బ్రెజిల్ సూపర్ స్టార్, దిగ్గజ ఫుట్‌బాలర్ నెయ్‌మార్ జూనియర్ కన్నీంటి పర్యంతమయ్యాడు. దాదాపుగా మూడేళ్ల విరామం తర్వాత జాతీయ జట్టు తరఫున పునరాగమనం చేసిన క్రమంలో.. తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. అతడిని అలా చూసి అభిమానులు సైతం ఎమోషనల్ అయ్యారు.
తీవ్ర గాయం
కాగా 2023లో ఉరుగ్వేతో మ్యాచ్ సందర్భంగా నెయ్‌మార్ తీవ్రంగా గాయపడ్డాడు. మోకాలి గాయం కారణంగా సర్జరీ చేయించుకోవాల్సి వచ్చింది. ఈ క్రమంలో చాన్నాళ్ల పాటు ఆటకు దూరమైన నెయ్‌మార్.. ఆ తర్వాత కొన్ని క్లబ్ మ్యాచ్‌లు ఆడాడు. కానీ జాతీయ జట్టులోకి మాత్రం రాలేకపోయాడు.
ఈ క్రమంలో ఫిఫా ప్రపంచకప్-2026 ఆరంభానికి ముందు నెయ్‌మార్ పూర్తి ఫిట్‌నెస్ సాధించడంతో బ్రెజిల్ జట్టు సంతోషంలో మునిగిపోయింది. అయితే, టోర్నీ ఆరంభానికి ముందు అతడిని మరోసారి ఫిట్‌నెస్ సమస్యలు వేధించాయి. దీంతో ఆరంభ మ్యాచ్‌లకు దూరమయ్యాడు.
భావోద్వేగాలు నియంత్రించుకోలేక కన్నీళ్లు
ఈ నేపథ్యంలో మియామి వేదికగా గ్రూప్- ‘సి’లో భాగంగా స్కాట్లాండ్‌తో మ్యాచ్ సందర్భంగా నెయ్‌మార్ బ్రెజిల్ తరఫున రీఎంట్రీ ఇచ్చాడు. దాదాపుగా 981 రోజుల తర్వాత జాతీయ జట్టు తరఫున మైదానంలో అడుగుపెట్టిన అతడు.. భావోద్వేగాలను నియంత్రించుకోలేక కన్నీళ్లు పెట్టుకున్నాడు.
టాపర్‌గా నాకౌట్‌కు
కాగా స్కాట్లాండ్‌తో మ్యాచ్‌లో 76వ నిమిషంలో నెయ్‌మార్ సబ్‌స్టిట్యూట్ (ఇంపాక్ట్) ప్లేయర్‌గా వచ్చాడు. అప్పటికే బ్రెజిల్ 3-0తో ఆధిక్యంలో ఉంది. అయితే, నెయ్‌మార్ రాకతో ఒక్కసారిగా అభిమానులు కేకలు పెట్టారు. అతడిని ఆహ్వానిస్తూ సంబరాలు చేసుకున్నారు. కాగా 34 ఏళ్ల నెయ్‌మార్ కెరీర్‌లో ఇది నాలుగో ఫిఫా వరల్డ్‌కప్.
ఈ మ్యాచ్‌లో బ్రెజిల్ స్కాట్లాండ్‌పై 3-0 తేడాతో ఘన విజయం సాధించింది. బ్రెజిల్ తరఫున వినిసియస్ జూనియర్ రెండు గోల్స్ చేయగా.. మాథ్యూస్ కున్హా ఒక గోల్ కొట్టాడు. ఈ విజయంతో గ్రూప్-సి టాపర్‌గా బ్రెజిల్ నాకౌట్ దశకు అర్హత సాధించింది. ఇక ఈ గ్రూపు నుంచి మొరాకో కూడా నాకౌట్‌కు చేరగా.. హైతీ ఎలిమినేట్ అయింది. స్కాట్లాండ్‌కు మరో అవకాశం ఉంది.


