చరిత్ర సృష్టించిన స్టోక్స్‌!.. ఇంగ్లండ్‌ ఆలౌట్‌.. స్కోరెంతంటే! | Ind vs Eng 4th Test: Stokes Creates History England All Out For 669 | Sakshi
Sakshi News home page

చరిత్ర సృష్టించిన స్టోక్స్‌!.. ఇంగ్లండ్‌ ఆలౌట్‌.. స్కోరెంతంటే!

Jul 26 2025 5:13 PM | Updated on Jul 26 2025 6:27 PM

Ind vs Eng 4th Test: Stokes Creates History England All Out For 669

ఇంగ్లండ్‌ కెప్టెన్‌ బెన్‌ స్టోక్స్‌ (Ben Stokes) సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఒకే టెస్టు మ్యాచ్‌లో ఐదు వికెట్లు తీయడంతో పాటు శతకం సాధించిన సారథుల సరసన చేరాడు. ఇంగ్లండ్‌ తరఫున ఈ ఫీట్‌ నమోదు చేసిన తొలి కెప్టెన్‌గానూ చరిత్రకెక్కాడు.

ఆండర్సన్‌- టెండుల్కర్‌ ట్రోఫీ (Tendulkar- Anderson Trophy)లో భాగంగా భారత్‌- ఇంగ్లండ్‌ (Ind vs Eng) మధ్య నాలుగో టెస్టులో స్టోక్స్‌.. టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు కూల్చాడు. సాయి సుదర్శన్‌ (61), శుబ్‌మన్‌ గిల్‌ (12)ల రూపంలో రెండు కీల​క వికెట్లు కూల్చిన స్టోక్స్‌.. శార్దూల్‌ ఠాకూర్‌ (41), వాషింగ్టన్‌ సుందర్‌ (27), అన్షుల్‌ కంబోజ్‌ (0) వికెట్లు కూడా తన ఖాతాలో వేసుకున్నాడు.

141 పరుగులు
అనంతరం బ్యాటింగ్‌లోనూ ఈ ఎడమచేతి వాటం బ్యాటర్‌ ఇరగదీశాడు. శనివారం నాటి నాలుగో రోజు ఆటలో భాగంగా స్టోక్స్‌ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మహ్మద్‌ సిరాజ్‌ బౌలింగ్‌లో ఫోర్‌ బాది వంద పరుగుల మార్కు దాటాడు. 

మొత్తంగా 198 బంతులు ఎదుర్కొన్న స్టోక్స్‌.. 11 ఫోర్లు, మూడు సిక్సర్ల సాయంతో 141 పరుగులు సాధించాడు. భారత స్పిన్నర్‌ రవీంద్ర జడేజా బౌలింగ్‌లో సాయి సుదర్శన్‌కు క్యాచ్‌ ఇవ్వడంతో స్టోక్స్‌ శతక ఇన్నింగ్స్‌కు తెరపడింది.

ఒకే టెస్టు మ్యాచ్‌లో ఐదు వికెట్లు తీయడంతో పాటు సెంచరీ చేసిన కెప్టెన్లు వీరే
🏏డెనిస్‌ అట్కిన్సన్‌ (వెస్టిండీస్‌)- 1955లో ఆస్ట్రేలియా మీద
🏏గ్యారీ సోబర్స్‌ (వెస్టిండీస్‌)- 1966లో ఇంగ్లండ్‌ మీద
🏏ముష్తాక్‌ మొహమ్మద్‌ (పాకిస్తాన్‌​)- 1977లో వెస్టిండీస్‌ మీద
🏏ఇమ్రాన్‌ ఖాన్‌ (పాకిస్తాన్‌)- 1983లో టీమిండియా మీద
🏏బెన్‌ స్టోక్స్‌ (ఇంగ్లండ్‌)- 2025లో టీమిండియా మీద

ఇంగ్లండ్‌ ఆలౌట్‌.. స్కోరెంతంటే?
ఇదిలా ఉంటే.. 544/7 ఓవర్‌నైట్‌ స్కోరుతో శనివారం ఆట మొదలుపెట్టిన ఇంగ్లండ్‌ కాసేపటికే లియామ్‌ డాసన్‌ (26) వికెట్‌ కోల్పోయింది. జస్‌ప్రీత్‌ బుమ్రా బౌలింగ్‌లో అతడు బౌల్డ్‌ అయ్యాడు. స్టోక్స్‌ వికెట్‌ను జడేజా దక్కించుకున్నాడు. అదే విధంగా.. బ్రైడన్‌ కార్స్‌ (47)ను వెనక్కి పంపాడు. దీంతో ఇంగ్లండ్‌ 157.1 ఓవర్లలో 669 పరుగులు స్కోరు చేసి ఆలౌట్‌ అయింది. టీమిండియా కంటే తొలి ఇన్నింగ్స్‌లో ఏకంగా 311 పరుగుల ఆధిక్యంలో నిలిచింది.

భారత బౌలర్లలో జడ్డూ అత్యధికంగా నాలుగు వికెట్లు పడగొట్టగా.. వాషింగ్టన్‌ సుందర్‌, బుమ్రా రెండేసి వికెట్లు తమ ఖాతాలో వేసుకున్నారు. అరంగేట్ర పేసర్‌ అన్షుల్‌ కంబోజ్‌, మహ్మద్‌ సిరాజ్‌ ఒక్కో వికెట్‌ దక్కించుకున్నారు. 

చదవండి: గిల్‌.. నేనైతే ఆ తప్పు చేసేవాడిని కాదు: ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement