
టీమిండియా స్టార్ క్రికెటర్ రవీంద్ర జడేజా (Ravindra Jadeja) ఇంగ్లండ్ గడ్డ మీద అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు. లార్డ్స్‌లో జరిగిన మూడో టెస్టులో ఆఖరి వరకు పోరాడిన జడ్డూ.. తాజాగా నాలుగో టెస్టులోనూ పట్టుదలగా నిలబడ్డాడు. సహచర ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ (Washington Sundar)తో కలిసి శతక్కొట్టి మ్యాచ్ డ్రా కావడంలో కీలక పాత్ర పోషించాడు.
ఈ క్రమంలోనే రవీంద్ర జడేజా సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఇంగ్లండ్ గడ్డ మీద 30కి పైగా వికెట్లు తీయడంతో పాటు.. వెయ్యి పరుగులు పూర్తి చేసుకున్న ఆల్‌రౌండర్‌గా రెండో ఆల్‌రౌండర్‌గా అరుదైన ఘనత సాధించాడు. కాగా టెండుల్కర్- ఆండర్సన్ ట్రోఫీ (Tendulkar- Anderson Trophy) ఆడేందుకు టీమిండియా ఇంగ్లండ్‌లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే.
జడేజా వీరోచిత పోరాటం
ఇందులో భాగంగా లీడ్స్ టెస్టులో 36 పరుగులు చేసిన జడేజా.. ఒక వికెట్ తీశాడు. ఎడ్జ్‌బాస్టన్ టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో 89 విలువైన పరుగులు చేసిన జడ్డూ.. రెండో ఇన్నింగ్స్‌లో 69 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. అదే విధంగా.. ఈ మ్యాచ్‌లో ఒక వికెట్ కూడా పడగొట్టాడు.
ఇక ప్రఖ్యాత లార్డ్స్ మైదానంలో జడేజా రెండు అద్భుత అర్ధ శతకాలు (72, 61 నాటౌట్) చేశాడు. అంతేకాదు.. ఒక వికెట్ కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే, మాంచెస్టర్ టెస్టులో క్లిష్ట పరిస్థితుల్లో ఈ ఎడమచేతి వాటం బ్యాటర్.. తన హాఫ్ సెంచరీని శతకంగా మలిచాడు. తొలి ఇన్నింగ్స్‌లో 20 పరుగులే చేసినప్పటికీ.. రెండో ఇన్నింగ్స్‌లో అజేయ శతకం (107)తో మెరిశాడు. అదే విధంగా.. ఈ లెఫ్టార్మ్ స్పిన్నర్ నాలుగు వికెట్లతో సత్తా చాటాడు.
రెండో ఆల్‌రౌండర్‌గా అరుదైన ఘనత
ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ గడ్డ మీద ఇప్పటి వరకు 34 వికెట్లు తీయడంతో పాటు వెయ్యి పరుగులు పూర్తి చేసుకున్నాడు జడ్డూ. తద్వారా వెస్టిండీస్ దిగ్గజం గ్యారీఫీల్డ్ సోబర్స్ తర్వాత ఇంగ్లండ్‌లో 30కి పైగా వికెట్లు తీయడంతో పాటు వెయ్యి పరుగులు సాధించిన రెండో ఆల్‌రౌండర్‌గా చరిత్రకెక్కాడు.
ఇక ఓవరాల్‌గా విదేశీ గడ్డ మీద ఈ ఘనత సాధించిన మూడో ఆల్‌రౌండర్ జడ్డూ. అతడి కంటే ముందు సోబర్స్‌తో పాటు ఇంగ్లండ్‌కు చెందిన విల్‌ఫ్రెడ్ రోడ్స్ ఈ ఫీట్ నమోదు చేశారు.
‘డ్రా’ గా ముగిసిన నాలుగో టెస్టు
కాగా మాంచెస్టర్ వేదికగా బుధవారం - ఆదివారం జరిగిన నాలుగో టెస్టు డ్రా అయింది. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 358 పరుగులకు ఆలౌట్ కాగా.. ఇంగ్లండ్ తమ మొదటి ఇన్నింగ్స్‌లో ఏకంగా 669 పరుగులు చేసింది. తద్వారా 311 పరుగుల ఆధిక్యం సంపాదించింది.
ఈ క్రమంలో రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన భారత్ సున్నా పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాలో పడిన వేళ.. కెప్టెన్ శుబ్‌మన్ గిల్ అద్భుత శతకం (103) సాధించగా.. ఓపెనర్ కేఎల్ రాహుల్ భారీ హాఫ్ సెంచరీ (90)తో ఆకట్టుకున్నాడు.
ఇక స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్లు వాషింగ్టన్ సుందర్ (101 నాటౌట్), రవీంద్ర జడేజా కలిసి ఐదో వికెట్‌కు ఏకంగా 203 పరుగుల భాగస్వామ్యం నమోదు చేసి.. ఓడిపోతుందనుకున్న మ్యాచ్‌ను డ్రాతో గట్టెక్కించారు.
ఇక ఇప్పటికి ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 2-1తో ముందున్న ఇంగ్లండ్‌కు.. ఓవల్‌లో జరిగే ఐదో టెస్టులో చెక్ పెట్టి సిరీస్‌ను డ్రా చేసుకోవాలని టీమిండియా భావిస్తోంది.
చదవండి: మీ వాళ్లైతే ఇలాగే చేస్తావా?.. స్టోక్స్‌పై మండిపడ్డ గంభీర్