
ఇంగ్లండ్ క్రికెట్ జట్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ (Ben Stokes) తీరుపై టీమిండియా హెడ్‌కోచ్ గౌతం గంభీర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. భారత ఆల్‌రౌండర్లు రవీంద్ర జడేజా (Ravindra Jadeja), వాషింగ్టన్ సుందర్ సెంచరీ చేయకుండా అడ్డుకునేందుకు ఇంగ్లండ్ జట్టు ప్రవర్తించిన తీరును తప్పుబట్టాడు. టీమిండియా ఆటగాళ్ల స్థానంలో తమ ప్లేయర్లు ఉంటే కూడా స్టోక్స్ ఇలాగే చేసేవాడా అని ప్రశ్నించాడు. అసలేం విషయం ఏమిటంటే..
ఆపేద్దాం.. లేదు ఆడేద్దాం
భారత్- ఇంగ్లండ్ మధ్య నాలుగో టెస్టు (Ind vs Eng 4th Test)లో ఆఖరిదైన ఐదో రోజు ఆటలో ఆఖరి గంటలో... ఆపేద్దామంటే, ఆడేద్దామనే హైడ్రామా చోటు చేసుకుంది. చివరి సెషన్‌లో ఇక గంట ఆటే మిగిలుంది. 15 ఓవర్లు పడాల్సి ఉంది. ఫలితం తేలని సందర్భాల్లో ఆ కనీస ఓవర్లకు ముందే ఇరు జట్ల కెప్టెన్లు పరస్పర సమ్మతితో ‘డ్రా’ పాట పాడే ఆనవాయితీ ఎప్పటి నుంచో ఉంది. దీనికోసం ప్రయత్నించి ఇంగ్లండ్ కెప్టెన్ స్టోక్స్ భంగపడ్డాడు.
స్టోక్స్‌కు మింగుడుపడని విధంగా అసలేం జరిగిందంటే... 138 ఓవర్లలో భారత్ స్కోరు 386/4. 75 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఇక మిగిలిపోయిన ఆ 15 ఓవర్లతో ఆలౌట్ చేయడం, తర్వాత లక్ష్యాన్ని ఛేదించడం, ఇంగ్లండ్ గెలవడం జరిగేది కాదని అర్థమైంది. దీంతో అలసిన సహచరులకు కాస్త ముందుగానే విశ్రాంతినిద్దామనే ఆలోచనతో స్టోక్స్ డ్రా కోసం ‘ఇక చాలు ఆపేద్దాం’ అన్నాడు.
శతకాలు పూర్తి చేసుకున్న తర్వాత
కానీ అవతలి వైపు జడేజా (89 బ్యాటింగ్), సుందర్ (80 బ్యాటింగ్) సెంచరీలకు దగ్గరవడంతో భారత దళం ‘కుదరదు... ఆడేద్దాం’ అంది. స్టోక్స్ ప్రతిపాదనను జడేజా తోసిపుచ్చాడు. క్రీజులో ఉన్న ఇద్దరం శతకరేసులో ఉన్నామన్నాడు.
దీంతో చేసేదేమీలేక చిన్నబుచ్చుకున్న స్టోక్స్ సులువైన బౌలింగ్‌నే పురమాయించాడు. ఫోరు, సిక్స్‌తో జడేజా... తర్వాత బౌండరీలతో సుందర్ చకచకా సెంచరీలను పూర్తి చేసుకున్నారు. ఈ ఆఖరి దూకుడుతో 5 ఓవర్ల వ్యవధిలో భారత్ 39 పరుగులు చేసింది. 400 స్కోరునూ దాటింది.
మీ వాళ్లైతే ఇలాగే చేస్తావా?
అయితే, ముందు జడ్డూ, వాషీల శతకాలకు అడ్డుపడేలా.. పదే పదే షేక్‌హ్యాండ్ ఇస్తూ స్టోక్స్ వ్యవహరించిన తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ విషయంపై టీమిండియా హెడ్‌కోచ్ గౌతం గంభీర్ కూడా స్పందించాడు. ‘‘ఒకరేమో 90, మరొకరేమో 85 పరుగుల వద్ద ఉన్నప్పుడు... సెంచరీ పూర్తి చేసుకునేందుకు వారు అర్హులా? కాదా?
ఒకవేళ వారి ఆటగాళ్లు కూడా ఇలా మైలురాయికి చేరువైన వేళ ఇలాగే డ్రా ప్రతిపాదన తెచ్చేవారా? మా వాళ్లు పట్టుదలగా పోరాడారు. వాళ్ల కష్టానికి ప్రతిఫలమే ఆ శతకాలు. ఎవరినో సంతోష పెట్టడానికి మేము ఇక్కడ లేము’’ అంటూ స్టోక్స్ తీరుపై గంభీర్ మండిపడ్డాడు.
ఆఖరి టెస్టు గెలిస్తేనే
కాగా ఆండర్సన్- టెండుల్కర్ ట్రోఫీలో భాగంగా ఐదు టెస్టులు ఆడేందుకు టీమిండియా ఇంగ్లండ్‌లో పర్యటిస్తోంది. ఈ క్రమంలో లీడ్స్‌లో తొలి టెస్టులో ఆతిథ్య జట్టు గెలవగా.. ఎడ్జ్‌బాస్టన్‌లో భారత్ జయభేరి మోగించింది.
అయితే, లార్డ్స్‌లో జరిగిన మూడో టెస్టులో ఇంగ్లండ్ గెలవగా.. తాజాగా మాంచెస్టర్‌లో ముగిసిన నాలుగో టెస్టులో ఫలితం తేలలేదు. ప్రస్తుతం ఇంగ్లండ్ 2-1తో ఆధిక్యంలో ఉండగా.. ఓవల్ మైదానంలో ఆఖరిదైన ఐదో టెస్టు గెలిస్తేనే టీమిండియా సిరీస్‌ను కనీసం డ్రా చేసుకోగలుగుతుంది.
భారత్ వర్సెస్ ఇంగ్లండ్ నాలుగో టెస్టు సంక్షిప్త స్కోర్లు
👉భారత్: 358 & 425/4
👉ఇంగ్లండ్: 669.
చదవండి: IND vs ENG: చరిత్ర సృష్టించిన టీమిండియా.. ప్రపంచంలోనే తొలి జట్టుగా
A day defined by three centurions as #ShubmanGill, #RavindraJadeja & #WashingtonSundar led #TeamIndia’s defiance & secured a draw! 🙌🏻
Which moments did you enjoy the most? ✍🏻👇#ENGvIND 👉 5th TEST | Starts THU, 31st July, 2:30 PM | Streaming on JioHotstar! pic.twitter.com/5uLQZD24Cq— Star Sports (@StarSportsIndia) July 27, 2025