
వెస్టిండీస్ జట్టు తీరమారలేదు. ఇటీవల ఆస్ట్రేలియా, పాకిస్తాన్‌లకు వరుస టీ20 సిరీస్‌లు కోల్పోయిన కరేబియన్లు.. తాజాగా పాక్‌తో వన్డే సిరీస్‌ను కూడా ఓటమితోనే ఆరంభించారు. ట్రినిడాడ్ వేదికగా జరిగిన తొలి వన్డేలో విండీస్ పాక్ చేతిలో ఐదు వికెట్ల తేడాతో ఓటమిపాలైంది.
మూడు హాఫ్ సెంచరీలు
బ్రియన్ లారా స్టేడియంలో శుక్రవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచిన పర్యాటక పాకిస్తాన్ తొలుత బౌలింగ్ చేసింది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్ ఆదిలోనే ఓపెనర్ బ్రాండన్ కింగ్ (4) వికెట్ కోల్పోయింది. అయితే, మరో ఓపెనర్ ఎవిన్ లూయీస్ అర్ధ శతకం (Evin Lewis- 60)తో రాణించగా.. వన్‌డౌన్ బ్యాటర్ కేసీ కార్టీ (30) కూడా ఫర్వాలేదనిపించాడు.
ఇక కెప్టెన్ షాయీ హోప్ (55), రోస్టన్ ఛేజ్ (53) కూడా హాఫ్ సెంచరీలు సాధించగా.. ఆల్‌రౌండర్ గుడకేశ్ మోటి (18 బంతుల్లో 31) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. మిగతా వారిలో షెర్ఫానే రూథర్‌ఫర్డ్ (10), రొమారియో షెఫర్డ్ (4) పూర్తిగా విఫలమయ్యారు.
షాహిన్ ఆఫ్రిదికి నాలుగు వికెట్లు
ఈ నేపథ్యంలో 49 ఓవర్లలో 280 పరుగులు చేసి వెస్టిండీస్ ఆలౌట్ అయింది. పాకిస్తాన్ బౌలర్లలో షాహిన్ ఆఫ్రిది నాలుగు వికెట్లతో చెలరేగగా.. నసీం షా మూడు, సయీమ్ ఆయుబ్, సూఫియాన్ ముకీమ్, సల్మాన్ ఆఘా ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.
ఇక నామమాత్రపు లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బలు తగిలాయి. టాపార్డర్‌లో ఓపెనర్లు సయీబ్ ఆయుబ్ (5), అబ్దుల్లా షఫీక్ (29) విఫలం కాగా.. బాబర్ ఆజం అర్ధ శతకానికి (47) మూడు పరుగుల దూరంలో నిలిచిపోయాడు.
రిజ్వాన్ హాఫ్ సెంచరీ.. నవాజ్ మెరుపు ఇన్నింగ్స్
మరోవైపు.. సల్మాన్ ఆఘా (23) కూడా స్వల్ప స్కోరుకే పరిమితం కాగా.. మహ్మద్ రిజ్వాన్ మాత్రం కెప్టెన్ ఇన్నింగ్స్ (53)తో అలరించాడు. ఆఖర్లో హసన్ నవాజ్ (54 బంతుల్లో 63), హుసేన్ తలాత్ (37 బంతుల్లో 41) వేగంగా ఆడి పాకిస్తాన్‌ను విజయతీరాలకు చేర్చారు. వీరిద్దరి అద్భుత ఇన్నింగ్స్ కారణంగా 48.5 ఓవర్లలోనే 284 పరుగులు సాధించిన పాకిస్తాన్.. ఐదు వికెట్ల తేడాతో గెలుపొందింది.
తద్వారా మూడు మ్యాచ్‌ల వన్డేల సిరీస్‌లో 1-0తో ముందంజ వేసింది. హసన్ నవాజ్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఇక విండీస్ బౌలర్లలో షమార్ జోసెఫ్ రెండు వికెట్లు తీయగా.. జేడన్ సీల్స్, గుడకేశ్ మోటి, రోస్టన్ ఛేజ్ ఒక్కో వికెట్ పడగొట్టారు. విండీస్- పాకిస్తాన్ మధ్య ఆదివారం జరిగే రెండో వన్డేకు బ్రియన్ లారా స్టేడియమే వేదిక.
చదవండి: AUS vs ENG: అతడికి ఇక నిద్రలేని రాత్రులే!.. వార్నర్ ఓ జోకర్!