
ఇంగ్లండ్‌తో నాలుగో టెస్టు (Ind vs Eng)లో టీమిండియా తడబడుతోంది. బ్యాటర్లు రాణించినా.. బౌలర్లు మాత్రం తేలిపోతున్నారు. గురువారం నాటి రెండో రోజు ఆటలో ఇంగ్లండ్ ఒక్క సెషన్‌లోనే 148 పరుగులు చేయడం ఇందుకు నిదర్శనం. ప్రధాన పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా (13 ఓవర్లలో 37 రన్స్) వికెట్ తీసేందుకు విఫలయత్నం చేయగా.. మహ్మద్ సిరాజ్ (10 ఓవర్లలో 58) ధారాళంగా పరుగులు సమర్పించుకున్నాడు.
మరోవైపు.. అరంగేట్ర పేసర్ అన్షుల్ కంబోజ్ (Anshul Kamboj) పరుగులు ఇచ్చుకున్నా ఎట్టకేలకు.. బెన్ డకెట్ (100 బంతుల్లో 94) రూపంలో తొలి అంతర్జాతీయ వికెట్ దక్కించుకున్నాడు. మరోవైపు.. స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా (8 ఓవర్లలో 37) కూడా వికెట్ తీసి సత్తా చాటాడు.
శార్దూల్ ఠాకూర్ మరోసారి..
అయితే, బ్యాటింగ్‌లో డెప్త్ కోసమంటూ మరోసారి జట్టులోకి తీసుకున్న పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్ (Shardul Thakur).. తొలి ఇన్నింగ్స్‌లో 41 పరుగులు చేసి ఫర్వాలేదనిపించాడు. కానీ బౌలింగ్‌లో మరోసారి విఫలమయ్యాడు. కేవలం ఐదు ఓవర్లలోనే 35 పరుగులు సమర్పించేసుకున్నాడు.
భారత బౌలర్ల వైఫల్యం కారణంగా ఇంగ్లండ్ రెండో రోజు ఆట ముగిసే సరికి కేవలం రెండు వికెట్లు నష్టపోయి 225 పరుగులు సాధించింది. ఈ నేపథ్యంలో టీమిండియా బౌలింగ్ విభాగం గురించి భారత స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్ కీలక వ్యాఖ్యలు చేశాడు.
బ్యాటింగ్ డెప్త్ పిచ్చిలో పడి మేనేజ్‌మెంట్ తప్పుల మీద తప్పులు చేస్తోందంటూ విమర్శించాడు. చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌ను బెంచ్‌కే పరిమితం చేయడాన్ని తప్పుబట్టాడు.
‘‘ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్ చేయగల సత్తా ఉందని ఓ ఆటగాడిని తీసుకుంటే మీకు 20- 30 అదనపు పరుగులు రావొచ్చు. కానీ అదే ప్లేయర్‌కు బదులు 2- 3 వికెట్లు తీయగల బౌలర్‌ను తీసుకుంటే.. అది టెస్టు స్వరూపాన్నే మార్చివేస్తుంది.
మనోడు.. అప్పుడే స్టోక్స్ అయిపోలేదు
లార్డ్స్, బర్మింగ్‌హామ్ టెస్టులో నితీశ్ కుమార్ రెడ్డిని ఆడించాలని యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. కానీ ఏం జరిగింది? అతడు ఇప్పుడే బెన్ స్టోక్స్ స్థాయికి చేరుకోలేడు కదా!
ఆరో స్థానంలో బ్యాటింగ్ చేసే.. నితీశ్ కుమార్ రెడ్డి గాయం కారణంగా దూరమైన తర్వాత.. మరో ఆలోచనకు తావు లేకుండా కుల్దీప్ యాదవ్‌ను ఆడించాల్సింది. బుమ్రా పనిభారం గురించి కాస్త పక్కనపెడితే.. కుల్దీప్ ఉంటే జట్టుకు ఎంతో ప్రయోజనకరంగా ఉండేది.
ఇదేం పిచ్చి?
ఏదేమైనా తొలి నాలుగు టెస్టుల్లో కుల్దీప్ యాదవ్‌ను ఆడించకపోవడం నాకైతే ఆశ్చర్యంగా ఉంది. 20 నుంచి 30 అదనపు పరుగుల కోసం బ్యాటింగ్ డెప్త్ అనే పిచ్చిలో పడిపోతున్నాం’’ అంటూ అశ్విన్ నాయకత్వ బృందంలో భాగమైన కెప్టెన్ శుబ్‌మన్ గిల్, హెడ్‌కోచ్ గౌతం గంభీర్‌ల తీరును ఘాటుగా విమర్శించాడు.
కాగా రెండో టెస్టులో కేవలం రెండు పరుగులే చేసిన ఆంధ్ర ఆల్‌రౌండర్ నితీశ్ రెడ్డి.. ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. ఇక లార్డ్స్‌లో జరిగిన మూడో టెస్టులో 43 పరుగులు చేసిన నితీశ్ రెడ్డి.. మూడు వికెట్లు తీయగలిగాడు. మోకాలి గాయం కారణంగా నాలుగు, ఐదో టెస్టులకు అతడు దూరమయ్యాడు.
చదవండి: సిరాజ్‌ను కాదని అతడికి బంతినిస్తారా? బుమ్రాకు ఏమైంది?: పాంటింగ్ ఫైర్