
టీమిండియా క్రికెటర్లు వాషింగ్టన్ సుందర్ (Washington Sundar), రవీంద్ర జడేజాలపై భారత మాజీ ఆటగాడు ఆశిష్ నెహ్రా ప్రశంసలు కురిపించాడు. లార్డ్స్ (Lord's Test), మాంచెస్టర్ టెస్టుల్లో ఈ ఇద్దరు స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్లు అద్భుతంగా ఆడారని కొనియాడాడు. నాలుగో టెస్టులో సెంచరీ పూర్తి చేసుకునేందుకు వీరిద్దరు అర్హులని.. వారి స్థానంలో ఇంగ్లండ్ బ్యాటర్లు ఉన్నా అదే పని చేసేవారన్నాడు.
ఊహించని రీతిలో పుంజుకుని
భారత్- ఇంగ్లండ్ (Ind vs Eng) మధ్య మాంచెస్టర్ వేదికగా బుధవారం నుంచి ఆదివారం వరకు నాలుగో టెస్టు జరిగింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 358 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ ఏకంగా 669 పరుగులు చేసి.. తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌పై 311 పరుగుల ఆధిక్యంలో నిలిచింది.
గిల్‌తో పాటు జడ్డూ, వాషీ శతకాలు
ఇలాంటి తరుణంలో నాలుగో రోజు బ్యాటింగ్ మొదలుపెట్టిన టీమిండియా సున్నా పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. అయితే, ఓపెనర్ కేఎల్ రాహుల్ (90), కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (103) ఇన్నింగ్స్ చక్కదిద్దగా.. జడ్డూ (107), వాషీ (101) ఆఖరి రోజు ఆఖరి సెషన్ వరకూ పట్టుదలగా నిలబడి అజేయ శతకాలతో మ్యాచ్ డ్రా అయ్యేలా చూశారు.
రెండు కుక్కలు తెచ్చి.. ఆ పేర్లు పెడతాడు
ఈ నేపథ్యంలో వాషీ, జడ్డూలపై ప్రశంసల వర్షం కురిపించిన ఆశిష్ నెహ్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘వాషింగ్టన్ సుందర్ గబ్బా మైదానంలో టీమిండియా టెస్టు గెలిచిన తర్వాత తన పెంపుడు కుక్కకు గబ్బాగా నామకరణం చేశాడు.
ఇక ఇప్పుడు.. అతడు మరో రెండు కుక్కలను కొని... వాటికి లార్డ్స్, మాంచెస్టర్ అనే పేర్లు పెడితే బాగుంటుంది. ఇక రవీంద్ర జడేజా రెండు గుర్రాలు తెచ్చి వాటికి ఈ పేర్లు పెట్టుకోవాలి. ఎందుకంటే.. అతడికి డాగ్స్‌తో వర్కౌట్ కాదు మరి’’ అంటూ సరదాగా వ్యాఖ్యానించాడు. కాగా జడేజాకు గుర్రపు స్వారీ అంటే ఇష్టమన్న విషయం తెలిసిందే.
ఇదిలా ఉంటే.. లార్డ్స్‌లో వాషీ నాలుగు వికెట్లతో సత్తా చాటగా.. జడ్డూ 61 పరుగులతో అజేయంగా నిలిచి.. జట్టును భారీ ఓటమి నుంచి తప్పించాడు. అయితే, మిగతా వారి నుంచి సహకారం లేకపోవడంతో ఆఖరికి 22 పరుగుల తేడాతో ఇంగ్లండ్ చేతిలో టీమిండియా పరాజయం పాలైంది.
చావోరేవో
ఇక ఇంగ్లండ్- భారత్ మధ్య ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా ఇప్పటికి నాలుగు టెస్టులు పూర్తి కాగా... రెండింట స్టోక్స్ బృందం.. ఒక మ్యాచ్‌లో గిల్ సేన గెలిచాయి. నాలుగో టెస్టు డ్రా కావడంతో 2-1తో ఇంగ్లండ్ ఆధిక్యంలోనే కొనసాగుతోంది.
ఇరుజట్ల మధ్య జూలై 31- ఆగష్టు 4 వరకు లండన్‌లోని ఓవల్ మైదానం వేదికగా ఐదో టెస్టు నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తేనే టీమిండియా ఈ సిరీస్‌ను 2-2తో సమం చేసి డ్రా చేసుకోగలుగుతుంది.
చదవండి: మీ వాళ్లైతే ఇలాగే చేస్తావా?.. స్టోక్స్‌పై మండిపడ్డ గంభీర్