ఇంగ్లండ్ స్టార్ ఆటగాడు జో రూట్ కెరీర్‌లో మరో ఘనతను సొంతం చేసుకున్నాడు. నిన్న (జనవరి 24) శ్రీలంకతో జరిగిన వన్డే మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శనతో (2.3-0-13-2, ఓ క్యాచ్, (90 బంతుల్లో 72; 5 ఫోర్లు)) ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ (POTM) అవార్డు గెలుచుకున్న అతడు..
ఇంగ్లండ్ తరఫున అత్యధిక POTM అవార్డులు (383 మ్యాచ్‌ల్లో 27) సాధించిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. ఈ క్రమంలో కెవిన్ పీటర్సన్ (277 మ్యాచ్‌ల్లో 26) రికార్డును అధిగమించాడు. ఈ జాబితాలో రూట్, కేపీ తర్వాత జోస్ బట్లర్ (24), ఇయాన్ మోర్గాన్ (23) ఉన్నారు.
మ్యాచ్ విషయానికొస్తే.. రూట్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో చెలరేగడంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా జరిగిన రెండో వన్డేలో ఇంగ్లండ్ 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తద్వారా సిరీస్‌లో 1-1తో సమంగా ఉంది.
నిర్ణయాత్మక మూడో వన్డే జనవరి 27న కొలొంబో వేదికగానే జరగనుంది. అనంతరం ఇరు జట్ల మధ్య పల్లెకెలె వేదికగా మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ జరుగనుంది. ఈ సిరీస్ తర్వాత శ్రీలంకతో పాటు భారత్‌లో ప్రపంచకప్ మొదలవుతుంది.
ఎనిమిది మందితో ప్రయోగం
టాస్ ఓడి తొలుత బౌలింగ్ చేసిన ఇంగ్లండ్ ఎనిమిది మంది బౌలర్లను ప్రయోగించింది. తలో చేయి వేయడంతో శ్రీలంక 49.3 ఓవర్లలో 219 పరుగులకే ఆలౌటైంది. ఓవర్టన్, ఆదిల్ రషీద్, రూట్ తలో 2 వికెట్లు తీయగా.. డాసన్, జాక్స్, రెహాన్ అహ్మద్ తలో వికెట్ పడగొట్టారు. లంక ఇన్నింగ్స్‌లో ధనంజయ డిసిల్వ (40), అసలంక (45) ఓ మోస్తరు స్కోర్లు చేశారు.
రాణించిన రూట్
అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ కూడా పరుగులు చేసేందుకు ఇబ్బంది పడినప్పటికీ.. రూట్ (75), బ్రూక్ (42), డకెట్ (39), బట్లర్ (33 నాటౌట్) బాధ్యతాయుతంగా ఆడి తమ జట్టును గెలిపించారు. లంక బౌలర్లలో ధనంజయ డిసిల్వ, వాండర్సే తలో 2, అషిత ఫెర్నాండో ఓ వికెట్ పడగొట్టారు.


