
ప్రపంచ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ 2025 టోర్నీలో ఇండియా ఛాంపియన్స్ కథ దాదాపు ముగిసినట్లే. ఆదివారం లీడ్స్ వేదికగా ఇంగ్లండ్ ఛాంపియన్స్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో 23 పరుగుల తేడాతో భారత్ ఓటమి పాలైంది. 224 పరుగుల లక్ష్య చేధనలో ఆఖరి వరకు టీమిండియా పోరాడింది.
లక్ష్య చేధనలో భారత జట్టు నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 200 పరుగులు మాత్రమే చేయగల్గింది. ఇండియా బ్యాటర్లలో యుసఫ్ పఠాన్ మరోసారి తన బ్యాట్ ఝూళిపించాడు. 29 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 52 పరుగులు చేశాడు.
అతడితో పాటు యువరాజ్ సింగ్(38), బిన్నీ(35) పర్వాలేదన్పించారు. కానీ టాపర్డర్ విఫలం కావడంతో భారత్ ఓటమి చవిచూడాల్సి వచ్చింది. ఇంగ్లండ్ బౌలర్లలో అజ్మల్ షాజాద్ నాలుగు వికెట్లు పడగొట్టగా.. మీకర్ రెండు వికెట్లు సాధించాడు.
బొపారా సూపర్ సెంచరీ..
అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 223 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఇంగ్లండ్ వన్‌డౌన్ బ్యాటర్ రవి బొపారా విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు. 55 బంతుల్లో 8 ఫోర్లు, 8 సిక్స్‌లతో 110 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అతడితో ఇయాన్ బెల్(54), మోయిన్ అలీ(33) రాణించారు. భారత బౌలర్లలో హార్భజన్ సింగ్ రెండు వికెట్లు పడగొట్టగా.. ఆరోన్ ఓ వికెట్ సాధించాడు.
సెమీస్‌కు చేరాలంటే..
కాగా ఈ ఓటమితో భారత్ సెమీస్ చేరే అవకాశాలను మరింత సంక్లిష్టం చేసుకుంది. ఇండియా ఛాంపియన్స్ సెమీస్ చేరాలంటే ఏదైనా అద్బుతం జరగాలి. భారత్‌కు ఇంకా కేవలం ఒక్క మ్యాచ్ మాత్రమే మిగిలి ఉంది. ఈ టోర్నీలో ఇప్పటికే సౌతాఫ్రికా, పాకిస్తాన్, ఆస్ట్రేలియా తమ సెమీస్ బెర్త్‌లను ఖారారు చేసుకున్నాయి.
మరో బెర్త్ కోసం విండీస్, భారత్, ఇంగ్లండ్ పోటీపడతున్నాయి. విండీస్, భారత్ కంటే ఇంగ్లండ్‌కే సెమీస్ చేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఇంగ్లండ్(3 పాయింట్లు) నాలుగో స్ధానంలో ఉంది. భారత్(-1.852), విండీస్(-1.974)తో పోలిస్తే రన్‌రేట్ పరంగా కూడా ఇంగ్లండ్(0.809) ముందంజలో ఉంది. భారత్ తమ ఆఖరి మ్యాచ్‌లో వెస్టిండీస్‌పై భారీ విజయం సాధిస్తే ఇంగ్లండ్‌ను వెనక్కి నెట్టి సెమీస్‌కు క్వాలిఫై అయ్యే ఛాన్స్ ఉంది.