
టీమిండియా క్రికెటర్ రిషభ్ పంత్ (Rishabh Pant) తన గాయంపై అప్‌డేట్ అందించాడు. ప్రస్తుతం తాను కోలుకుంటున్నానని.. తిరిగి మైదానంలో అడుగుపెట్టేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని పేర్కొన్నాడు. ఈ సందర్భంగా.. తన కాలి గాయం తాలూకు ఫొటోలు షేర్ చేసిన పంత్.. కష్టకాలంలో తనకు మద్దతుగా నిలిచిన అభిమానులకు కృతజ్ఞతలు తెలిపాడు.
2022లో జరిగిన కారు ప్రమాదంలో అదృష్టవశాత్తూ.. ప్రాణాపాయం నుంచి బయటపడిన పంత్ దాదాపు ఏడాది పాటు ఆటకు దూరమయ్యాడు. గతేడాది ఐపీఎల్‌తో రీఎంట్రీ ఇచ్చిన ఈ వికెట్ కీపర్ బ్యాటర్.. టీమిండియా తరఫున పునరాగమనంలోనూ అదరగొడుతున్నాడు.
479 పరుగులు
తాజాగా ఇంగ్లండ్‌తో టెండుల్కర్- ఆండర్సన్ ట్రోఫీ (Tendulkar- Anderson Trophy) టెస్టు సిరీస్‌లోనూ పంత్ సత్తా చాటాడు. నాలుగు టెస్టుల్లో కలిపి 479 పరుగులు సాధించాడు. లీడ్స్‌లో జరిగిన తొలి టెస్టులో రెండు ఇన్నింగ్స్‌లోనూ శతకాలు (134, 118)బాదిన ఈ ఎడమచేతి వాటం బ్యాటర్.. ఎడ్జ్‌బాస్టన్ టెస్టులో రెండో ఇన్నింగ్స్‌లో అర్ధ శతకం (65)తో సత్తా చాటాడు.
బొటనవేలు ఫ్రాక్చర్
ఇక లార్డ్స్ మైదానంలోనూ హాఫ్ సెంచరీ(74) బాదిన పంత్.. మాంచెస్టర్ టెస్టు సందర్భంగా గాయపడినప్పటికీ వీరోచిత అర్ధ శతకం (54)తో మెరిశాడు. క్రిస్ వోక్స్ బౌలింగ్‌లో రివర్స్ స్వీప్ షాట్ ఆడబోయిన పంత్.. కుడికాలి బొటనవేలికి బంతి బలంగా తాకింది. దీంతో కాలు ఉబ్బిపోవడంతో పాటు.. బొటనవేలు ఫ్రాక్చర్ అయింది.
ఈ క్రమంలో 37 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగిన పంత్.. జట్టు అవసరాల దృష్ట్యా తిరిగి బ్యాటింగ్ దిగాడు. మరో 17 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. పంత్ పోరాట పటిమ కారణంగానే తొలి ఇన్నింగ్స్‌లో 358 పరుగులు చేయగలిగింది టీమిండియా.
అనంతరం ఇంగ్లండ్ మొదటి ఇన్నింగ్స్‌లో 669 పరుగులు చేసి సవాలు విసరగా.. భారత్ ఐదో రోజు ఆఖరి సెషన్ వరకు అద్భుతంగా పోరాడి.. మ్యాచ్‌ను డ్రా చేసుకుంది. ఇక వేలి నొప్పి కారణంగా పంత్ ఐదో టెస్టుకు దూరమయ్యాడు. అతడి స్థానంలో నారాయణన్ జగదీశన్‌కు బీసీసీఐ పిలుపునిచ్చింది.
ఉత్తమమైన, గర్వకారణమైన క్షణం అదే
ఇదిలా ఉంటే.. తన గాయం గురించి స్పందిస్తూ.. ‘‘నేను త్వరగా కోలుకోవాలంటూ నా శ్రేయోలాభిలాషుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. నిజానికి నేను దృఢంగా ఉండటానికి మీ ప్రేమాభిమానాలే కారణం.
గాయం పూర్తిగా నయమైన తర్వాత నేను రిహాబిలిటేషన్ మొదలుపెడతాను. తిరిగి మైదానంలో అడుగుపెట్టే ప్రక్రియ ప్రారంభిస్తాను. ఓపికగా ఎదురుచూస్తూ.. నా అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చేందుకు సిద్ధమవుతాను.
దేశం కోసం ఆడటమే నా జీవితంలోని అత్యంత ఉత్తమమైన, గర్వకారణమైన క్షణం. త్వరలోనే మళ్లీ మైదానంలో దిగాలని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా’’ అని పంత్ సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నాడు. ఈ మేరకు అతడు చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది.
కాగా టెండుల్కర్- ఆండర్సన్ ట్రోఫీలో గిల్ సేన 1-2తో వెనుకబడి ఉంది. లండన్‌లోని ఓవల్ మైదానంలో చివరిదైన ఐదో టెస్టు గెలిస్తేనే టీమిండియా 2-2తో సిరీస్ సమం చేయగలుగుతుంది.
చదవండి: IND vs ENG: ‘రెండు కుక్కలు తెచ్చి.. ఆ పేర్లు పెడతాడు’
🙌#RP17 pic.twitter.com/LlAZ7lJKDm
— Rishabh Pant (@RishabhPant17) July 28, 2025