టీమిండియా డాషింగ్ ఓపెనర్ అభిషేక్ శర్మ జోరు కొనసాగిస్తున్నాడు. తాజాగా న్యూజిలాండ్‌తో గువాహటిలో ఆదివారం జరిగిన మూడో టి20 మ్యాచ్‌లోనూ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కివీస్ బౌలర్లపై ఓ రేంజ్‌లో విరుచుకుపడి పరుగుల సునామీ సృష్టించాడు. అభిషేక్‌కు తోడుగా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా దంచుకొట్టుడు కొట్టడంతో 10 ఓవర్లలోనే మ్యాచ్‌ను ముగించేశారు. బంతితో బుమ్రా నిప్పులు చెరగడంతో 8 వికెట్ల తేడాతో కివీస్‌ను టీమిండియా చిత్తుగా ఓడించింది. ఫలితంగా 5 మ్యాచ్‌ల సిరీస్‌ను టీమిండియా 3-0తో కైవసం చేసుకుంది.
ఈ సిరీస్‌లో రెండో అర్ధసెంచరీ నమోదు చేసిన అభిషేక్ శర్మ.. మరో ఘనత సాధించాడు. గువాహటి మ్యాచ్‌లో 14 బంతులోనే 5 ఫోర్లు, 4 సిక్సర్లతో హాఫ్ సెంచరీ బాదేశాడు. దీంతో ఇంటర్నేషనల్ టి20ల్లో తక్కువ బంతుల్లో అర్ధసెంచరీ చేసిన రెండో భారత బ్యాటర్‌గా నిలిచాడు. ఓవరాల్‌గా 7వ ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ నమోదు చేసి సత్తా చాటాడు. మొత్తం 20 బంతులు ఎదుర్కొని 7 ఫోర్లు, 5 సిక్సర్లతో 68 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. 340 స్ట్రైక్‌రేట్‌తో న్యూజిలాండ్ బౌలర్లను ఉతికి ఆరేశాడు. నాగ్‌పూర్‌లో జరిగిన ఫస్ట్ మ్యాచ్‌లోనూ హాఫ్ సెంచరీ (35 బంతుల్లో 84 పరుగులు; 5 ఫోర్లు, 8 సిక్సర్లు) కొట్టాడు.
ఎప్పుడు బ్రేక్ చేస్తావ్?
అభిషేక్ శర్మ ధనాధన్ ఇన్నింగ్స్‌పై మాజీ ఆటగాళ్లు, సీనియర్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. అతడి గురువు యువరాజ్ సింగ్ తన శిష్యుడికి సవాల్ విసిరాడు. తన పేరిట రికార్డ్‌ను ఎప్పుడు బ్రేక్ చేస్తావంటూ ఆట పట్టించాడు. ''ఇంకా 12 బంతుల్లో 50 పరుగులు చేయలేకపోతున్నావా?'' అంటూ ఎక్స్‌లో కామెంట్ పెట్టాడు. ''బాగా ఆడావు, ఇదే జోరు కొనసాగించాల''ని ఎంకరేజ్ చేశాడు. కాగా, టీమిండియా తరపున ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ రికార్డు 19 ఏళ్లుగా యువీ పేరిటే ఉంది. 2007 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌పై 12 బంతుల్లోనే అతడు అర్ధశతకం సాధించి రికార్డు నెలకొల్పాడు.
నెటిజన్ల స్పందన
కాగా, అభిషేక్ శర్మను మోడ్రన్ యువరాజ్ సింగ్‌గా వర్ణిస్తూ.. గురువును రికార్డును అధిగమించే సత్తా శిష్యుడికే ఉందని నెటిజనులు అంటున్నారు. అభిషేక్ శర్మ ఇదే హై కొనసాగిస్తే త్వరలోనే యూవీ రికార్డు బ్రేక్ అవుతుందని అభిప్రాయపడుతున్నారు. కుర్రాడిని ఇలా ట్రోల్ చేయడం కరెక్ట్ కాదని కొంతమంది నెటిజనులు అంటే.. శిష్యుడిని ఉత్సాహపరిచేందుకే యువీ సవాల్ విసిరాడని ఇంకొంత మంది అంటున్నారు. ఏదేమైనా రానున్న టి20 వరల్డ్‌కప్‌లోనూ అభిషేక్ శర్మ ఇదే జోరు కొనసాగించాలని ఏకాభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
చదవండి: రోహిత్‌శర్మపై అభిషేక్ ఆసక్తికర వ్యాఖ్యలు
భారత్- న్యూజిలాండ్ జట్ల మధ్య నాలుగో మ్యాచ్ ఈ నెల 26న విశాఖపట్నంలో జరుగుతుంది. చివరి మ్యాచ్ ఈ నెల 31న తిరువనంతపురంలో జరగనుంది. చూడాలి మరి.. ఈ రెండు మ్యాచ్‌ల్లో అభిషేక్ శర్మ గురువు రికార్డును బ్రేక్ చేస్తాడో, లేదో!
Still can’t get a 50 off 12 balls, can you? 🤪 Well played - keep going strong! 💪🏻 @OfficialAbhi04 #IndVSNz pic.twitter.com/6MQe1p6sx4
— Yuvraj Singh (@YUVSTRONG12) January 25, 2026


