాగానాలు నిజం కాదనిపిస్తోందని విశ్లేషకులు అంటున్నారు. వరల్డ్‌కప్‌నకు ముందు మరికొన్ని వన్డేలు మాత్రమే మిగిలి ఉన్నందున జైస్వాల్‌ను తీసుకొచ్చి రిస్క్‌ చేస్తుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

కాగా అఫ్గానిస్తాన్‌తో సిరీస్‌లో రోహిత్‌- జైస్వాల్‌ ఓపెనర్లుగా రాగా.. కెప్టెన్‌ శుబ్‌మన్‌ గిల్‌ వన్‌డౌన్‌లో ఆడాడు. దీనిని బట్టి రోహిత్‌ను ఇంకొంతకాలం కొనసాగిస్తారనే చర్చా నడుస్తోంది.

అగార్కర్‌, గంభీర్‌ కఠిన నిర్ణయం
ఏదేమైనా చీఫ్‌ సెలక్టర్‌ అజిత్‌ అగార్కర్‌, హెడ్‌కోచ్‌ గౌతం గంభీర్‌ మాత్రం రోహిత్‌ను పక్కనపెట్టాలని గట్టిగా ఫిక్సయినట్లు బీసీసీఐ సన్నిహిత వర్గాలు పేర్కొంటున్నాయి. వరల్డ్‌కప్‌ నాటికి రోహిత్‌కు 40 ఏళ్లు వస్తాయి. ఈ క్రమంలోనే ఫిట్‌నెస్‌ దృష్ట్యా ఈ వెటరన్‌ ప్లేయర్‌ను పక్కనపెట్టాలని యాజమాన్యం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. 

కాగా రోహిత్‌ శర్మ ఇప్పటి వరకు 285 వన్డేలు ఆడి 11720 పరుగులు సాధించాడు. అంతేకాదు వన్డేల్లో ఓవరాల్‌గా మూడు డబుల్‌ సెంచరీలు బాదిన ఏకైక క్రికెటర్‌గా హిట్‌మ్యాన్‌ కొనసాగుతున్నాడు. ఇలాంటి దిగ్గజ ఆటగాడికి యాజమాన్యం ఎటువంటి వీడ్కోలు ఇస్తుందో చూడాలి మరి!!

చదవండి: కన్నీటి పర్యంతమైన నెయ్‌మార్‌!

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement