
లండన్‌లోని ఓవల్ వేదికగా ఇంగ్లండ్ జరగనున్న ఐదో టెస్టుకు ముందు టీమిండియాకు భారీ షాక్ తగిలింది. నాలుగో టెస్టులో గాయపడిన స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ ఓవల్ టెస్టుకు దూరమయ్యాడు. మాంచెస్టర్‌లో టెస్టులో బంతి బలంగా తాకడంతో కుడి కాలి బొటనవేలి ఫ్రాక్చర్ అయింది. ఈ క్రమంలోనే తిరిగి స్వదేశానికి పయనమయ్యాడు. ఈ విషయాన్ని బీసీసీఐ ధ్రువీకరించింది.
"మాంచెస్టర్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన నాల్గవ టెస్ట్ సందర్భంగా పంత్ కుడి పాదానికి ఫ్రాక్చర్ అయింది. దీంతో ఈ సిరీస్‌లోని ఆఖరి టెస్టుకు అతడు దూరమయ్యాడు. అతడు బీసీసీఐ వైద్య బృందం పర్యవేక్షణలో ఉండనున్నాడు. త్వరగా కోలుకుని తిరిగి మైదానంలో అడుగుపెట్టాలని" ఆశిస్తున్నామని బీసీసీఐ ఓ ప్రకటనలో పేర్కొంది.
కాగా ఇది నిజంగా భారత్‌కు గట్టి ఎదురు దెబ్బ అనే చెప్పుకోవాలి. రిషబ్ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఈ సిరీస్‌లో 4 మ్యాచ్‌లు ఆడి 479 పరుగులు చేశాడు. ఇక అతడి స్ధానాన్ని వికెట్ కీపర్ బ్యాటర్ నారాయణ్ జగదీశన్‌తో సెలక్టర్లతో భర్తీ చేశారు.
జట్టులో పంత్‌కు ప్రత్యామ్నాయంగా ధ్రువ్ జురెల్ ఉన్నప్పటికి, బ్యాకప్ వికెట్ కీపర్‌గా జగదీశన్‌ను తీసుకున్నారు. జగదీశన్ ఇప్పటికే లండన్‌కు చేరుకున్నాడు. ఈ క్రమంలో ఎవరీ జగదీశన్ అని నెటిజన్లు తెగ వెతికేస్తున్నారు.
ఎవరీ జగదీశన్..?
తమిళనాడుకు చెందిన టాలెంటడ్ వికెట్ కీపర్ బ్యాటర్ జగదీశన్.. దేశవాళీ క్రికెట్‌లో తనకంటూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో జగదీశన్‌కు అద్బుతమైన రికార్డు ఉంది. ఇప్పటివరకు 52 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడిన నారాయణ్.. 47.50 సగటుతో 3,373 పరుగులు. అందులో 10 సెంచరీలు, 14 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
గత రంజీ ట్రోఫీ సీజన్‌లో జగదీశన్ తమిళనాడు తరపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఎనిమిది మ్యాచ్‌లలో 56.16 సగటుతో 674 పరుగులు చేశాడు. ఇందులో రెండు సెంచరీలు, ఐదు అర్ధ సెంచరీలు ఉన్నాయి. లిస్ట్-ఎ క్రికెట్, టీ20ల్లో కూడా అతడు అదరగొడుతున్నాడు. లిస్ట్-ఏ క్రికెట్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ (277).. వరుసగా ఐదు ఇన్నింగ్స్‌లతో సెంచరీలు చేసిన వరల్డ్ రికార్డు అతడి పేరిట ఉన్నాయి.
చదవండి: మీ వాళ్లైతే ఇలాగే చేస్తావా?.. స్టోక్స్‌పై మండిపడ్డ గంభీర్