
టీమిండియాతో నాలుగో టెస్టులో ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ (Ben Stokes) శతక్కొట్టాడు. మాంచెస్టర్ వేదికగా శనివారం నాటి నాలుగో రోజు ఆటలో వంద పరుగుల మార్కును అందుకున్నాడు. ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన 34 ఏళ్ల ఈ బ్యాటింగ్ ఆల్‌రౌండర్.. 164 బంతుల్లో 103 పరుగులు సాధించాడు. కాగా స్టోక్స్‌కు ఇది టెస్టుల్లో పద్నాలుగవ సెంచరీ కాగా.. టీమిండియాపై రెండోది.
ఇంగ్లండ్- భారత్ జట్ల మధ్య ఆండర్సన్- టెండుల్కర్ ట్రోఫీ (Anderson- Tendulkar Trophy)లో భాగంగా ఐదు టెస్టుల సిరీస్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో మొదటి మూడు టెస్టుల్లో రెండు గెలిచిన ఆతిథ్య ఇంగ్లండ్ 2-1తో ఆధిక్యంలో ఉంది.
ఐదు వికెట్లతో చెలరేగిన గిల్
ఇరుజట్ల మధ్య బుధవారం నాలుగో టెస్టు మొదలుకాగా.. టాస్ గెలిచిన ఇంగ్లండ్ భారత్‌ను తొలుత బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఈ క్రమంలో టీమిండియా 358 పరుగులకు తొలి ఇన్నింగ్స్‌లో ఆలౌట్ అయింది. స్టోక్స్ ఐదు వికెట్లతో చెలరేగి.. గిల్ సేనను దెబ్బకొట్టాడు. తద్వారా ఎనిమిదేళ్ల తర్వాత తొలిసారి ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు.
మూడేళ్లలో తొలిసారి!
అంతేకాదు.. అదే మ్యాచ్‌లో సెంచరీ కూడా కొట్టి స్టోక్స్ మాంచెస్టర్ టెస్టును మరింత ప్రత్యేకం చేసుకున్నాడు. కాగా గత మూడేళ్లలో టెస్టుల్లో స్టోక్స్‌కు ఇదే మొదటి సెంచరీ కావడం గమనార్హం. నవతరం టాప్ ఆల్‌రౌండర్లలో ఒకడైన స్టోక్స్ ఈ టెస్టు ద్వారా తనను తాను మరోసారి నిరూపించుకున్నాడు.
ఇదిలా ఉంటే.. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ దుమ్మురేపుతోంది. ఓపెనర్లు జాక్ క్రాలీ (84), బెన్ డకెట్ (94) మెరుపు అర్ధ శతకాలతో ఆకట్టుకోగా.. జో రూట్ 150 పరుగులతో అదరగొట్టాడు. తాజాగా కెప్టెన్ స్టోక్స్ కూడా సెంచరీతో చెలరేగగా.. 149 ఓవర్ల ఆట ముగిసేసరికి ఇంగ్లండ్ ఎనిమిది వికెట్ల నష్టానికి 614 పరుగుల భారీ స్కోరు సాధించింది. టీమిండియా కంటే 256 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది.
చదవండి: గిల్.. నేనైతే ఆ తప్పు చేసేవాడిని కాదు: ఇంగ్లండ్ మాజీ కెప్టెన్