టీమిండియా సీనియర్ బ్యాటర్ రోహిత్ శర్మపై యువ ఓపెనర్ అభిషేక్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. హిట్‌మాన్ అడుగుజాడల్లో నడుస్తున్నానని చెప్పాడు. టి20 పవర్ ప్లేలో రోహిత్ శర్మలా ఆడటానికి ప్రయత్నిస్తున్నానని అన్నాడు. తనపై హిట్‌మాన్ ప్రభావం గురించి జియోస్టార్‌తో మాట్లాడుతూ.. "రోహిత్ భాయ్ దేశం కోసం చాలా చేశాడు. పవర్‌ప్లేలో అతడు ఇచ్చే ప్రారంభాల కారణంగా ఎల్లప్పుడూ ఒత్తిడి ఉంటుందని అన్నాడు. రోహిత్ శర్మ పాత్ర పోషించాలని కోచ్ గౌతమ్ గంభీర్ తనకు సూచించినట్టు వెల్లడించాడు.
గంభీర్‌తో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) ప్రోత్సహంతో తాను రోహిత్ శర్మ ఫార్ములాను అనుసరిస్తున్నానని అభిషేక్ తెలిపాడు. "నేను జట్టులోకి వచ్చినప్పుడు.. కోచ్, కెప్టెన్ నా నుంచి అదే ఆశించారు. తొలి బంతి నుంచే విరుచుకుపడడం నాకు ఇష్టం కాబట్టి.. అది నా శైలికి కూడా సరిపోతుందని భావించాను. రోహిత్ భాయ్ అడుగుజాడల్లో నడుస్తున్నాను. టీమిండియా తరపున ఇలా ఆడుతూ రాణించడం నాకు నిజంగా సంతోషంగా ఉంద''ని అన్నాడు.
దూకుడుగా ఆడటమే నా పని
తన ఆటతీరును మెరుగు పరుచుకోవడానికి నిరంతరం ప్రయత్నిస్తూ ఉంటానని అభిషేక్ శర్మ చెప్పాడు. పవర్ ప్లేలో దూకుడుగా ఆడి.. జట్టు భారీస్కోరుకు బాటలు వేయాలని భావిస్తానని చెప్పాడు. "నేను ఇంకా పూర్తిగా పరిణతి చెందానని చెప్పను, ఎందుకంటే ఎల్లప్పుడూ మెరుగుపడటానికి అవకాశం ఉంటుంది. కానీ మొదటి ఆరు ఓవర్లలో దూకుడుగా క్రికెట్ ఆడటమే నా పని అని భావిస్తున్నాను. దీని కోసం చాలా ప్రాక్టీస్ చేస్తున్నాను. నేను మంచి ఆరంభం ఇస్తే జట్టు ఆ ఊపును అనుసరించగలదని నాకు తెలుసు. అందుకే జట్టుకు ఆరంభం ఇవ్వాలని ప్రతిసారి అనుకుంటాన''ని ఈ డాషింగ్ ఓపెనర్ పేర్కొన్నాడు.
వారితో ప్రాక్టీస్ చేస్తా
టి20 ప్రపంచకప్‌కు సన్నద్ధత కోసం మాట్లాడుతూ.. తన దూకుడుకు అనుగుణంగా ప్రాక్టీస్ చేస్తానని, మ్యాచ్‌లకు ముందు తానెప్పుడూ ఇదే ఫాలో అవుతానని అన్నాడు. ''నాకు వారం లేదా 10 రోజులు సమయం దొరికినప్పుడు, తదుపరి సిరీస్ లేదా మ్యాచ్‌లలో నేను ఎదుర్కొనబోయే బౌలర్లను గుర్తుంచుకుంటాను. వారిలా బౌలింగ్ చేసే వారితో ప్రాక్టీస్ చేస్తాను. కొత్త బంతితో అవుట్-స్వింగర్లు, ఇన్-స్వింగర్లు వేయమని చెప్పి బ్యాటింగ్ చేస్తుంటాను. టి20 వరల్డ్‌కప్‌లో భాగంగా దేశవ్యాప్తంగా భిన్నమైన పరిస్థిల్లో వేర్వేరు జట్లతో ఆడాల్సి ఉంటుంది కాబట్టి ప్రిపరేషన్ చాలా ముఖ్యమ''ని అభిషేక్ అభిప్రాయపడ్డాడు.
పవర్ హిట్టింగ్‌తో హిట్
2024, జూలైలో టి20లో అరంగేట్రం చేసిన అభిషేక్ శర్మ పవర్ హిట్టింగ్‌తో తన స్థానాన్ని జట్టులో సుస్థిరం చేసుకున్నాడు. అతి తక్కువ కాలంలోనే నంబర్‌వన్ బ్యాటర్ ఎదిగాడు. ఇప్పటివరకు 34 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు ఆడి 190.92 స్ట్రైక్ రేట్‌తో 1199 పరుగులు సాధించాడు. ఇందులో రెండు సెంచరీలు, ఏడు అర్ధ సెంచరీలు ఉన్నాయి. కాగా, ఫిబ్రవరి 7 నుంచి జరిగే టి20 ప్రపంచకప్‌లోనూ తన జోరును కొనసాగించాలని ఈ ఎడంచేతి వాటం ఓపెనర్ ఉవ్విళ్లూరుతున్నాడు.
చదవండి: ప్రధాని తర్వాత కష్టమైన జాబ్.. గంభీర్‌పై ప్రశంసలు


